Fact Check: షిర్డీ సాయి ట్రస్ట్ నుంచి హజ్ యాత్రికులకు 35 కోట్ల విరాళం ?

ఈ వ్యాఖ్యలతో పాటు ఆ పోస్టుకు గూగుల్ సెర్చ్‌లో వచ్చిన సమాధానం స్క్రీన్ షాట్(Fact Check) కూడా జోడించారు.

Published By: HashtagU Telugu Desk
Fact Check Shirdi Sai Trust Funds To Haj Pilgrims Haj Yatra Maharashtra

Fact Checked By Newsmeter

ప్రచారం :  షిర్డీ సాయి ట్రస్ట్ నుంచి హజ్ యాత్రికులకు రూ.35 కోట్ల విరాళం ఇచ్చారు.

వాస్తవం : ఈ ప్రచారం తప్పు. షిర్డీ సాయి ట్రస్ట్ నుంచి హజ్ యాత్రికులకు రూ.35 కోట్ల విరాళం ఇచ్చారన్న ప్రచారంలో నిజం లేదు.

‘‘షిర్డీ సాయి ఆలయ ట్రస్ట్ .. హజ్ యాత్ర కోసం ముస్లింలకు రూ.35 కోట్ల విరాళం అందజేసింది’’ అని ప్రచారం చేస్తున్న పోస్టు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘షిర్డీ సాయి ఆలయానికి ఇచ్చే విరాళాలను హజ్ యాత్ర కోసం ముస్లింలకు అందజేస్తున్నారు. ఆ ఆలయానికి ఇక విరాళాలు ఇవ్వకండి’’ అని హిందువులకు పిలుపునిస్తూ ఆ వైరల్ పోస్ట్‌లో ప్రస్తావించారు.

ఇంకా ఈ పోస్టులో.. ‘‘షిర్డీ  సాయి ఆలయ ట్రస్ట్  హజ్ యాత్ర కోసం ముస్లింలకు రూ.35 కోట్లు అందజేసిందట! మన హిందువుల విరాళాలను ముస్లింల హజ్ యాత్ర కోసం ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ వ్యవస్థలను అర్థం చేసుకోండి. దయచేసి షిర్డీ సాయి ఆలయంలో విరాళాలు ఇవ్వడం మానేయండి’’ అని రాశారు.

ఈ వ్యాఖ్యలతో పాటు ఆ పోస్టుకు గూగుల్ సెర్చ్‌లో వచ్చిన సమాధానం స్క్రీన్ షాట్(Fact Check) కూడా జోడించారు. ‘‘షిర్డీ సాయి ట్రస్ట్ హజ్ యాత్ర ప్యాకేజీ కోసం ఏదైనా మొత్తం విరాళంగా ఇచ్చిందా’’ అనే ప్రశ్న వేసినట్లు కనిపిస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానంగా..  ‘‘షిర్డీ సాయి ట్రస్ట్ హజ్ యాత్ర కోసం రూ.35 కోట్లు విరాళంగా ఇచ్చింది’’ అని ఉంది.

ఈ పోస్టుని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి శీర్షికలో ఈ విధంగా రాశారు.. ‘‘షిర్డీ సాయి ఆలయ ట్రస్ట్‌ హజ్ యాత్ర కోసం ముస్లింలకు రూ.35 కోట్లు అందజేసిందట! మన హిందువుల విరాళాలను ముస్లింల హజ్ యాత్ర కోసం ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ వ్యవస్థలను అర్థం చేసుకోండి. దయచేసి షిర్డీ సాయి ఆలయంలో విరాళాలు ఇవ్వడం మానేయండి!” (ఆర్కైవ్)

వాస్తవ తనిఖీలో ఏం గుర్తించారు? 

  • ఈ ప్రచారం తప్పు అని న్యూస్‌మీటర్ గుర్తించింది. షిర్డీ సాయి ట్రస్ట్ నుంచి హజ్ యాత్ర కోసం ఎలాంటి విరాళాలను ఇవ్వలేదు.
  • ఇంత పెద్ద మొత్తం షిర్డీ సాయి ట్రస్ట్ నుంచి హజ్ యాత్ర కోసం విరాళంగా ఇచ్చారా అనేది తెలుసుకునేందుకు మేం ఇంటర్నెట్‌లో కీ వర్డ్ సెర్చ్ చేశాం.  షిర్డీ సాయి ట్రస్ట్ నుంచి హజ్ యాత్రికులకు రూ.35 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు ధృవీకరించే వార్త కథనాలేవీ మాకు దొరకలేదు.
  • షిర్డీ సాయి ట్రస్ట్ వెబ్ సైటులో  కూడా ఈ విషయం గురించిన ఎలాంటి సమాచారం దొరకలేదు.
  • వైరల్ పోస్టులో ఉన్న స్క్రీన్ షాట్‌లో.. గూగుల్ సెర్చ్ ఇచ్చిన ఫలితంలో @kavita_tewari అనే ట్విట్టర్ (ప్రస్తుతం X) అకౌంట్ నుంచి చేసిన పోస్టు కనిపిస్తుంది.@kavita_tewari అకౌంట్‌ను మేం పరిశీలించిన తర్వాత స్క్రీన్ షాట్లో కనిపిస్తున్న పోస్ట్‌ను తీసివేశారని(డిలీట్ చేశారని) తేలింది.
  • గతంలో కూడా షిర్డీ సాయి ట్రస్ట్ నుంచి హజ్ యాత్ర కోసం విరాళాలు వెళ్లాయనే పుకార్లు వ్యాపించాయి. అప్పట్లో వాటిని ఉద్దేశించి షిర్డీ సాయి ట్రస్ట్ సీఈఓగా వ్యవహరించిన రాహుల్ జాదవ్ చేసిన వ్యాఖ్యను ETV Bharat 2023 ఏప్రిల్ 24న   ప్రచురించిన కథనంలో చూడొచ్చు.
  • షిర్డీ సాయి ట్రస్ట్ నుంచి హజ్ యాత్రికులకు 35 కోట్ల విరాళం అందలేదు. ఈవిధంగా తప్పుడు సమాచారాన్ని యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై వ్యాప్తి చేస్తూ, సంస్థానం పరువుకు నష్టం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని షిర్డీ సాయి ట్రస్ట్ హెచ్చరించింది.

కాబట్టి వైరల్ అవుతున్న క్లెయిమ్స్ తప్పు న్యూస్‌మీటర్ నిర్ధారించింది.

(ఈ న్యూస్ స్టోరీని ఒరిజినల్‌గా newsmeter వెబ్‌సైట్ ప్రచురించింది. ‘శక్తి కలెక్టివ్’‌లో భాగంగా దీన్ని ‘హ్యాష్ ట్యాగ్‌యూ తెలుగు’ రీపబ్లిష్ చేసింది) 

  Last Updated: 29 Mar 2025, 06:59 PM IST