Non-Veg Effect: మనలో చాలా మందికి ప్రతిరోజూ నాన్ వెజ్ తిననిదే ముద్ద దిగదు. ప్రతిరోజూ ముక్క ఉండాల్సిందే. కానీ.. మాంసాహారం ఎక్కువగా తినేవారిలో ఊబకాయం పెరుగుతుందని పలు పరిశోధనలలో వెల్లడైంది. మాంసంలో కొవ్వు అధికంగా ఉంటుంది. రోజూ లేదా.. వారానికి మూడు నాలుగుసార్లు మాంసాహారం తిన్నా వాటిలో ఉండే కొవ్వు శరీరంలో పేరుకుపోతుంది. దానిని కరిగించకపోతే.. కాలేయం, కిడ్నీ సంబంధిత వ్యాధులొస్తాయి. జీర్ణ వ్యవస్థపై కూడా చెడు ప్రభావం పడుతుంది. ఆహారంలో ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల పేగుల్లో ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. కడుపులో ఆమ్లం పెరగడంతో ఎముకలు, కీళ్లలో నొప్పి మొదలై ఏ పనిచేయలేకపోతారు.
అందుకే.. మాంసాహారం ఎక్కువగా తినాలనుకునేవారు దానితోపాటు కూరగాయలు, పండ్లు, సలాడ్ లు తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటి వల్ల శరీరానికి ప్రొటీన్ తో పాటు ఫైబర్ కూడా అందుతుంది. నాన్ వెజ్ ఎక్కువగా తినేవారిపై చేసిన పరిశోధనలో కొన్ని విషయాలు వెల్లడయ్యారు. లైఫ్ టైమ్ రిస్క్ పూలింగ్ ప్రాజెక్టులో భాగంగా యునైటెడ్ స్టేట్స్ లోని 6 ఫ్యూచర్ సమన్వయ అధ్యయనాల నుంచి పరిశోధకులు వీరిని ఎంచుకున్నారు. మొత్తం 30 వేల మంది నుంచి వారి డైట్ కు సంబంధించిన విషయాలను సేకరించారు. ARIC (అథెరోస్క్లెరోసిస్ రిస్క్ ఇన్ కమ్యూనిటీస్)అధ్యయనం, CARDIA అధ్యయనం, CHS (హార్ట్ హెల్త్ స్టడీ), FHS (ఫ్రేమింగ్ హామ్ హార్ట్ స్టడీ), FOS (ఫ్రేమింగ్ హామ్ సంతానం అధ్యయనం), MESA (మల్టీ ఎత్నిక్ స్టడీ ఆఫ్ అథెరోస్క్లెరోసిస్ అధ్యయనం) చేపట్టారు.
రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసాన్ని వారానికి రెండుసార్లు తినేవారికి గుండెపోటు, హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదం 3-7 శాతం ఎక్కువగా కలిగి ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. గుండె సంబంధిత వ్యాధులతో మరణించే ప్రమాదం 3 శాతం ఎక్కువ. అలాగే వారంలో రెండుసార్లు పౌల్ట్రీ తినేవారిలో గుండె జబ్బులొచ్చే ప్రమాదం 4 శాతం ఎక్కువగా ఉందని పరిశోధకులు వెల్లడించారు. కాగా.. చేపలు తినేవారిలో గుండెజబ్బులు తక్కువగా ఉన్నట్లు తెలిపారు.