Bone Pain: ఈ రోజుల్లో 30 ఏళ్ల యువకుల్లో కూడా ఎముకల నొప్పులు (Bone Pain) రావడం ఆందోళన కలిగించే విషయం. ఆధునిక జీవనశైలి, సరైన ఆహారం లేకపోవడం, ఒత్తిడి వంటివి ఎముకల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకరాం.. కాల్షియం, విటమిన్ డి లోపాలు, హార్మోన్ల మార్పులు, ఆటోఇమ్యూన్ డిజార్డర్లు (రుమటాయిడ్ ఆర్థరైటిస్), గౌట్ లేదా ఆస్టియోపోరోసిస్ ప్రారంభం వంటివి ఈ నొప్పులకు కారణం కావచ్చు. మహిళల్లో గర్భం లేదా రుతుక్రమ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పులు కూడా ఎముకలను బలహీనపరుస్తాయి.
అంతేకాదు తప్పుడు భంగిమ, ఎక్కువసేపు కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం కూడా ఎముకల నొప్పికి దారితీస్తాయి. 30 ఏళ్ల తర్వాత ఎముకల సాంద్రత తగ్గడం ప్రారంభమవుతుంది. కాబట్టి సకాలంలో ఈ సమస్యలను గుర్తించి చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే భవిష్యత్తులో ఫ్రాక్చర్లు లేదా ఆస్టియోపోరోసిస్ వంటి తీవ్రమైన సమస్యలు రావచ్చని నిపుణులు హెచ్చరించారు.
ఎముకల నొప్పులకు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన పరీక్షలు
ఎముకల్లో నొప్పి, బిగుసుకుపోవడం లేదా అలసట వంటి లక్షణాలు కనిపిస్తే ఈ ఐదు పరీక్షలను వెంటనే చేయించుకోవడం మంచిది. ఇది సమస్యను గుర్తించడమే కాకుండా సకాలంలో చికిత్స పొందడానికి సహాయపడుతుంది.
బోన్ మినరల్ డెన్సిటీ (BMD) టెస్ట్ లేదా DEXA స్కాన్
ఈ పరీక్ష ఎముకల బలం, సాంద్రతను కొలవడానికి ఉపయోగపడుతుంది. దీనిని డ్యూయల్-ఎనర్జీ ఎక్స్-రే అబ్సార్ప్షియోమెట్రీ (DEXA) స్కాన్ అని కూడా అంటారు. ఈ స్కాన్ తక్కువ మోతాదు ఎక్స్-రేలను ఉపయోగించి ఎముకల్లోని కాల్షియం, ఇతర ఖనిజాల పరిమాణాన్ని తనిఖీ చేస్తుంది. ముఖ్యంగా 30 ఏళ్ల తర్వాత ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి ఈ పరీక్ష చేయించుకోవడం మంచిది. ఎందుకంటే ఈ వయస్సు నుండే ఆస్టియోపోరోసిస్ ప్రమాదం మొదలవుతుంది.
విటమిన్ డి టెస్ట్
విటమిన్ డి ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం. ఎందుకంటే ఇది కాల్షియంను శరీరం శోషించుకోవడానికి సహాయపడుతుంది. నిపుణుల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒక బిలియన్ మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. తరచుగా అలసట, కండరాల నొప్పి లేదా ఎముకలు బలహీనంగా అనిపిస్తే ఈ పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి.
Also Read: US Visa Fees: అమెరికా వెళ్లేవారికి బిగ్ షాక్.. ఖరీదైనదిగా మారిన వీసా!
కాల్షియం లెవెల్ టెస్ట్
కాల్షియం లోపం ఎముకలు బలహీనపడటానికి ప్రధాన కారణాలలో ఒకటి. ఈ పరీక్ష రక్తంలో కాల్షియం పరిమాణాన్ని అంచనా వేస్తుంది. కాల్షియం లోపం ఎముకలనే కాకుండా అనియమిత రుతుక్రమం, PCOS వంటి సమస్యలను కూడా పెంచుతుంది.
యూరిక్ యాసిడ్ టెస్ట్
గౌట్ లేదా గౌట్ ఆర్థరైటిస్ వంటి పరిస్థితుల్లో యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుతుంది. దీనివల్ల కీళ్లలో తీవ్రమైన నొప్పి వస్తుంది. కీళ్లలో వాపు లేదా తీవ్రమైన నొప్పి ఉన్నవారికి ఈ పరీక్ష చాలా ముఖ్యం. యూరిక్ యాసిడ్ పెరిగితే ఆహారం, జీవనశైలిలో మార్పులు చేయడం ద్వారా దానిని నియంత్రించవచ్చు.
రుమటాయిడ్ ఫ్యాక్టర్ (RF) టెస్ట్
రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్. ఇది కీళ్లలో నొప్పి, వాపుకు కారణమవుతుంది. ఈ పరీక్ష రక్తంలో రుమటాయిడ్ ఫ్యాక్టర్ ఉనికిని తనిఖీ చేస్తుంది. ఉదయం సమయంలో కీళ్లలో బిగుసుకుపోవడం లేదా నొప్పి ఉంటే ఈ పరీక్ష అవసరం. ఈ పరీక్ష ద్వారా రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ప్రారంభ దశలోనే గుర్తించి, తద్వారా చికిత్సను సులభతరం చేయవచ్చు.