పచ్చి మిర్చి అంటే మనలో చాలా మందికి భయం. చాలా కారం గా ఉంటుందని తినేందుకు ఇష్టపడరు. కానీ ఇది వంటకాలకు రుచి ఇవ్వడమే కాదు ఆరోగ్యపరంగానూ ఎంతో మేలు చేస్తుంది. ప్రతి కిచెన్‌లో తప్పనిసరిగా ఉండే కూరగాయల్లో పచ్చి మిర్చి ఒకటి. మిరపకాయలు లేనిదే ఏ వంటా పూర్తి కాదు. భారతీయులు ఎక్కువగా మసాలా ఫుడ్‌ని ఇష్టపడతారు. ఇందులో పచ్చి మిరపకాయ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే పచ్చి మిర్చిని అనేక వంటకాల్లో వాడుతారు. ఇది ఆహారాన్ని రుచిగా చేయడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.
పచ్చి మిర్చిలో పొటాషియం, కాపర్, ఐరన్, విటమిన్లు ఎ, బి6, సి, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు వంటి అనేక రకాల పోషకాలు ఉన్నాయి. దీనితో పాటు బీటా కెరోటిన్, క్రిప్టోక్సాంథిన్, లుటిన్ – జియాక్సంథిన్ వంటివి కూడా ఇందులో పుష్కలంగా లభిస్తాయి. పచ్చి మిరపకాయలు తింటే అనేక అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని పలు పరిశోధనల్లో తేలింది.
విటమిన్ సి పచ్చి మిరపకాయలలో తగినంత పరిమాణంలో లభిస్తుంది. ఇది, ఇతర విటమిన్లు శరీరంలో శోషించబడటానికి సహాయపడుతుంది. అలాగే ఇది మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుది. జీర్ణవ్యవస్థకు కూడా మేలు చేస్తుంది. ఎసిడిటీ వంటి సమస్యలు రావు. పచ్చి మిర్చిలో డైటరీ ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. దీని కారణంగా జీర్ణక్రియ ప్రక్రియ సాఫీగా ఉంటుంది. వీటిలోని విటమిన్ – ఏ కళ్లకు, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. అంతే పచ్చి మిరపకాయలు మూడ్ బూస్టర్‌గా పనిచేస్తాయి. ఇది మన మెదడులోని ఎండార్ఫిన్‌లను కమ్యూనికేట్ అయేలా చేస్తుంది. దీని కారణంగా మన మానసిక స్థితి ఆహ్లాదకరంగా ఉంటుంది.
పచ్చి మిర్చి రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహకరిస్తుందని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. అందువల్ల డయాబెటిస్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుంది. పచ్చి మిరపకాయల్లో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల శరీరంలో బ్యాక్టీరియా లేకుండా ఉంటుంది. దీనితో పాటు, దాని ఉపయోగం ద్వారా రోగనిరోధక వ్యవస్థ కూడా బలపడుతుంది. పచ్చి మిరపకాయల్లో క్యాప్సైసిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది సైనస్ సమస్యల నుంచి కూడా చక్కటి ఉపశమనం కలిగిస్తుంది. అందుకే కారంగా ఉందని పచ్చి మిర్చిని పక్కనపెట్టకుండా ఇష్టంగా తింటే ఆరోగ్యం బాగుంటుంది. అలాగని మరీ ఎక్కువగా తినకూడదు.