కిడ్నీ వ్యాధులకు సంబంధించి చాలా మందికి ప్రాథమిక పరిజ్ఞానం కూడా ఉండదు. అందువల్ల ఆ వ్యాధులను గుర్తించడం ఆలస్యం అవుతుంది. దాంతో జరిగే నష్టం జరిగిపోతుంది. మానవ శరీరంలో రెండు మూత్రపిండాలు(కిడ్నీలు) ఉంటాయి. ఇవి ప్రాథమికంగా రక్తాన్ని శుద్ధి చేస్తాయి. శరీరంలో నీటి సమతౌల్యతను నిర్వహిస్తాయి. లక్షల మంది కిడ్నీ వ్యాధులు తెలియకుండానే జీవిస్తుంటారు.అందుకే కిడ్నీ వ్యాధిని ‘సైలెంట్ కిల్లర్’అని కూడా అంటారు. వ్యాధి నిర్థారణ పరీక్షలు చేయించడం ఒక్కటే దీనిని గుర్తించడానికి సరైన మార్గం. కిడ్నీ వ్యాధులను ప్రాథమికంగా గుర్తించడానికి 11 హెచ్చరిక సంకేతాలు లేదా లక్షణాలను నిపుణులు చెబుతున్నారు.
1.అలసట, నీరసం ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ వ్యాధికి ఇది ప్రధాన లక్షణం. రక్తంలో విష పదార్థాలు, మలినాలు చేరడం, మూత్రపిండాలు బలహీన పడటం వల్ల ఈ లక్షణం కనిపిస్తుంది.
2.శ్వాస సమస్య ఏర్పడుతుంది. అధిక బరువు, షుగర్ వ్యాధి లేకుండానే శ్వాస సమస్య ఏర్పడుతుంది. నోటితో గాలి పీల్చుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.
3.ఆకలి తగ్గుతుంది. రుచిలో మార్పులు వస్తాయి.
4.ఉదయం పూట వికారంగా ఉండటం, వాంతులు రావడం జరుగుతుంది. కిడ్నీల పనితీరు క్షీణించడాన్ని తెలిపే ప్రాథమిక లక్షణాలు ఇవి.
5. కిడ్నీ వ్యాధులలో సాధారణ సమస్యలలో రక్త హీనత ఒకటి.
6.రాత్రి సమయంలో ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లవలసి వస్తుంది. కొన్ని సందర్భాలలో మూత్రవిసర్జనకు వెళ్లడం తగ్గవచ్చు.
7. మూత్రంలో రక్తం పడటం లేదా నురగతో కూడిన మూత్రం రావడం. కిడ్నీల యంత్రాంగం దెబ్బతిన్నప్పుడు ఇలా జరుగుతుంది.
8.కిడ్నీల పనితీరు క్షీణించినప్పుడు చర్మం పొడిబారడం, దురదరావటం, చర్మం నుంచి దుర్వాసన రావడం జరుగుతుంది.
9.వెన్ను నొప్పి లేదా పొత్తికడుపు నొప్పి తీవ్రంగా వస్తుంది. చీలమండలు, పాదాలు లేదా కాళ్లపై వాపులు వస్తాయి.
10. అధిక రక్తపోటు కిడ్నీ వ్యాధికి సంకేతం.
11.కళ్ల చుట్టూ ఉబ్బటం.కిడ్నీ వ్యాధుల ప్రారంభ సంకేతాల్లో ఇది ఒకటి.
ఈ విధంగా కిడ్నీ వ్యాధులకు సంబంధించి ముందుగా మన శరీరమే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఆ హెచ్చరికలను మనం గుర్తించకపోతే కిడ్నీ ఫెయిల్ అయి డయాలసిస్ కు, కిడ్నీ మార్పిడికి దారి తీస్తుంది. మరణానికి కూడా దారి తీసే ప్రమాదం ఉంది. అందువల్ల శరీరం ఇచ్చే సంకేతాలను మనం గుర్తించి ముందుగా జాగ్రత్త పడటం మంచిది.