దక్షిణ కొరియాలో మెదడును తినే ఇన్ఫెక్షన్..ఒకరు మృతి

దక్షిణ కొరియా అరుదైన ఇన్ఫెక్షన్ కేసు నమోదైనట్లు అధికారులు గుర్తించారు. థాయిలాండ్ నుండి తిరిగి వచ్చిన ఓ యాభై యేళ్ల వ్యక్తికి ఈ ఇన్ఫెక్షన్ సోకింది.

  • Written By:
  • Publish Date - December 27, 2022 / 10:30 PM IST

దక్షిణ కొరియా అరుదైన ఇన్ఫెక్షన్ కేసు నమోదైనట్లు అధికారులు గుర్తించారు. థాయిలాండ్ నుండి తిరిగి వచ్చిన ఓ యాభై యేళ్ల వ్యక్తికి ఈ ఇన్ఫెక్షన్ సోకింది. నేగ్లేరియా ఫౌలెరి ఇన్ఫెక్షన్ తో ఆ వ్యక్తి మరణించినట్లు నిపుణులు వెల్లడించారు. దీనినే బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని కూడా పిలుస్తారని, దక్షిణ కొరియాలో ఈ ఇన్ఫెక్షన్ తో మృతి చెందిన మొదటి కేసుగా ఇది నమోదయ్యిందని అధికారులు వెల్లడించారు.

కొరియా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఏజెన్సీ దీనికి సంబంధించిన వివరాలను తెలియజేసింది. థాయిలాండ్ నుండి తిరిగి వచ్చిన ఓ కొరియన్ జాతీయుడికి ఈ ఇన్ఫెక్షన్ సోకిందని, ఆ వ్యక్తి రెండు వారాల క్రితం డిసెంబర్ 10న కొరియాకు తిరిగినట్లు అధికారులు తెలిపారు. అంతకుముందు అతను థాయ్ లాండ్ లో నాలుగు నెలల పాటు ఉన్నాడని వారు వెల్లడించారు.

దక్షిణ కొరియాకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తిలో తలనొప్పి, జ్వరం, వాంతులు, మాటలు అస్పష్టంగా మాట్లాడ్డం వంటివి జరిగాయని, మెడ కూడా బిగుసుకుపోవడం వల్ల మెనింజైటిస్ లక్షణాలు ఆ వ్యక్తిలో పుష్కలంగా కనిపించాయని వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో అతడ్ని ఎమర్జెన్సీలో చేర్చి వైద్యం అందించినా ఫలితం లేకుండా పోయిందని, ఆ వ్యక్తి డిసెంబర్ 21వ తేదిన తుది శ్వాస విడిచాడని వైద్యులు నిర్ధారించారు.

ఆ వ్యక్తి మరణానికి కారణం నేగ్లేరియా ఫౌలెరీకి కారణమయ్యే మూడు వేర్వేరు ఇన్ఫెక్షన్లని వైద్యులు కనుగొన్నారు. జన్యు పరీక్ష ద్వారా దానిని గుర్తించారు. దక్షిణ కొరియాలో ఈ వ్యాధి ఇన్ఫెక్షన్ తో నమోదైన మొదటి మరణం ఇదే కావడంతో ప్రజలు ఆందోళన చెందారు. అయితే ఇది ఎలా సోకుతుందో ఇంకా స్పష్టంగా తెలియడం లేదని, దానిని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని వైద్యులు తెలిపారు.

కలుషితమైన నీటిలో ఈత కొట్టడం, లేదా కలుషిత నీటితో ముక్కు కడుక్కోవడం, ముక్కులోకి కలుషితమైన నీరు వెళ్లడం లాంటి రెండు ప్రధాన కారణాలతో ఈ ఇన్ఫెక్షన్ సోకుతుందని వైద్యులు వెల్లడించారు. అమీబా ఉన్న నీరు ముక్కులోపలికి వెళ్లినప్పుడు మెదడు ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుందని వారు నిర్ధారించారు. యునైటెడ్ స్టేట్స్ లో ప్రతి ఏడాదీ కేవలం ముగ్గురికి మాత్రమే ఇది సోకుతుందని, ఇది ప్రాణాంతకమైనదని వారు వెల్లడించారు.