మనం నిత్యం ఉపయోగించిన వంటనూనెలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవే కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే గుండెకు మేలు చేసే నూనెలనే వాడుతుండాలని ఆరోగ్యనిపుణులు చెబుతుంటారు. నూనె లేకుండా వంట చేయడం అసాద్యం. మన భారతీయ వంటల్లో నూనెకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ నూనెలు మన ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంటాయి. కొన్ని రకాల నూనెలు మనల్ని ఆరోగ్యం ఉంచితే..మరికొన్ని మాత్రం ఎన్నో జబ్బులపాలు చేస్తాయి. ముఖ్యంగా ఈ నూనెలు గుండెపై తీవ్రప్రభవాన్ని చూపిస్తాయి. అయితే గుండె జబ్బులున్నవారు ఈ వంట నూనెల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గుండెకు మేలు చేసే వంట నూనెలనే ఉపయోగించాలి. ఆరోగ్యనిపుణుల ప్రకారం..కొన్నిరకాల వంట నూనెలు గుండెకు మేలు చేస్తుంటాయి. అవేంటో చూద్దాం.
వేరుశనగ నూనె:
వేరుశనగ నూనె గుండెకు మేలు చేస్తుంది. ఈ నూనెలో విటమిన్ ఇ, మోనోశాచురేటెడ్ కొవ్వులు, పాలీఅన్శాచురేటెడ్ కొవ్వులు అధిక మోతాదులో ఉంటాయి. విటమిన్ ఇ గుండెకు మేలు చేయడంతోపాటు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలోకూడా సహాయపడతుంది. ఒమేగా -6 ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఆలివ్ నూనెలో వేరుశనగ నూనెను కలిపి తీసుకుంటే మంచి జరుగుతుంది.
ఆలివ్ ఆయిల్:
ఆలివ్ ఆయిల్ అత్యంత ప్రాచుర్యం పొందిన వంటనూనెల్లో ఇది ఒకటి. ఇది పాలీఫెనాల్స్ అని పిలిచే మొక్కల ఆధారిత సమ్మేళనాలతో నిండి ఉంటుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ముఖ్యభూమిక పోషిస్తుంది. ఆలివ్ నూనెలో ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉన్నాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచేందుకు సహాయపడతాయి. దీంతో గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. ఈ నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి మేలు చేస్తాయి. అంతేకాదు బరువును కూడా తగ్గిస్తాయి.
సన్ ఫ్లవర్ ఆయిల్ :
పొద్దుతిరుగుడు నూనె గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాలను తగ్గిస్తుంది. ఇతర నూనెలతో పోలిస్తే పొద్దుతిరుగుడు నూనెలో విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె కు చాలా మంచిది.
ఆవ నూనె:
ఈ నూనె గుండెకు మాత్రమే కాదు..చర్మం, కీళ్లు, శరీరంలోని ఇతర భాగాలకు కూడా ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. చాలా వంటకాల్లో ఈనూనెను వాడుతుంటారు. ఈ నూనెలో మోనోశాచురేటెడ్, పాలీఅన్శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు , ఒమేగా 3, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు అధిక మోతాదులో ఉంటాయి. ఆవనూనె జీర్ణక్రియ, ఆకలిని మెరుగుపరుస్తుంది.
రైస్ బ్రాన్ ఆయిల్:
రైస్ బ్రాన్ ఆయిల్ గుండెకు మేలు చేస్తుంది. దీనిలో గుండెకు మేలు చేసే మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. సలాడ్లు, కుకీలు, కేకుల తయారీలో ఈ నూనెను ఎక్కువగా ఉపయోగిస్తారు.
సోయాబీన్ ఆయిల్ :
సోయాబీన్ ఆయిల్ శరీరానికి ప్రయోజనం చేకూర్చే కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంది. సోయాబీన్ ఆయిల్ శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. ఇతర అనారోగ్య సమస్యలను కూడా తగ్గించేస్తుంది.
కుసుమ నూనె:
ఈ నూనె శరీరంలో కొలెస్ట్రాల్ ను సమతుల్యం చేస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాలను తగ్గిస్తుంది. ధమనులు గట్టిపడకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.