మాములుగా మనం ఆవు పాలు లేదా గేదె పాలు ఎక్కువగా తాగుతూ ఉంటాము. కానీ ఇదివరకటి రోజుల్లో అనగా మన అమ్మమ్మ తాతయ్యల కాలంలో మేక పాలు కూడా తాగేవారు. అప్పట్లో మేకలు బాగా ఉండటం వల్ల గేదెపాలు ఆవుపాల కంటే ఎక్కువగా మేకపాలు తాగేవారు. ఇప్పుడు కూడా ఎక్కడో మారుమూల పల్లెటూర్లలో మాత్రమే ఈ మేకపాలను తాగుతున్నారు. ఇటీవల కాలంలో మేకపాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకున్న తర్వాత వాటిని తాగడానికి చాలామంది ఆసక్తిని చూపిస్తూ ఉండడంతో మేకపాలకు మళ్ళీ ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. మేక పాలలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని మన డైట్‌లో చేర్చుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
మరి మేక పాల వల్ల కలిగే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మేక పాలలో ఆవు పాలతో సమానమైన కొవ్వు పదార్ధం ఉంటుంది. అయితే మేక పాలలోని కొవ్వు గ్లోబుల్స్ ఆవు పాలలో ఉన్న వాటి కంటే చిన్నగా ఉంటాయి. దీంతో ఇవి త్వరగా జీర్ణం అవుతాయి. మేక పాలు కడుపులోకి వెళ్లిన తర్వాత పెరుగుగా మారుతుంది. అయితే ఈ పెరుగు ఆవు పాలతో చేసిన పెరుగు కంటే మెత్తగా ఉంటుంది. ఆవు పాలలో 10 శాతం పెరుగు ఉంటే, మేక పాలలో 2 శాతం పెరుగు మాత్రమే ఉంటుంది. ఇది శరీర జీర్ణక్రియకు సహాయపడుతుంది. పొట్టలో గ్యాస్, ఉబ్బరం ఉండదు. ఆవు పాలలో క్యాసిమ్ అనే మిల్క్ ప్రోటీన్ ఉంటుంది. ఇది కొంతమంది పిల్లలకు ఎలర్జీని తెస్తుంది. మేక పాలలో ఫ్యాటీ యాసిడ్స్, ఒలిగోశాకరైడ్లు ఉంటాయి.
వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఈ పదార్థాలు శరీరంలో మంటను తగ్గించడానికి, రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఒక కప్పు మేక పాలలో ఆవు పాల కంటే 12 శాతం తక్కువ లాక్టోస్ ఉంటుంది. మేక పాలను పెరుగుగా కల్చర్ చేసినప్పుడు దానిలోని లాక్టోస్ శాతం ఇంకా తగ్గుతుంది. లాక్టోస్ సెన్సిటివిటీ ఉన్నవాళ్లు మేకపాలు తాగవచ్చు. కానీ మేకపాలు తాగే ముందు డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. అదేవిధంగా మేకపాలలో ప్రీబయోటిక్ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి గట్ ఫ్లోరాలో మంచి బ్యాక్టీరియా పెరుగదలకు తోడ్పడతాయి. ఈ చక్కెరలను ఒలిగోశాకరైడ్లు అంటారు. ఇవి తల్లి పాలలో కనిపించే కార్బోహైడ్రేట్లు, శిశువు జీర్ణవ్యవస్థలోని మంచి బ్యాక్టీరియాను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పాలలో విటమిన్ ఎ, బి కాంప్లెక్సు, కాల్షియం, పాస్సరస్ ఉంటాయి. ఇది తేలికగా శరీరంలోకి వెళ్లిపోతాయి. ఆవు పాలతో పోలిస్తే మేకపాలలో ఫ్రీ రాడికల్స్ కణాలు చాలా తక్కువగా ఉత్పత్తి అవుతాయి. మేకపాలు తాగే వారిలో జీవక్రియల రేటు అధికంగా ఉంటుంది. కొవ్వుశాతం తక్కువ. వీటికి గాయాలను మాన్పించే గుణం అధికంగా ఉంది.