Omicron : తెలంగాణాలో డేంజ‌ర్..ఓమిక్రాన్ సామూహిక వ్యాప్తి..!

కోవిడ్ 19 విష‌యంలో కేసీఆర్ ప్ర‌భుత్వం తొలి నుంచి ఉదాసీనంగా ఉంది. ఫ‌లితంగా ప్ర‌జ‌లు భారీ మూల్యం చెల్లించుకున్నారు. ప్రాణాల‌ను వేలాది మంది కోల్పోయారు. ఆర్థికంగా ఆస్ప‌త్రుల బిల్లుల‌తో చితికి పోయారు.

  • Written By:
  • Updated On - January 6, 2022 / 03:29 PM IST

కోవిడ్ 19 విష‌యంలో కేసీఆర్ ప్ర‌భుత్వం తొలి నుంచి ఉదాసీనంగా ఉంది. ఫ‌లితంగా ప్ర‌జ‌లు భారీ మూల్యం చెల్లించుకున్నారు. ప్రాణాల‌ను వేలాది మంది కోల్పోయారు. ఆర్థికంగా ఆస్ప‌త్రుల బిల్లుల‌తో చితికి పోయారు. వాస్త‌వాల‌కు భిన్నంగా అద్భుతంగా క‌రోనా బాధితుల్ని ఆదుకుంద‌ని కేసీఆర్ స‌ర్కార్ చెబుతోంది. కాద‌ని నిరూపించ‌డానికి మీడియా సైతం ధైర్యం చేయ‌లేక‌పోయింది. కోవిడ్ 19 వైర‌స్ తెలంగాణ‌కు తాక‌ద‌ని అసెంబ్లీ వేదిక‌గా కేసీఆర్ చెప్పాడు. ఉష్ణోగ్ర‌త‌లు 30 డిగ్రీల‌కు పైగా ఉంటాయ‌ని వైర‌స్ మ‌ల‌మ‌ల మాడిపోతుంద‌ని కోవిడ్ మొద‌టి వేవ్ సంద‌ర్భంగా సీఎం చెప్పాడు. సీన్ క‌ట్ చేస్తే..ఏమ‌యిందో అంద‌రికీ తెలుసు.ఇక రెండో వేవ్ సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌భుత్వం ఘోరంగా వైఫ‌ల్యం చెందింది. ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టానుసారంగా రోగుల‌ను దోచుకున్నాయి. భారీ బిల్లుల‌పై మీడియా ఫోక‌స్ చేసింది. క‌నీసం రూ. 3 ల‌క్ష‌ల నుంచి రూ. 30ల‌క్ష‌ల వ‌ర‌కు చార్జి చేసిన ఆస్ప‌త్రులు ఉన్నాయి. కానీ, ప్ర‌భుత్వం మాత్రం ఏ మాత్రం ప‌ట్టించుకోలేదు. దీంతో ప్ర‌జ‌లు విసిగిపోయారు. రెండో వేవ్ చివ‌రికు వ‌చ్చిన త‌రువాత సీఎం కేసీఆర్ బ‌య‌ట‌కు వ‌చ్చాడు. గాంధీ ఆస్ప‌త్రితో పాటు ప‌లు ఆస్ప‌త్రుల‌ను సంద‌ర్శించాడు. అప్ప‌టికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆర్థికంగా చితికిపోయారు. ఫ‌లితంగా ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని గ్ర‌హించిన కేసీఆర్ మీడియాలో ఫోక‌స్ అయ్యాడు. సీన్ క‌ట్ చేస్తే…ఆనాడు వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రిగా ఉన్న ఈటెల‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డంతో ప్ర‌జ‌ల్ని మ‌రిపించాడు.

