Site icon HashtagU Telugu

Fact Check : 823 ఏళ్ల తర్వాత అరుదైన ఫిబ్రవరి 2025లో వస్తోంది.. నిజమేనా ?

Fact Check 2025 February Special 823 Years

Fact Checked By telugupost

ప్రచారం : 2025 సంవత్సరంలో ఫిబ్రవరి నెల చాలా ప్రత్యేకం. ఈవిధమైన ఫిబ్రవరి నెల 823 ఏళ్లకోసారి మాత్రమే వస్తుంది.

వాస్తవం  : ఈ ప్రచారం నిజం కాదు.

Also Read :Hush Money Case : ట్రంప్‌‌కు షాక్.. హష్‌ మనీ కేసులో శిక్ష ఖరారును ఆపలేమన్న సుప్రీంకోర్టు

ఫిబ్రవరి అనేది సంవత్సరంలో రెండో నెల. ఫిబ్రవరి నెల లీపు సంవత్సరాలలో వచ్చినప్పుడు .. ఆ నెలలో 29 రోజులే ఉంటాయి. సాధారణ సంవత్సరాల్లో వచ్చే ఫిబ్రవరి నెలలో 28 రోజులు ఉంటాయి. ఏడాదిలో అతి చిన్న నెల అయిన ఫిబ్రవరి(Fact Check) విషయంలో ప్రస్తుతం రకరకాల ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది లీపు సంవత్సరం కాదు. అందుకే ఈసారి (2025 సంవత్సరంలో) ఫిబ్రవరి నెలలో 28 రోజులే ఉంటాయి.

‘‘ఈ ఏడాది ఫిబ్రవరి నెలకొక ప్రత్యేకత ఉంది. 2025 సంవత్సరం ఫిబ్రవరి (February) నెలలో వారంలో ఏడు రోజులూ ఒక్కోటి నాలుగేసి సార్లు రానున్నాయి. 823 ఏళ్లకోసారి మాత్రమే ఇలా వస్తుందని గణిత శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రతి 176 సంవత్సరాలకోసారి ఫిబ్రవరిలో సోమ, శుక్ర, శనివారాలు మూడేసి రోజులు మాత్రమే వస్తాయని తెనాలి (Teanali) డిగ్రీ కాలేజీ అధ్యాపకుడు ఎస్‌వీ శర్మ చెప్పారు’’ అంటూ సాక్షి వెబ్ సైట్లో ఒక  కథనం ప్రచురితమైంది. ఆ కథనం ఉన్న లింక్ ఇక్కడ మీరు చూడొచ్చు. తుపాకీ అనే తెలుగు వెబ్‌సైటులో కూడా ఇదే విధమైన కథనం ఒకటి ప్రచురితం అయింది.  దీంతో సోషల్ మీడియా యూజర్లు ఈ అంశంపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.  రకరకాల పోస్టులు పెడుతున్నారు. 2025 ఫిబ్రవరి నెలలో వారంలో ఏడు రోజులూ ఒక్కోటి నాలుగేసిసార్లు వస్తాయని చెబుతున్నారు. 2025 ఫిబ్రవరిలో నాలుగు ఆదివారాలు, నాలుగు సోమవారాలు అలా అన్నీ నాలుగేసి వస్తాయని.. ఇది అత్యంత అరుదని వ్యాఖ్యానాలు చేస్తున్నారు.

ఫ్యాక్ట్ చెకింగ్‌లో ఏం తేలిందంటే..

  • వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. గతంలో కూడా ఫిబ్రవరి నెలలో నాలుగు ఆదివారాలు, నాలుగు సోమవారాలు ఇలా వచ్చాయి.
  • 2025 సంవత్సరం ఫిబ్రవరి క్యాలెండర్‌ను మేం పరిశీలించాం. ఫిబ్రవరిలో ప్రతి వారం నాలుగు సార్లు వచ్చిందని గుర్తించాం. దీని వెనుక ఉన్న కారణాన్ని కనుగొనడానికి మేం ప్రయత్నించగా,  లీపు సంవత్సరం మినహా, ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో 28 రోజులు ఉంటాయి. ఆ సమయంలో వారానికి ఏడు రోజులు ఉంటాయి. కాబట్టి ఆ ఫిబ్రవరిలో నాలుగు ఆదివారాలు, నాలుగు సోమవారాలు రావడం అనేది కామన్. ఇది అరుదైన అంశమేం కాదు. దీనికి ఎలాంటి స్పెషాలిటీ లేదు.
  • లీపు సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉంటాయి. దీని కారణంగా నెలలో ఏదైనా ఒక రోజు ఐదు సార్లు వస్తుంది. మిగిలిన రోజులు నాలుగు సార్లు వస్తాయి.
  • మేం 2021, 2023 సంవత్సరాలకు సంబంధించిన ఫిబ్రవరి నెల క్యాలెండర్‌ను చూశాం. అందులో కూడా ప్రతి వారం నాలుగేసి సార్లు వచ్చాయి.
  • 823 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఫిబ్రవరి ఇలా వస్తుందా అని తెలుసుకోడానికి మేం సంఖ్యా శాస్త్రవేత్తను సంప్రదించాం. లీపు సంవత్సరం తప్ప మిగతా సంవత్సరాల్లో ఫిబ్రవరిలో ప్రతిరోజు నాలుగు సార్లు వస్తుందని వివరించారు. ఇదేమీ అత్యంత అరుదైన అంశం కాదని  తేల్చి చెప్పారు. కాబట్టి వైరల్ అవుతున్న పోస్ట్‌లో నిజం లేదని గుర్తించాం.
  • 2021 సంవత్సరంలో కూడా ఇదే వాదనతో పోస్టులు వైరల్ అయ్యాయి. వాటిలో ఎలాంటి నిజం లేదని ఫ్యాక్ట్ చెక్ చేసిన విషయాన్ని గుర్తించాం. దాన్ని ఇక్కడ చూడొచ్చు.

(ఈ న్యూస్ స్టోరీని ఒరిజినల్‌గా telugupost వెబ్‌సైట్ ప్రచురించింది. ‘శక్తి కలెక్టివ్’‌లో భాగంగా దీన్ని ‘హ్యాష్ ట్యాగ్‌యూ తెలుగు’ రీపబ్లిష్ చేసింది)