Coconut Water vs ORS : సాధారణంగా నిర్జలీకరణం (dehydration) అయినప్పుడు చాలామంది కొబ్బరినీళ్లు లేదా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ORS) ప్యాకెట్‌ను తీసుకుంటారు. అయితే, ఈ రెండింటిలో ఏది ఉత్తమం అనేది సమస్య తీవ్రతను బట్టి ఉంటుంది. వైద్యులు సాధారణంగా డీహైడ్రేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు, ముఖ్యంగా వాంతులు, విరేచనాల కారణంగా శక్తి కోల్పోయినప్పుడు ఓఆర్ఎస్ ను తీసుకోవాలని సూచిస్తారు. ఎందుకంటే, ఓఆర్ఎస్‌లో శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు (సోడియం, పొటాషియం, క్లోరైడ్) గ్లూకోజ్ సరైన నిష్పత్తిలో ఉంటాయి. ఇది శరీరంలో నీటి శాతాన్ని, ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేయడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది.
మరోవైపు, కొబ్బరినీళ్లు ఒక సహజసిద్ధమైన పానీయం. ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. కానీ సోడియం శాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి, సాధారణ నీరసం, కొద్దిపాటి డీహైడ్రేషన్ ఉన్నప్పుడు కొబ్బరినీళ్లు మంచిదే. ముఖ్యంగా వేసవిలో శరీరానికి చలువనివ్వడానికి, శక్తినివ్వడానికి కొబ్బరినీళ్లు తాగడం మంచిది. ఇది శరీరానికి తేలికపాటి రీఫ్రెష్‌మెంట్ ఇస్తుంది.
కొబ్బరినీళ్లు ఎలా సహాయపడతాయి?
కొబ్బరినీళ్లలో ఉండే సహజ చక్కెరలు, ఎలక్ట్రోలైట్లు శరీరానికి తక్షణ శక్తినిస్తాయి. ఇందులో ముఖ్యంగా ఉండే పొటాషియం, కండరాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు లేనప్పుడు, ఉదాహరణకు వేసవిలో ఎక్కువ సేపు ఎండలో ఉండటం వల్ల కలిగే అలసట, నీరసం వంటి వాటికి కొబ్బరినీళ్లు బాగా పనిచేస్తాయి.
ఓఆర్ఎస్ ఎప్పుడు తీసుకోవాలి?
తీవ్రమైన డీహైడ్రేషన్ ఉన్నప్పుడు, ముఖ్యంగా డయేరియా (అతిసారం), తీవ్రమైన వాంతులు అయినప్పుడు శరీరం నుండి ఎలక్ట్రోలైట్లు, నీరు భారీగా కోల్పోతాయి. ఈ పరిస్థితుల్లో కొబ్బరినీళ్లు సరిపోవు. ఓఆర్ఎస్ తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన సోడియం, గ్లూకోజ్, ఇతర లవణాలు వేగంగా అందుతాయి. ఇది డీహైడ్రేషన్‌ను నివారించడమే కాకుండా, శరీరంలోని కీలక విధులను సాధారణ స్థితికి తీసుకురావడానికి సహాయపడుతుంది. జ్వరం, తీవ్రమైన శారీరక శ్రమ తర్వాత కూడా ఓఆర్ఎస్ తీసుకోవడం వల్ల త్వరగా కోలుకోవచ్చు.
బాడీలో మార్పులు, శక్తి
కొబ్బరినీళ్లు తీసుకున్నప్పుడు: శరీరం తాత్కాలికంగా చల్లబడి, త్వరగా శక్తిని పొందినట్లు అనిపిస్తుంది. ఇది సాధారణ అలసటను తగ్గిస్తుంది, కానీ తీవ్రమైన డీహైడ్రేషన్‌ను పూర్తిగా సరిచేయదు. ఎందుకంటే అది నేచురల్, ఎలాంటి మిశ్రమాలు అందులో యాడ్ చేయరు.
ఓఆర్ఎస్ తీసుకున్నప్పుడు: శరీరం కోల్పోయిన లవణాలు, నీటిని వేగంగా తిరిగి పొందుతుంది. దీనివల్ల డీహైడ్రేషన్ లక్షణాలు (ఉదాహరణకు, తల తిరగడం, నోరు ఎండిపోవడం, బలహీనత) త్వరగా తగ్గి, శరీరం యధాస్థితికి వస్తుంది. ఇది శరీరానికి అత్యవసర సమయంలో ఒక బూస్టర్ లాగా పనిచేస్తుంది.
ఏది తీసుకోవాలనేది మీ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. మీకు ఏది సరైనదో తెలుసుకోవడానికి వైద్యుడిని సంప్రదించడం ఎల్లప్పుడూ ఉత్తమం. అయితే,కొందరు అన్ని వ్యాధులకుసొంత వైద్యం చేస్తుంటారు. అలా చేయడం మంచిది కాదు. కొన్నిసార్లు శరీరం ఇబ్బందులకు గురికావాల్సి రావొచ్చు.