. పల్లీల్లో దాగున్న పోషక శక్తి
. పల్లీ స్నాక్స్ వల్ల లాభాలు పరిమితిలోనే ఉండాలి
. జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదమే
Peanuts : మన రోజువారీ ఆహారంలో పల్లీలు ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. తక్కువ ఖర్చుతో లభించే ఈ పోషకాహారం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. పల్లీలతో చట్నీలు, పచ్చళ్లు మాత్రమే కాకుండా రకరకాల స్నాక్స్ కూడా తయారు చేస్తుంటారు. ముఖ్యంగా వీధి ఆహారంగా లభించే వేయించిన పల్లీలు చాలామందికి ఇష్టమైనవి. అయితే ఇవి నిజంగా ఆరోగ్యానికి మంచివేనా? లేక మితిమీరితే సమస్యలకే దారి తీస్తాయా? ఈ విషయంలో వైద్య నిపుణులు ఏమంటున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం.
పల్లీలు మొక్కల ఆధారిత ప్రోటీన్‌కు మంచి మూలం. శరీరానికి అవసరమైన ప్రోటీన్‌తో పాటు ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటుంది. వీటిలో నియాసిన్, ఫోలేట్, విటమిన్ ఈ వంటి ముఖ్యమైన విటమిన్లు ఉన్నాయి. అంతేకాదు రెస్వెరాట్రాల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల కణాల నష్టం తగ్గి, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. పల్లీల్లో ఉన్న అర్జినిన్ అనే అమైనో ఆమ్లం రక్తప్రసరణను మెరుగుపరచి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. మెదడు పనితీరు మెరుగవ్వడంలోనూ పల్లీలు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
ఉడికించిన లేదా డ్రై రోస్టెడ్ పల్లీలను స్నాక్స్‌గా తీసుకుంటే శరీరానికి శక్తి లభిస్తుంది. కడుపు నిండిన భావన కలగడంతో అధికంగా తినాలనే కోరిక తగ్గుతుంది. దీని వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. పల్లీల్లోని మంచి కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. అంతేకాదు వీటికి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల మధుమేహ రోగులకు కూడా కొంతమేర ఉపయోగకరంగా ఉంటాయి. రోజుకు ఒక చిన్న గుప్పెడు పల్లీలు సరిపోతాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
నూనెలో వేయించిన పల్లీలు ఎక్కువ ఉప్పు, మసాలాలతో చేసిన స్నాక్స్ క్యాలరీల బాంబుల్లాంటివి. ఒక గుప్పెడు పల్లీల్లోనే 160 నుంచి 200 క్యాలరీలు ఉంటే వేయింపుతో ఇవి మరింత పెరుగుతాయి. ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది. అలాగే కొందరిలో పల్లీలు తీవ్ర అలర్జీకి దారి తీస్తాయి. సరైన నిల్వ లేకపోతే పల్లీల్లో ఏర్పడే అప్లాటాక్సిన్లు కాలేయానికి హానికరం. పల్లీల్లో అధికంగా ఉండే ఒమెగా 6 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా తీసుకుంటే శరీరంలో అసమతుల్యత ఏర్పడి గుండె జబ్బులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలు రావచ్చు. ఫైటిక్ యాసిడ్ కారణంగా కాల్షియం, జింక్ శోషణ తగ్గే ప్రమాదమూ ఉంది. పల్లీలు ఆరోగ్యానికి మేలు చేసే ఆహారమే. అయితే తినే విధానం పరిమాణం చాలా ముఖ్యం. వేయించిన వాటికి బదులుగా ఉడికించిన లేదా తక్కువ నూనెలో వేపిన పల్లీలను పరిమితంగా తీసుకుంటేనే పూర్తి ప్రయోజనం పొందవచ్చు.
