Lung Problems: లంగ్స్ లో ప్రాబ్లమ్స్ ఉంటే బయటపెట్టే 7 సంకేతాలు

శరీరంలో ఏ సమస్య వచ్చినా.. ముందుగా దానికి సంబంధించిన లక్షణాలు బయటపడతాయి.

శరీరంలో ఏ సమస్య వచ్చినా.. ముందుగా దానికి సంబంధించిన లక్షణాలు బయటపడతాయి. ఊపిరితిత్తులకూ (Lung) ఈ రూల్ వర్తిస్తుంది. శ్వాసకోశ సమస్యలు (Respiratory Problems) ఉన్నప్పుడు.. వాటిని ముందుగానే గుర్తించేందుకు కొన్ని లక్షణాలు బయటికి కనిపిస్తాయి. ఇంతకీ అవేమిటి? వాటిని ఎలా గుర్తించాలి? శ్వాసకోశ సమస్యలు (Respiratory Problems) రాకుండా ఊపిరితిత్తులను (Lung) ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.

​ఛాతీ నొప్పి

ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు భరించలేని ఛాతి నొప్పి ఉన్నా.. ఊపిరి పీల్చినప్పుడు దగ్గు వస్తే అలర్ట్ కావాలి.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చింది అంటే.. ఊపిరితిత్తులు ఆక్సీజన్‌‌ను సరిపడా తీసుకునేంత శక్తిని కలిగి లేవని అర్థం. దీన్ని రాబోయే ప్రమాదానికి సంకేతంగా భావించాలి. మీరు శ్వాస తీసుకోవడంలో సమస్య ఎదుర్కొన్నా, వెంటనే వెంటనే ఊపిరి పీల్చుకోవాల్సి వచ్చినా.. ఊపిరితిత్తుల సమస్య వచ్చిందని గుర్తించాలి. ఊపిరితిత్తులలో కణితి లేదా కార్సినోమా నుంచి ద్రవం ఏర్పడటం వలన ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది.

​ఎక్కువ కాలం కఫం

కొన్ని నెలలుగా కఫం అనేది సమస్యగా మారి సతాయిస్తే.. అది అంటువ్యాధుల లక్షణం. ఊపిరితిత్తులు వ్యాధి బారిన పడ్డాయని దీని అర్ధం.

​ఆకస్మికంగా బరువు తగ్గడం

డైటింగ్, వ్యాయామం చేయకుండానే మీ శరీర బరువు తగ్గుతున్నట్లయితే.. మీరు అనారోగ్యానికి గురవుతున్నట్లే అని గుర్తించాలి.

హెమోప్టిసిస్

హెమోప్టిసిస్ కారణంగా శ్వాసకోశం నుంచి రక్తస్రావం జరుగుతుంది. హెమోప్టిసిస్ తీవ్రత అధికంగా ఉంటే.. 24 గంటల్లో 600 ఎంఎల్ కంటే ఎక్కువ రక్తస్రావం జరుగుతుంది. తద్వారా ఊపిరితిత్తులు ఫెయిల్ అవుతాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్ వల్ల ఏర్పడిన కణితి కారణంగా పుపుస ధమనులు దెబ్బతింటాయి. తద్వారా హెమోప్టిసిస్‌లో రక్తం ఈ శ్వాసనాళ నుంచి వస్తుంది.

గురక

గురక అనేది చాలా మందిలో కనిపిస్తుంటుంది. అయితే, ఈ గురక రావడానికి కారణం శ్వాస సంబంధిత సమస్యలే. ఊపిరితిత్తుల పనితీరులో సమస్య ఉంటే గురక సమస్య తలెత్తుతుంది. గురకకు అత్యంత సాధారణ కారణాలు.. ఆస్తమా, COPD.

పల్మనరీ ఎంబోలిజం

ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టడాన్ని పల్మనరీ ఎంబోలిజం అంటారు. ఇక్కడ ధమని ఊపిరితిత్తుల కణజాలానికి రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. ఊపిరితిత్తులను కప్పి ఉంచే పొర వాపు వస్తుంది. దీనిని ప్లూరిసీ అని పిలుస్తారు. దీని కారణంగా ఛాతీ నొప్పి, ఊపిరి పీల్చినప్పుడు, దగ్గినప్పుడు నొప్పి వస్తుంటుంది. ఊపిరితిత్తులు, పక్కటెముకల మధ్య ఖాళీలోకి గాలి లీక్ అయినప్పుడు కూడా నొప్పి వస్తుంటుంది.

ఊపిరితిత్తుల సమస్యలు (Lung Problems) తొలగించే ఎక్సర్ సైజ్స్ ఇవీ..

