Asthma and Diet:డైటింగ్ తో ఆస్తమాకు చెక్ పెట్టండిలా..?

ఆస్తమా లేదా ఉబ్బసం...ఇది దీర్ఘకాలిక శ్వాససంబంధ రుగ్మతల్లో ఆస్తమా ఒకటి. మనం పీల్చేగాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లడానికి...బయటకు రావడానికి వాయునాళాలు ఉంటాయి.

  • Written By:
  • Publish Date - May 5, 2022 / 06:00 PM IST

ఆస్తమా లేదా ఉబ్బసం…ఇది దీర్ఘకాలిక శ్వాససంబంధ రుగ్మతల్లో ఆస్తమా ఒకటి. మనం పీల్చేగాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లడానికి…బయటకు రావడానికి వాయునాళాలు ఉంటాయి. పలు కారణాల వల్ల కండరాలు వాచిపోవడం వల్ల నాళాలు సన్నబడతాయి. దీనిద్వారా ఆస్తమా వస్తుంది. అయితే ఆస్తమాతో బాధపడుతున్న వారు చికిత్సకు ప్రాధాన్యం ఇచ్చినట్లుగానే…ఆహారంలో కూడా మార్పులు చేసుకోవాలి. కొన్ని రకాల ఆహార పదార్థాల విషయంలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా స్పందించినప్పుడు…అది ఆహారమైన అలర్జీలకు దారి తీస్తుంది. ఇది కొంతమందిలో ఆస్తమాకు దారితీసే ప్రమాదం ఉంటుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఆస్తమాకు ప్రత్యేకమైన ఆహారం అంటూ ఉండదని..రకరకాల పదార్థాలు, పోషకాలు ఊపిరితిత్తుల పనితీరును మెరుపరిచేందుకు సాయపడతాయని సూచిస్తున్నారు.

విటమిన్ డీ:
విటమిన్ డి…ఆస్తమా నుంచి కాపాడుతుంది. ముఖ్యంగా 6 నుంచి 15ఏళ్ల మధ్య వయస్సున్న పిల్లలకు డి విటమిన్ లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గుడ్లు, చేపలు, పాలలో డి విటమిన్ ఉంటుంది. పాలు, గుడ్లు కొందరికి అలర్జీకి కారణం కావచ్చు. అలాంటివారు వాటిని తీసుకోకపోవడం మంచిది.

విటమిన్ ఏ:
పిల్లల రక్తంలో విటమిన్ ఏ తగినంతగా ఉండాలి. అలా ఉంటే వారికి ఆస్తమా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. పిల్లల్లో విటమిన్ ఏ అధికంగా ఉంటే వారి ఊపిరితిత్తుల పనితీరు మెరుగ్గా ఉంటుంది. క్యారెట్, బ్రొకొలి, ఆలుగడ్డ, పాలకూర వంటి వాటిల్లో విటమిన్ ఏ ఎక్కువ మొత్తంలో లభిస్తుంది.

తాజా పండ్లు:
రోజుకో యాపిల్ తిన్నట్లయితే ఆస్తమా రిస్క్ చాలా తగ్గుతుంది. ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది. అరటిపండులో ఉండే పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు ఆస్తమా నివారణకు చక్కగా ఉపయోగపడతాయి.

మెగ్నీషియం:
మెగ్నీషియం తగిన మోతాదులో లేనట్లయితే…శ్వాసకోస వ్యవస్థ పనితీరు కూడా తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. గుమ్మడిగింజలు, చేపలు, డార్క్ చాక్లెట్, పాలకూర వంటి వాటిల్లో మెగ్నీషియం తగినంత లభిస్తుంది.

వీటికి దూరంగా ఉండాలి.
కొన్ని ఆహార పదార్థాలు ఆస్తమాకు కారణం కాకపోవచ్చు. అయినా కూడా ఆస్తమా లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండటం చాలా అవసరం. సల్ఫైట్ అనే ప్రిజర్వేటివ్ ఆస్తమా లక్షణాలను పెంచుతుంది. ప్యాకేజ్డ్ పచ్చళ్లు లెమన్ జ్యూస్, డ్రైఫ్రూట్స్ సల్ఫెట్స్ ఉంటాయి. కాఫీ, టీ కొన్ని సుగంధ, మసాలా దినుసుల్లోని శాలిసిలేట్స్ కూడా ఆస్తమాను పెంచుతాయి. ప్యాకేజ్డ్ ఫుడ్స్ లో వాడే ప్రిజర్వేటివ్ లు ఆర్టిఫీషియల్ కలర్స్, ప్లావర్స్ తోనూ ఈ సమస్య మరింత తీవ్రతరం అయ్యే ప్రమాదం ఉంటుంది.