Anti Aging Treatments: అతడు బాలీవుడ్ కండల వీరుడు. వయసు 50 ఏళ్లు దాటింది. అయితేనేం తన వయసులో సగమున్న హీరోయిన్‌తో కలిసి నటించారు. 50 ఏళ్లకే ముసలివారిలా కనిపించే సామాన్యులకు, ఆ బాలీవుడ్ కండల వీరుడికి తేడా ఏంటి? కొందరు హీరోలు 60, 70 ఏళ్లు వచ్చినా 40-50లలో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. చాలా మంది సెలబ్రిటీలను చూస్తే వారి వయసు తెలియట్లేదు దీనికి కారణం యాంటీ ఏజింగ్ చికిత్సలే. అర్హులైన, నైపుణ్యం కలిగిన పాస్టిక్ సర్జన్లు, డెర్మటాలజిస్టులతో చికిత్స చేయించుకుంటే సమస్య ఉండదు. కానీ అర్హతలు లేని వారితో చికిత్స చేయించుకుంటే చర్మంలోని అంతర్గత కండరాలు దెబ్బతింటాయి. నాణ్యత లేని ఉత్పత్తులు వాడినా ఇబ్బందికరమే.
Also Read :Anant Ambani : అనంత్ అంబానీకి కుషింగ్ సిండ్రోమ్.. ఏమిటిది ?
యాంటీ ఏజింగ్ చికిత్సలు 3 రకాలు
- యాంటీ ఏజింగ్ చికిత్సలు మూడు రకాలు. అవి.. పీల్స్, ఇంజెక్టబుల్స్, ఎనర్జీ బేస్డ్ డివైజెస్.
- మృతకణాలు, పిగ్మంటేషన్ వంటి వాటిని తొలగించడానికి పీల్స్‌ను వినియోగిస్తారు.
- రెండో రకం చికిత్సలో బొటాక్స్, ఫిల్లర్ల వంటి ఇంజెక్టబుల్స్‌ను వినియోగిస్తారు.
- ఎనర్జీ బేస్డ్ డివైజస్ అంటే.. లేజర్లు, రేడియో ఫ్రీక్వెన్సీ డివైజ్‌లు, హైఫూ వంటివి వినియోగిస్తారు. చర్మంలో కొలాజెన్‌ను పెంచడానికి, సాగే గుణం మెరుగుపరచడానికి వీటిని వాడుతారు.
ఎలా ఖర్చు పెడుతున్నారంటే..
సాధారణంగా మనకు వయసు పెరిగే కొద్దీ చర్మం సాగుతుంది. దీంతోపాటు అది తేమను కోల్పోతుంది. ఫలితంగా శరీరంపై ముడతలు, గీతలు ఏర్పడతాయి. బుగ్గలు లోపలకు చొచ్చుకుపోతాయి. జుట్టు తెల్లబడడం, ఊడిపోవడం వంటివన్నీ జరుగుతుంటాయి. కొందరిలో జన్యుపరమైన కారణాలతో.. ఇంకొందరిలో జీవనశైలి మార్పుల వల్ల ఇవన్నీ జరుగుతాయి. మనం వాడే వస్తువుల్లోని రసాయనాల ప్రభావం వల్ల వయసు మీరే ప్రక్రియ కొందరిలో మరికొంత వేగంగా జరుగుతుంటుంది. ఇలాంటి వాళ్లలో ఆర్థిక స్థోమత కలిగిన వారు యాంటీ ఏజింగ్ చికిత్సలు చేయించుకుంటున్నారు. యాంటీ ఏజింగ్ చికిత్సల కోసం కొందరు సరాసరిన నెలకు రూ.12వేల దాకా ఖర్చు చేస్తున్నారు. మంచి ఆదాయ వర్గంలోని ఇంకొందరు ప్రతినెలా రూ.50వేల దాకా ఇందుకు వెచ్చిస్తున్నారు.
Also Read :Coconut Water : ఇలా తాగితే కొబ్బరి నీళ్లు కూడా ప్రాణాలు తీస్తాయని మీకు తెలుసా..?
ఈ చికిత్సలకు క్రేజ్..
- ప్రసవం అయిన తరువాత పొట్టభాగం పెద్దగా కనబడే వారు అబ్డామినో ప్లాస్టీ, టమ్మీ టక్ ట్రీట్‌మెంట్ చికిత్సలు చేయించుకుంటున్నారు. గర్భం దాల్చిన తరువాత పొట్ట దగ్గర వచ్చే చారలను స్ట్రెచ్ మార్క్స్ అంటారు. వాటిని తొలగించుకోవడానికి కొందరు రూ.60 వేల దాకా ఖర్చు పెట్టి చికిత్స చేయించుకుంటున్నారు.
- మగవారు ఎక్కువగా ముక్కు సరిచేసుకునే సర్జరీ, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకుంటున్నారట.
- పురుషుల్లో అత్యధికులు లైపోసక్షన్ (అధికంగా ఉన్న కొవ్వును తీసేయడం), గైనకోమాస్టియా (మగవారిలో పెరిగిన రొమ్ము పరిమాణాన్ని తగ్గించే శస్త్ర చికిత్స) చేయించుకుంటున్నారు.
- బొటాక్స్ అనేది ముఖంపై ముడతలను పోగొట్టే న్యూరో టాక్సిన్ ప్రొటీన్. బ్యాక్టీరియం క్లోస్ట్రిడియం బొటులినమ్ అనే బ్యాక్టీరియా దీన్ని ఉత్సత్తి చేస్తుంది. దీన్ని శరీరంలోని కండరాల్లోకి ఇంజెక్ట్ చేస్తారు. దీనివల్ల ఆ కండరాలు పనిచేయడం మానేస్తాయి. దీనివల్ల చర్మంపై గీతలు తగ్గుతాయి. ముడతలు పోతాయి. ఒకవేళ ఈ ఇంజెక్షన్ సరైన కండరాల్లోకి వెళ్లకపోతే ఫలితాలు ఇబ్బందికరంగా ఉంటాయి. సంవత్సరానికి 2-3 మూడు ఇంజెక్షన్లు తీసుకోవాలి. ఒక్కో సెషన్‌కు రూ.20 వేల దాకా ఖర్చవుతుంది.
- కళ్ల కింద గుంతలు, నవ్వినప్పుడు వచ్చే గీతలను పూరించడానికి ఫిల్లర్లు వాడుతారు. వీటిలో హైల్యూరానిక్ యాసిడ్ ఉంటుంది. దీని ఖర్చు రూ.40వేల దాకా ఉంటుంది. ఫిల్లర్ నాణ్యత, డాక్టర్ అర్హతలను బట్టి ఖర్చు మారుతుంది.
- కెమికల్ పీల్(Anti Aging Treatments) పద్ధతిలో కెమికల్ సొల్యూషన్‌ను చర్మం లోపలికి చొప్పిస్తారు. తద్వారా చర్మం పై పొరను తొలగిస్తారు. అనంతరం కొత్తగా వచ్చే చర్మం కాంతివంతంగా ఉంటుంది. ఈ యాంటీ ఏజింగ్ చికిత్స ఖర్చు ఒక్క సిటింగ్‌కు రూ.5 వేల దాకా ఉంటుంది.