Ankle Exercise: ఇల్లు లేదా ఆఫీసులో గంటల తరబడి కుర్చీలో ఒకే భంగిమలో కూర్చోవడం లేదా సరిలేని జీవనశైలి కారణంగా నడుము, భుజాలు, చీలమండలంలో పట్టేయడం లేదా నొప్పి రావడం అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. చిన్న చిన్న వ్యాయామాల ద్వారా శరీరంలో వశ్యతను, రక్త ప్రసరణను మెరుగుపరుచుకోవచ్చు. చీలమండల కదలిక అనేది అటువంటి సులభమైన, అత్యంత ప్రభావవంతమైన వ్యాయామం.
కేవలం 3 నుండి 5 నిమిషాలు చేస్తే చాలు
ఈ వ్యాయామాన్ని కేవలం 3-5 నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. ఇది చీలమండలు, పాదాలలో రక్త ప్రసరణను పెంచుతుంది. బిగుతును తొలగిస్తుంది. శరీర సమతుల్యతను మెరుగుపరుస్తుంది. ఇల్లు లేదా ఆఫీసులో కుర్చీలో కూర్చుని కూడా దీనిని సులభంగా చేయవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ కదలికలు కేవలం కొద్ది నిమిషాల్లోనే కీళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ముఖ్యంగా ఎక్కువ సేపు కూర్చునే లేదా నిలబడే వారికి ఇది ఎంతో ప్రయోజనకరం.
బిగుతును తగ్గించి కదలికలను సులభతరం చేస్తుంది
చీలమండల కదలికలు కీళ్ల బిగుతును తగ్గించి, శరీర బ్యాలెన్స్‌ను మెరుగుపరుస్తాయి. వీటిని క్రమం తప్పకుండా చేయడం వల్ల నడక సులభం అవుతుంది. కింద పడే ప్రమాదం తగ్గుతుంది. రోజువారీ పనులు చేసుకోవడం తేలికవుతుంది.
Also Read: రేవంత్ డీఎన్ఏలోనే ద్రోహ బుద్ధి ఉంది అంటూ హరీశ్ రావు ఫైర్
నిలబడి సులభంగా చేయగలిగే వ్యాయామం
- యాంకిల్ మూవ్‌మెంట్ టెక్నిక్ చాలా సులభం. దీనిని నిలబడి ఈ క్రింది విధంగా చేయవచ్చు.
- రెండు కాళ్లను దగ్గరకు చేర్చి నిటారుగా నిలబడండి. చేతులను నడుముపై లేదా పక్కకు ఉంచండి.
- కుడి కాలును కొద్దిగా ముందుకు చాపి, నేల నుండి సుమారు 9 అంగుళాలు (22-25 సెం.మీ) పైకి లేపండి.
- పాదాన్ని నెమ్మదిగా పైకి, కిందకు ఆడించండి. ఆ తర్వాత కుడి, ఎడమ వైపులకు కదిలించండి.
- అనంతరం పాదాన్ని గుండ్రంగా తిప్పండి. ముందుగా ‘క్లాక్ వైజ్’ (సవ్య దిశ), తర్వాత ‘యాంటీ-క్లాక్ వైజ్’ (అపసవ్య దిశ) లో 5-10 సార్లు చేయండి.
- ఈ సమయంలో కదలికలు నెమ్మదిగా, నియంత్రణలో ఉండాలి.
రోజులో ఎప్పుడైనా చేయవచ్చు
ఈ వ్యాయామాన్ని ఉదయం నిద్రలేవగానే లేదా పగలు ఎప్పుడైనా చేయవచ్చు. ప్రారంభంలో బ్యాలెన్స్ దొరకకపోతే గోడను లేదా కుర్చీని పట్టుకుని చేయండి. ఇది చీలమండలు, పాదాల కండరాలను బలోపేతం చేస్తుంది. రక్త ప్రసరణ పెరగడం వల్ల కాళ్లలో అలసట, వాపు తగ్గుతాయి. కీళ్ల వశ్యత పెరగడం వల్ల మోకాళ్లు, తుంటిపై ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యంగా వృద్ధులలో బ్యాలెన్స్ మెరుగుపడి వారు పడిపోయే ప్రమాదం తగ్గుతుంది.
