Site icon HashtagU Telugu

High BP: చిన్నారులు, టీనేజర్లలోనూ అధిక రక్తపోటు…ఎందుకో కారణం చెప్పిన నిపుణులు..!!

Kids

Kids

హైబీపీ ( అధిక రక్తపోటు) ప్రపంచంలో చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. సాధారణంగా పెద్దవారిలో ఈ హైబీపీ లక్షణాలు కనిపిస్తుంటాయి. కానీ పిల్లల్లోనూ, టీనేజర్లలోనూ హైబీపీ కేసులు వెల్లడవుతున్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. పిల్లల్లో హైబీపీకి వారి జీవనశైలీనే ముఖ్య కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పెద్దగా పనిలేకపోవడం, చక్కెలు, ఉప్పు అధికంగా ఉండే పదార్థాలు తినడం వల్ల వారిలోనూ హైబీపీకి దారితీస్తోందని అధ్యయనంలో వివరించారు.

అధిక రక్తపోటుతో బాధపడుతున్న పది మంది బాలలను తీసుకుంటే వారిలో 9మంది పైఅంశాల కారణంగానే హైబీపీ బారినపడుతున్నారని వెల్లడైంది. ఈ అధ్యయనం కోసం ఆరు నుంచి పదహారేళ్ల వయస్సున్న బాలల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించారు. సదరు బాలల సంపూర్ణ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని వారి తల్లిదండ్రులకు నిపుణులు సూచించారు. పిల్లల ఆరోగ్యంలో గణనీయమైన మార్పులకు వారి తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాలని ఈ అధ్యయనంలో పాల్గొన్న ఇటలీకి చెందిన ప్రొఫెసర్ గియోవనీ డి సిమోన్ చెబుతున్నారు.

హైబీపీ, ఊబకాయం వంటి రుగ్మతలు చాలా తరచుగా ఒకే కుటుంబంలోని వ్యక్తుల్లో కనిపిస్తుంటాయి. అందుకే ఇలాంటి కుటుంబాల్లోని వ్యక్తులు కూడా తమ లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవడం అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా అధిక రక్తపోటుతో బాధపడే పిల్లలకు తాజా కూరగాయలు, ఫలాలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం అందించడంతోపాటు ఉప్పు, స్వీట్లు, శీతల పానీయాలు, కొవ్వు పదార్థాలకు దూరంగా ఉంచడం వల్ల వారిలో హైబీపీ లక్షణాలు అదుపులో ఉంటాయని సిమోన్ పేర్కొన్నారు.

ఇక పిల్లలు, టీనేజర్లు రోజులో ఒక గంటపాటైనా సరే కసరత్తులు చేయాలని జాగింగ్, సైక్లింగ్ స్విమ్మింగ్ చేయాలని సూచించారు. రెండు గంటలకు మించి ఒకే చోట కదలకుండా కూర్చోవడం వంటివి చేయకూడదని తెలిపారు. పిల్లలు అదేపనిగా టీవీ, స్మార్ట్ ఫోన్ వినియోగిస్తుంటే తల్లిదండ్రులు వారిని గమనిస్తుండాలని…శారీరక ఇతర పనుల వైపు మళ్లించాలని వెల్లడించారు. తరచుగా వారి బరువు, ఆహారపు అలవాట్లు వ్యాయామ సమయం వంటి అంశాల్లో వాస్తవిక లక్ష్యాలను నిర్దేశించి దానికి అనుగుణంగా వారిని పరిశీలిస్తుండాలని సిమోన్ వివరించారు.

Exit mobile version