ఈ మధ్య కాలంలో చాలామంది జబ్బుల బారిన పడుతున్నారు. తినే ఆహారం, జీవనశైలిలో మార్పులు, మానసిక ఒత్తిడి, ఉద్యోగ ఒత్తిడి…ఇలా ఎన్నో రకాల కారణాల వల్ల చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు. మన ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవాలంటే అది మన చేతుల్లోనే ఉంది. జీవనశైలిలో మార్పులు చేసుకుంటే రోగాలు లేని జీవితాన్ని హాయిగా గడపవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జీవనశైలి కారణంగా అనారోగ్య సమస్యలు వ్యాప్తిస్తున్నాయి. ముఖ్యంగా బీపీ, షుగర్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
పట్టణాల్లోనే కనిపించే జబ్బులు పల్లెలకు పాకుతున్నాయి. ప్రతి నలుగురిలో ఒకరికి బీపీ, ప్రతి ఐదుగురిలో ఒకరికి షుగర్ ఉండే పరిస్థితి నెలకొంది. అయితే ఈ స్థాయిలో బీపీ, షుగర్ బాధితులుండటం మరింత ఆందోళన కలిగిస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవగాహన లేక కొందరు, నిర్లక్ష్యంతో మరికొందరు ఈ రెండు ప్రమాదకర జబ్బులను నియంత్రణలో ఉంచుకోలేక పలు వ్యాధుల బారిన పడుతున్నారు.
అయితే షుగర్ బారిన పడినవారు తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. కానీ పుచ్చకాయ తియ్యగా ఉండటం వల్ల దీన్ని తినొచ్చా లేదా అని చాలామందికి అనుమానం ఉంటుంది. అయితే పుచ్చకాయ విషయంలో ఆ భయం అక్కర్లేదంటున్నారు వైద్యులు. ఎందుకంటే ఆయా ఆహార పదార్థాల్లోని గ్లూకోజ్ రక్తంలో ఎంత వేగంగా కలుస్తుందనే దాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్తో సూచిస్తారు. ఇది అధికంగా ఉండే పండ్ల విషయంలో షుగర్ వ్యాధిగ్రస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పుచ్చకాయలో జీఐ 72 శాతం ఉంటే, నీటి శాతం ఎక్కువగా ఉండి పిండి పదార్థం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి పుచ్చకాయ తిన్నప్పుడు వెంటనే గ్లూకోజ్ పెరిగినప్పటికీ తగ్గిపోతుంది. కాబట్టి ఎలాంటి అనుమానం లేకుండా పుచ్చకాయ తినవచ్చని నిపుణులు చెబుతున్నారు.
