Single Kidney: సింగిల్ కిడ్నీతో బతకొచ్చా..? ఆరోగ్యంపై ఎఫెక్ట్ ఉంటుందా..?

మన బాడీ లోపల 2 కిడ్నీలు (Kidneys) ఉంటాయి.  మన రక్తాన్ని శుభ్రపరచడంతో పాటు శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించే పనిని అవి చేస్తాయి. కొంతమంది ఈ రెండు కిడ్నీల్లో ఒకదాన్ని ..తీవ్ర కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న తమ కుటుంబ సభ్యులకు దానం చేస్తుంటారు.

  • Written By:
  • Publish Date - February 12, 2023 / 03:00 PM IST

మన బాడీ లోపల 2 కిడ్నీలు (Kidneys) ఉంటాయి.  మన రక్తాన్ని శుభ్రపరచడంతో పాటు శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించే పనిని అవి చేస్తాయి. కొంతమంది ఈ రెండు కిడ్నీల్లో ఒకదాన్ని ..తీవ్ర కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న తమ కుటుంబ సభ్యులకు దానం చేస్తుంటారు. ఇలాంటి వారికి శరీరంలో ఇక ఒక కిడ్నీయే మిగులుతుంది. ఈ ఒక్క కిడ్నీతో ఆరోగ్యకరంగా జీవించవచ్చా ? ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తాయా ? ఎలాంటి హెల్త్ ఛాలెంజెస్ ఉంటాయి? ఏయే ఆరోగ్య నియమాలను పాటించాలి? అనే డౌట్స్ చాలామందికి వస్తుంటాయి. వాటికి వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..!

■ ఆ తర్వాత.. ఆరోగ్యానికి ఏం అవుతుంది..?

ఒక కిడ్నీతోనూ మన శరీరం సాధారణంగానే పనిచేస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. ఒక వ్యక్తి 30 నుంచి 40 సంవత్సరాల వయస్సులో కిడ్నీని దానం చేసినా.. అతను పూర్తిగా ఆరోగ్యంగానే ఉంటాడని చెబుతున్నారు. ఆ తరువాతి 20 నుండి 25 సంవత్సరాల వరకు కూడా కిడ్నీ దానం చేసిన వ్యక్తికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావని అంటున్నారు. “పెద్ద వయసు వారు ఎవరైనా వారి స్వచ్ఛంద ఇష్టంతో కిడ్నీ దానం చేయొచ్చు.గతంలో 60 నుంచి 65 సంవత్సరాల వయస్సు ఉన్నవారు కిడ్నీ దానం చేయడాన్ని నిషేధించారు. అయితే ప్రస్తుతం దాతల కొరత కారణంగా ఈ వయస్సు ఉన్నవారు కూడా కిడ్నీని దానం చేయవచ్చు” అని పలువురు డాక్టర్స్ చెప్పారు.

■ డొనేషన్ చేసే వ్యక్తి ఎంపిక కోసం

కిడ్నీని దానం చేసేందుకు ముందుకొచ్చిన వ్యక్తిని వైద్యులు పరీక్షిస్తారు. అతడు ఆరోగ్య వంతంగా ఉన్నాడా ? కిడ్నీలు ఎలా పనిచేస్తున్నాయి ? అనేది గుర్తిస్తారు. దాని ఆధారంగా కిడ్నీ డొనేషన్ కు ఆ వ్యక్తిని ఎంపిక చేయాలా వద్దా అనేది డిసైడ్ చేస్తారు.నేటి కాలంలో మూత్రపిండాల తొలగింపు సర్జరీ ల్యాప్రో స్కోపిక్ పద్ధతితో జరుగుతోంది. ఈ పద్ధతిలో రక్తస్రావం తక్కువగా జరుగుతుంది. ఇన్ఫెక్షన్ ముప్పు కూడా తక్కువే. సాధారణంగా కిడ్నీ దానం తర్వాత దాత పూర్తిగా కోలుకోవడానికి ఒకటి నుండి మూడు నెలల సమయం పడుతుంది.  మూత్రపిండాన్ని దానం చేసిన తర్వాత, మీరు ఎక్కువసేపు ఆసుపత్రిలో ఉండవలసిన అవసరం లేదు. ఇంట్లోనూ విశ్రాంతి తీసుకోవచ్చు.

■ కిడ్నీ దానం చేశాక మహిళలు పిల్లలకు జన్మనివ్వగలరా..?

