Fact Check : హలాల్ జ్యూస్ పేరుతో జ్యూస్‌లోకి ఉమ్మి.. వైరల్ వీడియోలో నిజమెంత ?

వైరల్ అవుతున్న వీడియోకు(Fact Check) సంబంధించిన ప్రచారంలో వాస్తవికత లేదు.

Published By: HashtagU Telugu Desk
Halal Juice Spitting In Juice Prank Video Viral Fact Check

Fact Checked By telugupost

ప్రచారం : హలాల్ పేరుతో.. ఒక దుకాణదారుడు పండ్ల రసాన్ని ఎంగిలి చేస్తున్నాడు.

వాస్తవం : ఇది పాలస్తీనాకు చెందిన నటుడు తాయిర్ అబూ జుబేదా  చిత్రీకరించిన ప్రాంక్ వీడియో.

హలాల్ అనేది అరబిక్ పదం. హలాల్ అంటే ఇస్లామిక్ చట్టం ప్రకారం ముస్లింలు తినడానికి అనుమతించబడిన ఆహారం, పానీయాలు.  ‘‘హలాల్ పేరుతో తినే పదార్థాలు, పానీయాలలోనూ ఉమ్మివేస్తున్నారు’’ అని పేర్కొంటూ  అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఒక పండ్ల విక్రేత కస్టమర్ ముందే.. పండ్ల రసంలోకి ఉమ్ముతాడు. అనంతరం అక్కడున్న కస్టమర్‌ అతడిని తిడతాడు. ఈ సీన్‌లతో కూడిన ఒక వీడియో సోషల్ మీడియాలో, ముఖ్యంగా వాట్సాప్‌లో తెలుగు క్యాప్షన్‌తో వైరల్ అవుతోంది. “హలాల్ పేరుతో ఒక ముస్లిం వ్యక్తి జ్యూస్‌ను ఎంగిలి చేసి *HALAL Juice *గా ఇస్తుంటే రియాక్షన్.. ఇది మన దేశం లోనిది కాదు. మన దేశం లో అయితే  సెక్యులరిజం ప్రమాదంలో పడింది అంటూ జిహాదీల బానిసలు రచ్చ రచ్చ చేసే వాళ్ళు .. HALAL Juice’’  అంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

ఆ వీడియో అదే క్యాప్షన్‌తో వాట్సాప్‌లో సర్క్యులేట్ అవుతోంది.
ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో.. 2024లో కూడా వైరల్ అయింది.

వైరల్ పోస్టుకు సంబంధించిన ఆర్కైవ్ లింక్‌ను మీరు చూడొచ్చు.

వాస్తవ తనిఖీలో తేలిన అంశాలివీ.. 

  • వైరల్ అవుతున్న వీడియోకు(Fact Check) సంబంధించిన ప్రచారంలో వాస్తవికత లేదు.
  • ఈ వీడియోలో ముస్లిం వ్యక్తి జ్యూస్‌లో ఉమ్మేయడం కనిపించడం లేదు. ఇది ఒక ప్రాంక్ వీడియో.
  • వైరల్ వీడియో నుంచి కీఫ్రేమ్‌లను మేం సేకరించినప్పుడు, ఈ కీఫ్రేమ్‌లపై అరబిక్ టెక్స్ట్ కనిపించింది. మేం గూగుల్ లెన్స్‌ని ఉపయోగించి టెక్స్ట్‌ను ఆంగ్లంలోకి అనువదించినప్పుడు అది ‘Thaer Abu Zubaida’s prank at the Islamic University’ అని కనిపించింది. దీన్ని బట్టి ఇదొక ప్రాంక్ వీడియో అని తేలింది. @mahmood.246 అని ట్యాగ్ చేసిన వీడియోలో TikTok వాటర్‌మార్క్ కూడా కనిపిస్తుంది. స్క్రీన్ షాట్‌ను కూడా ఇక్కడ చూడొచ్చు.

ఆ వీడియో సఫావత్ ముస్తఫా దహిర్ అనే అరబిక్ యూట్యూబ్ ఛానల్‌లో షేర్ చేశారని కూడా మేం గుర్తించాం. ఈ వీడియో టైటిల్ ద్వారా ఇది ఒక ప్రాంక్ వీడియో అని తెలుస్తోంది.

  • Thaer Abu Zubeida‌కు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాల గురించి మేం వెతికాం. ఇన్‌స్టాగ్రామ్ఫేస్‌బుక్ హ్యాండిల్స్‌తో పాటు థేర్ అబూ జుబేదా అనే యూట్యూబ్ ఛానెల్‌ను కూడా గుర్తించాం. ఆ ఛానెల్ వివరణలో అతను “థియేటర్, సినిమా ఆర్టిస్ట్, హిడెన్ కెమెరా ప్రెజెంటర్” అని ఉంది.
  • ఈ హ్యాండిల్స్‌లో ఏ ఒక్కదానిలోనూ వైరల్ వీడియో కనిపించనప్పటికీ.. పండ్ల జ్యూస్ విక్రేతగా నటించిన వ్యక్తి, ఇతర వీడియోలలోని వ్యక్తి ఒకరేనని మేం గుర్తించాం.
  • మేం టిక్‌టాక్ వీడియో కోసం సెర్చ్ చేసినప్పుడు, వైరల్ వీడియోకు సంబంధించిన ఫుల్ వెర్షన్‌ను చూపించే ఆర్కైవ్ చేసిన వీడియో మాకు కనిపించింది. 1.47 నిమిషాల నిడివి కలిగిన ఫుల్ వర్షన్  వీడియోలో.. ఇది ఒక ప్రాంక్ వీడియో అని సదరు కస్టమర్ గ్రహించి, దుకాణానికి తిరిగొచ్చి జ్యూస్ విక్రేత థేర్ అబూ జుబేదాను కౌగిలించుకున్నట్లు ఉంది. ఆ తర్వాత చుట్టూ ఉన్న వ్యక్తులు చప్పట్లు కొడుతూ అతడిని ఉత్సాహపరిచారు.
  • ఈ వీడియోకు సంబంధించి నిడివి ఎక్కువ ఉన్న వెర్షన్‌ను పైన మీరు చూడొచ్చు. ఇందులో జ్యూస్ కొనడానికి వచ్చిన వ్యక్తి నవ్వుతూ దుకాణదారుడితో మాట్లాడడం.. వీడియోలో ఉన్న మిగితా వారు కూడా నవ్వుతూ చూస్తుండడం మనం గమనించొచ్చు. కాబట్టి, జ్యుస్ అమ్మే వ్యక్తి  ఉమ్మేస్తున్నట్లు చూపించే వీడియో ఒక ప్రాంక్ వీడియో అని తేలింది.  దీన్నిబట్టి  వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని స్పష్టమైంది.

(ఈ న్యూస్ స్టోరీని ఒరిజినల్‌గా telugupost వెబ్‌సైట్ ప్రచురించింది. ‘శక్తి కలెక్టివ్’‌లో భాగంగా దీన్ని ‘హ్యాష్ ట్యాగ్‌యూ తెలుగు’ రీపబ్లిష్ చేసింది) 

  Last Updated: 19 Mar 2025, 08:46 PM IST