చలికాలం నెమ్మదిగా మొదలవుతోంది. అయితే చలికాలంలో చాలామంది అనేక రకాల చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో అలాగే అందం విషయంలో రకరకాల విషయాలను ఫాలో అవుతూ ఉంటారు. ముఖ్యంగా చలికాలంలో చర్మం జుట్టు వంటివి నిర్జీవంగా మారుతూ ఉంటాయి.అలాగే చలినుంచి మనల్ని మనం రక్షించుకోవాలి. ఈ సీజన్ లో వేడివేడి పదార్థాలు తినడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. సీజన్ మారినప్పుడల్లా మనం తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది చలికాలంలో పెరుగు తినడానికి ఆలోచిస్తూ ఉంటారు.
మరి ఇంతకీ చలికాలంలో పెరుగు తినవచ్చా తినకూడదా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పెరుగులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. పెరుగు చెడు బ్యాక్టీరియాను తొలగించి మంచి బ్యాక్టీరియా సంఖ్యను పెంచుతుంది. దీనిలో ఎన్నో రకాల విటమిన్లు, ప్రోటీన్లు, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటివి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. చలికాలంలో పెరుగును తినకూడదట. ఎందుకంటే ఇది శ్లేష్మం, ఇతర గ్రంథుల స్రావాన్ని పెంచుతుంది. అంతేకాదు సైనసైటిస్, ఆస్తమా, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం వంటి సమస్యలను కూడా పెంచుతుందని చెబుతున్నారు. అందుకే ఈ సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలని, పెరుగును రాత్రిపూట అస్సలు తినకూడదని చెబుతున్నారు.
కాగా పెరుగులో మన గట్ కు అవసరమైన మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. ఇది పులియబెట్టబడుతుంది. కాబట్టి పెరుగుతో పాటు పులియబెట్టిన ఆహారాలను తింటే మన రోగనిరోధక శక్తి పెరుగుతుందట. అలాగే పెరుగులో విటమిన్ బి12, క్యాల్షియం, ఫాస్పరస్ లు పుష్కలంగా ఉంటాయి. పెరుగును తినడం వల్ల మన ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. అయితే శ్వాస సమస్యలతో బాదపడే వారు సాయంత్రం 5 గంటల తర్వాత పెరుగును తినకూడదట. లేదంటే జీర్ణ సమస్యలు వస్తాయి.
అలాగే పెరుగులో విటమిన్ సి ఉంటుంది. ఇది జలుబును తగ్గించడానికి సహాయపడుతుందని చాలా మంది అంటున్నారు. అయితే ఇందుకోసం పెరుగును గది ఉష్ణోగ్రత వద్ద ఉంచడం మంచిది. మరీ చల్లని పెరుగును తింటే జలుబు ఎక్కువ అవుతుందని చెబుతున్నారు. కాగా పెరుగును కాలాలతో సంబంధం లేకుండా తినవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చలికాలమని దీన్ని మొత్తమే పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. అయితే చలికాలంలో పెరుగును తక్కువగా తినడం మంచిది. దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడేవారు రిఫ్రిజిరేటర్ లో పెట్టిన పెరుగు కాకుండా గది ఉష్ణోగ్రత వద్ద ఉంచిన పెరుగును తినాలి.