కిడ్నీ దానం చేసిన వ్యక్తి ఒకవేళ స్త్రీ అయితే.. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఏవైనా వస్తాయా అనే డౌట్స్ చాలామందికి వస్తుంటాయి. ఆ డౌట్ అక్కర లేదని, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని డాక్టర్స్ స్పష్టం చేస్తున్నారు. కిడ్నీ దానం చేసే వారి
సంతానోత్పత్తిపై ఎటువంటి నెగెటివ్ ఎఫెక్ట్ ఉందని తెలిపారు. అయితే మహిళలు కిడ్నీ దానం చేసిన ఒక సంవత్సరం తర్వాత గర్భం ప్లాన్ చేసుకోవడం బెస్ట్ అని వైద్యులు సూచిస్తున్నారు.

■ కిడ్నీ దానం తర్వాత వీటిపై ఫోకస్ పెట్టండి

కిడ్నీ రిమూవల్ సర్జరీ తర్వాత శరీరంలో ఒక్క కిడ్నీయే మిగులుతుంది. కాబట్టి ఆ తర్వాత కనీసం 6 వారాల పాటు ఎలాంటి హెవీ లిఫ్టింగ్ చేయకూడదు. భారీ వ్యాయామం చేయొద్దు.గేమ్స్ కు దూరంగా ఉండండి. కిడ్నీ దానం చేసిన తర్వాత దాత తప్పనిసరిగా సంవత్సరానికి ఒకసారి చెకప్ చేయించుకోవడం తప్పనిసరి.

■ కిడ్నీలు ఎందుకు పాడవుతాయి..?

కిడ్నీలు దెబ్బతినడానికి గల కొన్ని ముఖ్య కారణాల్లో మధుమేహం, రక్తపోటు, కిడ్నీల్లో రాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటితో పాటు ఆటో ఇమ్యూన్ సమస్యలు, కాంబిఫ్లామ్, బ్రూఫెన్ వంటి పెయిన్ కిల్లర్ల మితిమీరిన వినియోగం కూడా కిడ్నీలను దెబ్బతీస్తాయి.

■ కిడ్నీలు ఇలా కాపాడుకోండి

★ షుగర్, హై బీపీ, బ్లడ్ షుగర్ లను కంట్రోల్ లో ఉంచుకోండి.
★ రోజూ రెండున్నర నుంచి మూడు లీటర్ల నీటిని తాగండి. దీంతో మీ కిడ్నీలో రాళ్ళు ఏర్పడవు.
★ పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకోవడం మానుకోండి.
★ ఆహారం, జీవనశైలిని మార్చుకోండి.

■ రెనెల్ ఎజెనిసిస్ ప్రాబ్లమ్ తెలుసా..?

ఒక వ్యక్తి ఒకే ఒక మూత్రపిండంతో జన్మిస్తే ఆ స్థితిని రెనెల్ ఎజెనిసిస్ అంటారు. ప్రతి 750మందిలో ఒకరికి ఇటువంటి సమస్య ఉంటుందని అంచనా. వీరిలో సాధారణంగా కుడి వైపున మూత్రపిండాన్ని కలిగి ఉండి, ఎడమ వైపు లేని పరిస్థితి ఉంటుంది. మహిళల కంటే పురుషులలో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుంది. ఎక్స్ -రే, సోనోగ్రామ్ పరీక్షలు ద్వారా ఈ పరిస్థితిని కనుగొనే వీలుంది.

■ రెనెల్ డిస్ప్లాసియా అంటే తెలుసా..?

ఒక వ్యక్తి రెండు మూత్రపిండాలతో జన్మించినా.. వాటిలో ఒకటి మాత్రమే పనిచేస్తే ఆ స్థితిని రెనెల్ డిస్ప్లాసియా అంటారు. దీని బాధితుల్లో ఒక కిడ్నీ చాలా తక్కువగా పని చేయడం లేదా పూర్తిగా పనిచేయని స్థితిలో ఉంటుంది.

■ నెఫ్రెక్టమీ అంటే తెలుసా..?

మూత్రపిండాల్లో ఒకదాన్ని శస్త్రచికిత్స కారణంగా కొంత భాగం తొలగించబడిన పరిస్థితిని నెఫ్రెక్టమీ అంటారు. క్యాన్సర్ వంటి వ్యాధుల కారణంగా, గాయాలు లేదా ఇతర ఆరోగ్య సమస్యల వల్ల ఈ ప్రాబ్లమ్ వస్తుంది.