బెల్లీ బ్రీతింగ్‌

బెల్లీ బ్రీతింగ్‌ వ్యాయామం కడుపు, పొత్తికడుపు కండరాలతో పాటు ఛాతీ, కడుపుల మధ్య అడ్డుగోడగా ఉండే డయాఫ్రంలతో కూడుకుంది. ఈ వ్యాయామంతో గుండె వేగం తగ్గి, రక్తపోటు నిలకడగా ఉంటుంది. తొలుత మోకాళ్లు, తల అడుగున దిండ్లు ఉంచుకుని నేల లేదా పరుపు మీద వెల్లకిలా పడుకోవాలి. భుజాలను విశ్రాంతిగా ఉంచి, ఒక చేతిని ఒక చేతిని బొడ్డు మీద, మరో చేతిని ఛాతీ మీద ఉంచుకోవాలి. రెండు సెకన్ల పాటు గాలి పీల్చుకుని, ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు కడుపు ఎలా కదులుతుందో గమనించాలి. నోటి ద్వారా నెమ్మదిగా ఊపిరి వదులుతూ, కడుపులోని కండరాల సహాయంతో గాలి మొత్తాన్నీ బయటకు పంపించాలి.

​యాక్టివ్‌ బ్రీతింగ్‌

యాక్టివ్‌ సైకిల్‌ ఆఫ్‌ బ్రీతింగ్‌ టెక్నిక్‌ ఊపిరితిత్తుల్లోని నెమ్మును మూడు దశల్లో క్లియర్‌ చేస్తుంది. ఈ వ్యాయామం కోసం తొలుత కుర్చీలో కూర్చుని, చేతులను పొత్తికడుపు మీద ఉంచుకుని.. ప్రధాన శ్వాసకోశ కండరాలు కదిలేలా కొంతసేపు దీర్ఘ శ్వాస తీసుకోవాలి. అనంతరం ఛాతీ విప్పారేలా మూడు సెకన్లు పాటు గాలి పీల్చుకుని, నాలుగు సెకన్ల పాటు ఊపిరిని బిగపట్టి ఉంచి, ఐదు సెకన్ల పాటు నెమ్మదిగా ఊపిరి వదలాలి. ఈ వ్యాయామంలో గాలిని నోటి ద్వారా పీల్చుకుంటూ, ముక్కు ద్వారా వదలాలి. నోటిని సగం తెరచి ఉంచి, దీర్ఘ శ్వాస తీసుకోవాలి. రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఊపిరి బిగపట్టి ఉంచి వేగంగా గాలిని బయటకు వదలాలి.

స్ట్రా వ్యాయామం

ఇది ఊపిరితిత్తులను బలపరిచే తేలికైన వ్యాయామం. దీని కోసం ఒక స్ట్రా, అర గ్లాసు నీళ్లు అవసరం. తొలుత ముక్కుతో గాలి పీల్చుకుని, స్ట్రా ద్వారా వదులుతూ గ్లాసులో నీటి బుడగలు సృష్టించాలి. తర్వాత నోటి నుంచి స్ట్రా తీసి, తిరిగి ఇదే వ్యాయామాన్ని కొనసాగించాలి.

​బెలూన్‌ ఎక్సర్ సైజ్

శ్వాసకోశ కండరాలు బలపడడానికి ఈ వ్యాయామం తోడ్పడుతుంది. ఇందుకోసం నోటిలోకి వీలైనంత ఎక్కువ గాలిని తీసుకోవాలి. బెలూన్‌ను నోటి దగ్గర ఉంచి, దాన్లోకి నోటిలోకి తీసుకున్న గాలిని ఊదాలి. ఇలా వీలైనన్ని బెలూన్లు ఊదాలి.

స్పైరోమీటర్‌ వ్యాయామం

ఈ వ్యాయామంలో స్పైరోమీటర్‌తో నెమ్మదిగా గాలి పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తులు పూర్తిస్థాయిలో గాలిని నింపుకుంటాయి. దాంతో పలు హెల్త్ ప్రాబ్లమ్స్ కు కారణమయ్యే ఊపిరితిత్తుల్లోని ద్రవం వదులవుతుంది. గాలి పీల్చుకునేటప్పుడు స్పైరోమీటర్‌ను నిలువుగా ఉంచుకుని, వదిలేటప్పుడు తల కిందులుగా ఉంచాలి. ఈ వ్యాయామం కోసం.. తొలుత కుర్చీలో లేదా మంచం అంచు మీద కూర్చోవాలి. స్పైరోమీటర్‌ను ఎదురుగా పట్టుకుని, మౌత్‌పీస్‌ను పెదవులతో గట్టిగా పట్టి ఉంచాలి. అందులోని బంతులు వీలైనంత పైకి లేచేవరకూ గాలిని పీల్చుకోవాలి. తర్వాత స్పైరోమీటర్‌ను తలకిందులుగా చేసి, అందులోని బంతులు పైకి లేచేలా గాలిని వదలాలి. ఈ వ్యాయామాన్ని 10 నుంచి 12 సార్లకు మించి చేయకూడదు.

Also Read:  Hiccups: ఎక్కిళ్లు ఎన్నో అనర్థాలకు సూచన. అప్రమత్తంగా ఉండాల్సిందే!