ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా అలాగే జెండర్ తో సంబంధం లేకుండా చాలామంది టాటూలు వేయించుకుంటున్న విషయం తెలిసిందే. చేతులు ఒంటిపై వీపు మెడ ఇలా శరీరంలోని అనేక ఇతర ప్రదేశాలలో ఈ పచ్చబొట్లు పొడి పిచుకోవడం అన్నది కామన్ అయిపోయింది. కొందరు చిన్నగా పేర్లు లాంటివి వేయించుకుంటే మరికొందరు ఫోటోలు వేయించుకుంటూ ఉంటారు. కొందరైతే తమకు ఇష్టమైన వ్యక్తుల పేరును తమ శరీరంపై ట్యాటూగా వేయించుకుంటూ ఉంటారు. మరికొందరు శరీరంపై రకరకాల డిజైన్ లను వేయించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా యువత తమ శరీరాలపై రకరకాల టాటూలు వేసుకుంటున్నారు.
స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా ఇప్పుడు టాటూలు అందరూ వేయించుకుంటున్నారు. కాగా శరీరంలో ఎక్కడైనా పచ్చబొట్లు లేదా టాటూలు ఉంటే, రక్తదానం చేయడం కొన్నిసార్లు సమస్యగా మారుతుందట. చాలా చోట్ల రక్తం తీసుకోవడానికి వైద్యులు ఇష్టపడరు. అయితే ఒంటిపై పచ్చబొట్టు ఉంటే రక్తం ఎందుకు ఇవ్వలేరు? రక్తదానం చేయడానికి సమస్య ఏమిటి? అనే సందేహం మనలో చాలామందికి కలిగే ఉంటుంది. శరీరంపై పచ్చబొట్టు ఉంటే రక్తదానం చేసేందుకు ఎలాంటి అడ్డంకి ఉండదని వైద్యులు చెబుతున్నారు. మీరు పచ్చబొట్టుతో సులభంగా రక్తదానం చేయవచ్చట. ఇది రోగికి ఎటువంటి హాని కలిగించే అవకాశం లేదని చెబుతున్నారు. కానీ ఇలాంటి వారు కొన్ని మార్గ దర్శకాలను అనుసరించడం అన్నది చాలా అవసరం. లేదంటే కొన్ని ప్రమాదాలు సంభవించవచ్చట.
పచ్చబొట్లను ఎప్పుడూ కొత్త సూదులు ఉపయోగించి వేసుకోవాలట. టాటూ వేసుకునే వ్యక్తి ఈ విషయాన్ని గుర్తించాలి. కొన్నిసార్లు చాలా మందికి ఒకే సూదులతో పచ్చబొట్టు వేస్తుంటారు. ఇలా వేయించుకుంటే పచ్చబొట్టు పొడిపించుకున్న వ్యక్తికి అంత మంచిది కాదు. ఇలాంటి సందర్భంలో రక్తం ద్వారా మూడు ప్రాణాంతక వ్యాధులు శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇది తరువాత రోగి శరీరానికి వ్యాపిస్తుంది. అందుకే పచ్చబొట్టు పొడిపించుకునే సమయంలో ఎల్లప్పుడూ కొత్త సూదులను మాత్రమే ఉపయోగించాలి. ఇన్‌ఫెక్షన్ తర్వాత వైరస్ పునరుత్పత్తి చేసే కాలాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. అంటే ఒక వ్యక్తికి ఆరు నెలలలోపు హెచ్‌ఐవి, హెపటైటిస్ బి లేదా హెపటైటిస్ సి వైరస్ సోకినట్లయితే ఆ సమయంలో రక్త పరీక్ష చేయించుకుంటే, రిపోర్టు ప్రతికూలంగా రావచ్చు. కాబట్టి ఒక వ్యక్తి టాటూ వేయించుకున్న ఆరు నెలలలోపు రక్తదానం చేయకూడదు. లేకుంటే ఆరోగ్యంగా ఉన్న మరో వ్యక్తికి తన రక్తం ద్వారా ప్రాణాంతకమైన వ్యాధి సోకే ప్రమాదం ఉంది. కాబట్టి టాటూ వేసుకునే ముందు కనీసం ఆరు నెలల పాటు జాగ్రత్తగా ఉండాలి. ఆరు నెలల తర్వాత రక్తపరీక్ష చేయించుకుని శరీరంలో వ్యాధి వ్యాప్తి చెందలేదని నిర్ధారించుకోవాలి. అప్పుడు మీరు పచ్చబొట్టు కలిగి ఉన్నప్పటికీ సురక్షితంగా రక్తాన్ని ఇవ్వవచ్చు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం కొంతమంది వైద్యులు ఒక సంవత్సరం పాటు రక్తదానం చేయడాన్ని నిషేధిస్తారు.