Heart Attack : చైనా దూకుడు మామూలుగా లేదు. ప్రతీ రంగంలోనూ అది దూసుకుపోతోంది. తాజాగా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌లను నివారించడానికి కూడా చైనా వ్యాక్సిన్‌ను తయారు చేసింది. రక్తనాళాలు గట్టిపడడం, రక్తవాహికల్లో రక్త ప్రవాహానికి అడ్డుగా కొవ్వు పొరలు (ప్లేక్స్) ఏర్పడటం వల్ల గుండెపోటు వస్తుంటుంది. ఇలా జరగడానికి నివారించేందుకు చైనా గుండెపోటు వ్యాక్సిన్ దోహదం చేస్తుందట. దీన్ని నాన్జింగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, చైనా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంయుక్తంగా తయారు చేశాయి. ఈ వ్యాక్సిన్ ‘కాక్‌టైల్’ రూపంలో లభిస్తుంది. ‘పీ210 యాంటీజెన్’ అనే ప్రొటీన్ ఈ వ్యాక్సిన్‌లో(Heart Attack) ఉంటుంది. రక్తనాళాలు పెళుసుబారకుండా, రక్త వాహికల్లో కొవ్వు పొరలు (ప్లేక్స్) ఏర్పడకుండా ఈ ప్రోటీన్ నిరోధిస్తుంది. ఈ వ్యాక్సిన్‌తో ఎలుకలపై నిర్వహించిన ట్రయల్స్ సక్సెస్ అయ్యాయి. తదుపరిగా మనుషులపైనా ట్రయల్స్ చేయనున్నారు. వాటిలోనూ సత్ఫలితాలు వస్తే.. తదుపరిగా మనుషుల కోసం ఈ వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తారు.
కొన్ని ఘటనలివీ..
- 46ఏళ్ల కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో చనిపోయారు.
- 41ఏళ్ల టీవీ నటుడు సిద్ధార్థ్ శుక్లా గుండెపోటుతో కన్నుమూశారు.
- 59ఏళ్ల హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ జిమ్‌లో వ్యాయామం చేస్తూనే కన్నుమూశారు.
- జమ్మూకశ్మీర్‌లో 21ఏళ్ల యువకుడు డ్యాన్స్ చేస్తూనే గుండెపోటుతో స్టేజీపై కుప్పకూలాడు.
- ముంబైలో 35ఏళ్ల వ్యక్తి గర్బా ఆడుతూ గుండె పోటుతో తుదిశ్వాస విడిచారు.
- 2022లో 33ఏళ్ల జిమ్ ట్రైనర్ కూర్చున్నప్పుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. గుండె పోటుతో మరణించాడని డాక్టర్లు చెప్పారు.
Also Read :HMDA Expansion :హెచ్‌ఎండీఏ పరిధిని విస్తరిస్తూ ఉత్తర్వులు.. ‘ఫ్యూచర్ సిటీ’లోకి 56 గ్రామాలు
గుండెపోటుకు ప్రధాన కారణాలివీ..
- చాలా మంది గంటల తరబడి పని చేస్తుంటారు. అయితే జంక్ ఫుడ్ తీసుకుంటారు. దీనివల్ల బాడీలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండెకు తగినంత రక్త ప్రసరణ, ఆక్సీజన్ సరఫరా జరగదు. దీనివల్లే గుండెపోటు వస్తుంది.
- గుండెపోటుకు ప్రధాన కారణం మానసిక ఒత్తిడి. బాధలు, ఒత్తిడి, ప్రతికూల భావోద్వేగాలు హృదయ స్పందన రేటును పెంచుతాయి.
- శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా గుండెపోటు వస్తుంది. శరీరానికి కనీస వ్యాయామం అవసరం. వ్యాయామం లేకపోతే శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇదే గుండెపోటుకు దారితీస్తుంది.
- కొందరికి వంశపారంపర్యంగా గుండెపోటు వస్తుంటుంది.
- ధూమపానం, మద్యపానం అలవాట్లు కలిగిన వారికి.. అధిక బరువున్న వారికి గుండెపోటు ముప్పు ఎక్కువ.