Good Health : శరీరంలో ఈ రెండు విటమిన్లు లోపిస్తే ఇక అంతే సంగతులు.. అవే ఏంటంటే?

మానవ శరీరం నిజంగా ఒక అద్భుతం అని చెప్పవచ్చు. ఎందుకంటే మెదడులో ఆలోచనలు పుట్టడం, ఆ మెదడు ఆలోచనలను ఇతర అవయవాలు స్వీకరించి పనిచేయడం అన్నది శరీర వ్యవస్థలో కీలకం.

Published By: HashtagU Telugu Desk
Good Health

Good Health

మానవ శరీరం నిజంగా ఒక అద్భుతం అని చెప్పవచ్చు. ఎందుకంటే మెదడులో ఆలోచనలు పుట్టడం, ఆ మెదడు ఆలోచనలను ఇతర అవయవాలు స్వీకరించి పనిచేయడం అన్నది శరీర వ్యవస్థలో కీలకం. మన జీవితంలో ఇదంతా కూడా సజావుగా జరగాలి అంటే తగినంత శక్తి అవసరం. ప్రొటీన్లు కార్బోహైడ్రేట్లు చక్కెర కొవ్వు వంటి స్థుల పోషకాలతో పాటు విటమిన్లు ఖనిజ లవణాలు వంటి సూక్ష్మ పోషకాల కలయికే శక్తి. అందువల్ల శరీరానికి తగినంత పోషణ కల్పించకపోతే శక్తి హీనత, అనారోగ్యాలు సంభవిస్తుంటాయి.

అలాగే మానవ దేహ జీవక్రియలకు విటమిన్లు ఎంతగానో తోడ్పాటును అందిస్తుంటాయి. శరీరంలో కొన్ని విటమిన్లు లోపించినప్పుడు ఆ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. అయితే, డీ3, బీ12 వంటి విటమిన్ల లోపం తలెత్తినప్పుడు బయటికి కనిపించదు కానీ, లోపల్లోపలే నష్టం జరిగిపోతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని మెదడు నుంచి ఎముకల వరకు ప్రతి కణంలోనూ డీ3 గ్రాహకాలు ఉంటాయి. మన శరీరంలోని అనేక జన్యువులు సవ్యరీతిలో పనిచేసేందుకు ఈ విటమిన్లే ఛోదకశక్తిగా పనిచేస్తాయి. విటమిన్ డీ3 వల్ల తెల్ల రక్త కణాల ఉత్పాదన మెరుగవుతుంది.

వ్యాధినిరోధక టి-కణాలకు పోరాడేశక్తినిచ్చి, వ్యాధులకు వ్యతిరేకంగా సన్నద్ధం చేస్తుంది. థైరాయిడ్, సెక్స్ పరమైన హార్మోన్ల తయారీకి ఉపకరిస్తుంది. మెదడు ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తికి మేలు చేస్తుంది. ఎముకల పటుత్వానికి దోహదపడే కాల్షియం, ఫాస్పరస్ లను గ్రహించడానికి తోడ్పడుతుంది. ఇన్సులిన్ వ్యవస్థ సాఫీగా పనిచేసేందుకు దోహదపడుతుంది. ప్రధానంగా విటమిన్ డీ సూర్యకాంతి ద్వారా, కొన్ని రకాల ఆహారపదార్థాల ద్వారా లభిస్తుంది. సూర్యరశ్మి ద్వారా గ్రహించిన విటమిన్ డీ3ని కాలేయం, కిడ్నీలు యాక్టివేట్ చేస్తాయి. అప్పుడది కేవలం ఓ విటమిన్ గానే కాకుండా, ఓ హార్మోన్ గానూ పనిచేస్తుందట. బీ12 విటమిన్ కూడా మానవదేహం సజావుగా పనిచేసేందుకు కీలకపాత్ర పోషిస్తుంది. శక్తిని ఉత్పత్తి చేయడంలోనూ, కార్బోహైడ్రేట్ సంబంధిత జీవక్రియ, పేగుల ఆరోగ్యం, ఎర్ర రక్తకణాల ఉత్పత్తి, కంటి నరాల సహా ఇతర నరాల ఆరోగ్యం, మెదడు చురుకుదనం, జ్ఞాపకశక్తి, భావోద్వేగాల నియంత్రణ, ఇలా అనేక విధాలుగా విటమిన్ బీ12 ఉపయోగపడుతుంది. ఇక, డీ3, బీ12 విటమిన్లు లోపిస్తే ఏం జరుగుతుందంటే,ఒళ్లు నొప్పులు, మానసిక స్తబ్దత, అలసట, హార్మోన్ల అసమతుల్యత, గోళ్లు చిట్లిపోవడం, జ్ఞాపకశక్తిని కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

  Last Updated: 05 May 2023, 05:54 PM IST