Site icon HashtagU Telugu

Arogya Mahila: తెలంగాణ మహిళల కోసం ‘ఆరోగ్య మహిళా’, రాష్ట్రంలో మరో 100 సెంటర్లు

మహిళల ఆరోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పథకాలు, కార్యక్రమాలు ప్రవేశపెట్టింది. ఇప్పటికే ప్రత్యేక క్లినిక్స్ ను ప్రారంభించి ఆరోగ్య సేవలను అందిస్తోంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 12 నుండి రాష్ట్రవ్యాప్తంగా మరో 100 కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించింది. మహిళల కోసం వారానికోసారి క్లినిక్‌లు నిర్వహించే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మార్చిలో ప్రారంభించారు.

సెప్టెంబరు 12 నుంచి అదనపు కేంద్రాలను ప్రారంభించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఆరోగ్య మహిళా పథకాన్ని 272 కేంద్రాల నుంచి అమలు చేస్తుండగా, వచ్చే మంగళవారం నుంచి కేంద్రాల సంఖ్య 372కి పెరగనుంది. ఆరోగ్య మహిళా క్లినిక్‌లు ప్రతి మంగళవారం వారానికి ఒకసారి పనిచేస్తాయి.

ఏమేం టెస్టులు చేస్తారంటే..

1, మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలు

2, ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్..

3, థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం. అయోడిన్ సమస్య, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపంతో పాటు, విటమిన్ బీ12, విటమిన్ డి పరీక్షలు చేసి చికిత్స, మందులు అందజేస్తారు.

4, మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధుల పరీక్షలు చేస్తారు.

5, మెనోపాజ్ దశకు సంబంధించి పరీక్షల అనంతరం అవసరమైన వారికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయడంతోపాటు కౌన్సిలింగ్ తో అవగాహన కలిగిస్తారు.

6, నెలసరి సమస్యలపై పరీక్షలు చేసి వైద్యం అందిస్తారు. సంతాన సమస్యలపై ప్రత్యే కంగా పరీక్షలు చేసి అవగాహన కలిగించడం, అవసరమైనవారికి ఆల్ట్రాసౌండ్ పరీక్షలు చేస్తారు.

7, సెక్స్ సంబంధిత అంటువ్యాధుల పరీక్షలు చేసి అవగాహన కలిగిస్తారు. అవసరమైన వారికి వైద్యం అందిస్తారు.

Also Read: AP News: చంద్రబాబు అరెస్ట్ ఎఫెక్ట్, రాష్ట్రవ్యాప్తంగా బస్సు సర్వీసులు రద్దు!

Exit mobile version