Breast Milk: తల్లి పాలతో బిడ్డకే కాదు…తల్లికీ ఆరోగ్య ప్రయోజనాలు..!!!

రొమ్మును బిడ్డ నోటికి అందించడంతోనే ఆ తల్లి బాధ్యత తీరిపోదు. బిడ్డ పాలు తాగుతుందా లేదా...సౌకర్యవంతంగా పాలు వస్తున్నాయా లేదా...

  • Written By:
  • Publish Date - March 3, 2022 / 12:59 PM IST

రొమ్మును బిడ్డ నోటికి అందించడంతోనే ఆ తల్లి బాధ్యత తీరిపోదు. బిడ్డ పాలు తాగుతుందా లేదా…సౌకర్యవంతంగా పాలు వస్తున్నాయా లేదా…ఏమైనా అసౌకర్యం కలుగుతుందా…ఇలా ఎన్నో విషయాలను ప్రతి తల్లి గమనించాల్సిందే. ఇద్దరికీ అనువైన…అరోగ్యవంతమైన పద్దతిలో పాలివ్వడం నేర్చుకోవాలి. తల్లిబిడ్డకు పాలు ఇచ్చినట్లయితే…బిడ్డ ఆకలి తీరుతుంది. తల్లిపాలు బిడ్డకు మాత్రమే ఉపయోగకరం అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. బిడ్డకు పాలివ్వడం వల్ల తల్లికీ ఉపయోగకరమేనని ఓ పరిశోధనలో తేలింది. ఉత్తర వర్జీనియాకు చెందిన OB-GYN పాలిచ్చే తల్లులకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో వివరించింది. అదెలాగో చూద్దాం.

జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం…తల్లి నుంచి పాలు తయారైనంత కాలం బిడ్డకు పాలివ్వడం వల్ల కరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందట. దాదాపు 14శాతం తక్కువగా ఉంటుందని పేర్కొంది. స్ట్రోక్ లు వచ్చే శాతం తగ్గుతుందట. కార్డియోవాస్కులర్ డిసిజ్ తో మరణించే అవకాశం 17శాతం తక్కువగా ఉంటుందట. మెటా విశ్లేషణలో భాగంగా గత పది సంవత్సరాలుగా దాదాపు 1.2 మిలియన్ల పాలిచ్చే తల్లుల ఆరోగ్య రికార్డులను అధ్యయనం చేసి ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ అధ్యయనంలో వెల్లడించిన విషయాలు చాలా ఆశ్చర్యానికి గురిచేశాయని డాక్టర్ అమీ బానులీస్ అన్నారు. ఇది నిజంగా ప్రతి తల్లిని ఉత్తేజపరిచే వార్త అని చెప్పారు. కనీసం 12 నెలల వరకు తల్లి బిడ్డకు పాలు ఇచ్చినట్లయితే…ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని తెలిపారు. బిడ్డకు పాలిచ్చిన ప్రతిసారీ తల్లి పిట్యూటరీ గ్రంథీ నుంచి ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ గర్భదారణతో సంకోచించిన గర్భశాయానికి కుంచించుకుపోయోలా చేస్తుంది. తిరిగి పూర్వ పరిమాణానికి తీసుకువస్తుంది. దీంతో ఆక్సిటోసిన్ హార్మోన్ రొమ్ముల్లో పాలు తయారయ్యేందుకు సహాయపడుతుంది.

తల్లులు శిశువులకు పాలివ్వడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చో ఇదివరకే వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రాలు ప్రచారం చేశాయి. బిడ్డకు పాలు ఇవ్వడం ద్వారా తల్లులు రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుంది. శిశువులకు కూడా ఆస్తమా, ఊబకాయం, టైప్ 1 మధుమేహం, చెవి ఇన్ఫెక్షన్లు, ఆకస్మిక మరణ సిండ్రోమ్ తక్కువగా ఉంటుంది.

బిడ్డకు 12 నెలల వయస్సు లేదా అంతకంటే ఎక్కువ యస్సు వచ్చే వరకు పరిపూరకరమైన ఆహారాన్ని అందిస్తూ…తల్లిపాలను కూడా ఇవ్వచ్చని ఈ అధ్యయనం పేర్కొంది. పాలిచ్చే తల్లులు పౌష్టికాహారం తీసుకుంటూ..బిడ్డ కడుపు పాలతో నింపాలన్న సంకల్పం తల్లికి ఉండాలి. బిడ్డకు కనీసం ఆరు నెలలు, అలా రెండేళ్ల వరకూ బిడ్డకు తల్లిపాలు ఇవ్వవచ్చని అధ్యయనంలో పేర్కొన్నారు. కాబట్టి తల్లిపాలు బిడ్డకు…తల్లికి ఇద్దరికీ ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తున్నాయి.