మూడో వేవ్ ముంచుకొస్తోంది. ఆ విష‌యాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు డ‌బ్ల్యూహెచ్ వో చెబుతోంది. కేంద్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం చేస్తోంది. డెల్టా, ఓమిక్రాన్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. కానీ, తూతూ మంత్రంగా తెలంగాణ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది. పైగా లాక్ డౌన్ పెట్టేది లేదంటూ తెగేసి చెబుతోంది. ఆదాయం కోల్పోతామ‌నే యావ త‌ప్ప ప్ర‌జ‌ల ప్రాణాల గురించి ప‌ట్టించుకోవ‌డంలేదు. ప‌క్క రాష్ట్రాలు నైట్ క‌ర్ఫ్యూల‌ను పెడుతున్నాయి. వీకెండ్ లాక్ డౌన్ ల‌ను ఢిల్లీ లాంటి చోట్ల పెట్టారు. త‌ద్భిన్నంగా తెలంగాణ ప్ర‌భుత్వం జ‌న‌వ‌రి ఒక‌టో తేదీని ప్ర‌త్యేక అనుమ‌తులు బార్ల‌కు ఇచ్చింది.తాజా రిపోర్ట్ ప్ర‌కారం తెలంగాణ వ్యాప్తంగా పెరుగుతోన్న కోవిడ్ రేసుల్లో 70 శాతం ఒమిక్రాన్ కేసులే. ఆ మేర‌కు ప‌బ్లిక్‌ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి. శ్రీనివాసరావు వెల్ల‌డించాడు. ఇప్ప‌టికిప్పుడు అంద‌రికీ జీనోమ్ సీక్వెన్స్ చేయడం సాధ్యం కాదని తేల్చేశాడు. ఒమిక్రాన్ సమూహ వ్యాప్తి మొదలైందని ప్ర‌క‌టించాడు. అయిన‌ప్ప‌టికీ లాక్ డౌన్ విధించే యోచన లేదని చెప్ప‌డం గ‌మ‌నార్హం.కేంద్ర మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటిస్తామ‌ని చెబుతూ వచ్చే నాలుగు వారాలు కీలకమని వెల్ల‌డించాడు. ఫిబ్రవరి మధ్యలో కేసులు తగ్గే అవకాశం ఉంద‌ని ఆంచ‌నా వేస్తున్నాడు. కోవిడ్ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఉచిత స‌ల‌హా ప‌డేశాడు. ఆస్ప‌త్రులు సిద్జంగా ఉన్నాయ‌ని చెబుతున్నాడు. అంటే, మ‌ళ్లీ ఆస్ప‌త్రుల దందాకు తెర లేప‌డానికి ప్ర‌భుత్వం సిద్ధ‌మైంద‌ని విప‌క్షాలు ఇప్ప‌టికే ఆరోప‌ణ‌లు చేస్తున్నాయి. లక్షణాలుంటే సొంత వైద్యం చేసుకోవద్దని, వైద్యుల వద్దకు వెళ్లాలని ప‌రోక్షంగా ఆస్ప‌త్రుల‌ను ప్ర‌మోట్ చేయ‌డం శోచ‌నీయం.

2 కోట్ల కరోనా టెస్ట్ కిట్లతో పాటు కోటికిపైగా హోం ఐసోలేషన్ కిట్లను సిద్ధంగా ఉంచామ‌ని హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీనివాసరావు వెల్ల‌డించారు. కరోనా మూడో వేవ్ ను ఎదుర్కొనేందుకు ఆస్ప‌త్రులు సిద్ధంగా ఉన్నాయ‌ని చెబుతున్నాడు. జ‌న‌వ‌రి 1 నుంచే రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు. ఐదురోజులుగా 4 రెట్లకుపైగా కేసులు వస్తున్నాయన్నారు. పాజిటివిటీ రేటు 3 శాతానికిపైగా ఉందన్నారు. కరోనా పేషెంట్లలో జలుబు, స్వల్ప జ్వరం, తీవ్ర తలనొప్పి వంటి కొన్ని లక్షణాలే ఉన్నాయన్నారు.ప్రివెన్ష‌న్ ఈజ్ బెట‌ర్ దేన్ క్యూర్ అనే ప్రాథ‌మిక మెడిక‌ల్ సిద్ధాంతాన్ని మ‌ర‌చిన ప్ర‌భుత్వం మ‌రోసారి ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని గాలికి వ‌దిలేసింది. ఆదాయం రాబ‌ట్టేందుకు ఆస్ప‌త్రుల‌ను సిద్ధం చేశామ‌ని చెప్ప‌డం విడ్డూరం. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం మాన‌వీయ కోణం నుంచి త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ త‌ర‌హాలో ఆలోచించ‌క‌పోతే, భారీ మూల్యం చెల్లించుకోవాల‌ని వైద్య నిపుణుల అభిప్రాయం. మ‌రి, ఈసారైన కేసీఆర్ క‌ళ్లు తెరుస్తాడా? లేక మూడో వేవ్ త‌రువాత సీన్ క‌ట్ చేస్తే హ‌రీష్ రావును బ‌లి చేస్తాడో..చూద్దాం!