Site icon HashtagU Telugu

Surgery: అపోలోలో మొద‌టి రోబోటిక్ బేరియాట్రిక్ స‌ర్జ‌రీ స‌క్సెస్‌

Bariatric

Bariatric

జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్స్ లో మొద‌టి రోబోటిక్ బేరియాట్రిక్ స‌ర్జ‌రీ జ‌రిగింది. అధునాతన ల్యాప్రోస్కోపీ, రోబోటిక్ సర్జరీ నిపుణులు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఈ స‌ర్జ‌రీ జ‌రిగింది. డాక్టర్ శివ చరణ్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, మరో సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మల్లికార్జున్, కన్సల్టెంట్ డాక్టర్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యాధునికమైన డావిన్సీ క్సీ రోబోటిక్ సిస్టమ్‌ను ఉపయోగించి ఈ ప్రక్రియను నిర్వహించారు.180 కిలోల బరువున్న 40 ఏళ్ల సోమాలియన్ హిబిబో అబ్దుల్లే మొహమ్మద్ శ్వాస ఆడకపోవడం, కీళ్ల నొప్పులు, అనియంత్రిత మధుమేహం, పిత్తాశయంలో రాళ్లు, వెంట్రల్ హెర్నియా ఫిర్యాదులతో ఆసుపత్రికి వచ్చారు.

నిపుణులు ఆమెను ప‌రీక్ష చేసిన తర్వాత చాలా ఆరోగ్య‌ సమస్యలు, అసాధారణమైన అధిక బరువును పరిగణనలోకి తీసుకుని రోబోటిక్ విధానాన్ని సూచించారు. రోగి శ్వాస కోసం కృత్రిమ మద్దతుతో ఉన్నారని, ఆమెను ఆసుపత్రికి తరలించినప్పుడు ఎవ‌రి మద్దతు లేకుండా ఆమె స్వయంగా కదలలేదని డాక్టర్ శివ చరణ్ రెడ్డి తెలిపారు. స‌ర్జ‌రీ త‌రువాత ఆమె సాధారణంగా శ్వాస తీసుకోగలుగుతోంది. చిన్న సహాయంతో న‌డుస్తుంద‌ని ఆయ‌న తెలిపారు.ఈ స‌ర్జ‌రీకి మూడు గంటల సమయం పట్టిందని.. కడుపులో మూడింట రెండు వంతుల భాగాన్ని తొలగించడం, గాల్ బ్లాడర్‌ను తొలగించడం జ‌రిగింద‌న్నారు. స‌ర్జ‌రీ జ‌రిగిన త‌రువాత రోగి రెండవ రోజు డిశ్చార్జ్ చేశామ‌ని.. రెండు వారాల త‌రువాత‌ ఆమె పూర్తిగా కోలుకుందని డాక్ట‌ర్లు తెలిపారు. ఆమె దాదాపు 15 కిలోల బరువు తగ్గింద‌ని..

సాధారణంగా శ్వాస తీసుకుంటోందని వెల్ల‌డించారు. మినిమల్లీ ఇన్వాసివ్‌గా ఉండటం వల్ల ఆమె త్వరగా కోలుకోవడానికి సహాయపడిందని డాక్టర్ మల్లికార్జున్ తెలిపారు. రోబోట్‌ను ఉపయోగించడం ద్వారా శస్త్రచికిత్సలో మానవ తప్పిదాలను తగ్గించి, సాధ్యమైనంత ఉత్తమమైన ఫలితాలను అందించారు. రోబోటిక్ స్టెప్లర్‌లలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రయోజనం ఉత్తమ ఫలితాలను అందించడంలో సహాయపడుతుందని.. అటువంటి ప్రక్రియల సంక్లిష్టతను బాగా తగ్గిస్తుందని డాక్టర్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.