బిజీ లైఫ్ స్టైల్, లేట్ నైట్ జాబ్స్ కారణంగా చాలా మంది రాత్రి పూట భోజనం ఆలస్యంగా చేస్తూ ఉంటారు. పార్టీలు, ఫంక్షన్లంటూ కూడా ఆలస్యంగా ఆహారం తింటూ ఉంటారు. కొంతమందికైతే రాత్రి పూట ఆలస్యంగా తినడం అలవాటుగా మారిపోతుంది. ఇలా రకరకాల కారణాల వల్ల కొందరు రాత్రిళ్లు ఆలస్యంగా భోజనం చేస్తుంటారు. కానీ, రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
డిన్నర్ లేట్ గా చేస్తే త్వరగా జీర్ణం కాదు. దీని కారణంగా అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. మీకూ ఈ అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి 9:00 గంటల తర్వాత డిన్నర్ చేస్తే ఆరోగ్యానికి హాని కలుగుతుందని NCBI చేసిన పరిశోధనలో వెల్లడైంది. నిద్రకు, భోజనానికి మధ్యలో కనీసం రెండు గంటల గ్యాప్ ఉండడం చాలా ముఖ్యం. భోజనం తిన్న వెంటనే నిద్రపోతే ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల మధ్యలో డిన్నర్ పూర్తి చేయాలని నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల మలబద్ధకం, గ్యాస్, రక్తంలో చక్కెర పెరగడం, ఊబకాయం, గుండె జబ్బులు వంటి అనేక అరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
జీర్ణక్రియ సమస్యలు వస్తాయ్:
రాత్రిపూట మన ఆహార అలవాట్లు జీర్ణక్రియపై ఎఫెక్ట్ చూపుతుంది. రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేస్తే డైరెక్ట్‌గా వెళ్లి పడుకుంటాం. భోజనం చేసిన తర్వాత ఎలాంటి యాక్టివిటీ ఉండదు. దీని వల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్, ఇతర జీర్ణవ్యవస్థ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
బరువు పెరుగుతారు:
రాత్రిపూట భోజనం ఆలస్యంగా చేస్తే బరువు పెరిగే అవకాశం ఉంది. సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరంలో జీవక్రియ మందగిస్తుంది. జీవక్రియ నెమ్మదిగా ఉంటే కేలరీలు సరిగ్గా బర్న్ కావు, శరీరంలో ఫ్యాట్ పెరగడం ప్రారంభమవుతుంది. భోజనానికి, నిద్రపోవడానికి మధ్య రెండు గంటల గ్యాప్ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
బీపీ పెరుగుతుంది:
పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన పరిశోధన ప్రకారం, రాత్రి ఆలస్యంగా తినడం వల్ల అధిక బీపీ, డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. రాత్రి డిన్నర్ ఆలస్యంగా తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. రక్తంలో కొవ్వును పెంచుతుంది. దీంతో గుండె జబ్బుల ప్రమాదం మరింతగా పెరుగుతుంది.
నిద్రలేమి సమస్య:
రాత్రిపూట ఆలస్యంగా తింటే నిద్రలేమికి దారితీస్తుంది. రాత్రిపూట నిద్రసరిగ్గా రావడం లేదని చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం రాత్రిపూట ఆలస్యంగా తినడం. డిన్నర్ లేట్‌గా తింటే ఆహారం సరిగ్గా జీర్ణం కాదు ఇది నిద్రలేమికి దారి తీస్తుంది.
జ్ఞాపకశక్తి తగ్గుతుంది:
రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తే మెదడుపై ప్రభావం పడుతుంది. కాలిఫోర్నియా లాస్ ఏంజిల్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఎలుకలపై చేసిన పరిశోధనలో నిద్ర వేళలో ఆహారం తిన్న ఎలుకల జ్ఞాపకశక్తిపై తీవ్ర ప్రభావం చూపింది. అలాగే నేర్చుకునే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది.
ఈ సమస్యలకు దారి తీస్తుంది:
రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తే మలబద్ధకం, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. జీర్ణక్రియ సరిగా లేకపోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందక శక్తి స్థాయి తక్కువగా ఉంటుంది. మీరు రోజంతా యాక్టివ్‌గా ఉండలేరు. మీ స్టామినా తగ్గే అవకాశం ఉంది.