Site icon HashtagU Telugu

Fact Check : అన్ని నగరాల్లో 15 కి.మీ పరిధిలో ఇక నో హెల్మెట్ ?

Fact Check No Helmet Indian Cities Court Ruling Helmet Wearing Telugupost

Fact Checked By telugupost

ప్రచారం : దేశంలోని అన్ని నగరాల్లో 15 కి.మీ పరిధిలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ను వినియోగించాల్సిన అవసరం లేదు.

వాస్తవం : ఈ వాదన అబద్ధం. హెల్మెట్ ధరించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ ఏ కోర్టు కూడా ఆదేశాలను ఇవ్వలేదు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. పోలీసులు తనిఖీ చేస్తూ ఛలానాలు విధిస్తున్నా, లైసెన్సులు రద్దు చేస్తాం అంటున్నా  కొందరు ద్విచక్ర వాహనదారుల్లో నిర్లక్ష్యం తగ్గడం లేదు. హెల్మెట్ ధరించని వాహనదారులకు విధించే ఛలానాను మార్చి 1వ తేదీ నుంచి వెయ్యి రూపాయలకు పెంచారు. అవసరమైతే లైసెన్సు‌ను కూడా రద్దు చేస్తారు.

దేశంలోని అన్ని నగరాల్లో 15 కి.మీ పరిధిలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ను వినియోగించాల్సిన అవసరం లేదంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియా వినియోగదారుడు ఒకరు.. “హెల్మెట్ పై కీలక తీర్పు ఇచ్చిన న్యాయస్థానం 👌👌👌” అనే క్యాప్షన్ తో ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో లో న్యూస్‌కు సంబంధించిన బ్రేకింగ్ అప్‌డేట్లను చూడొచ్చు. ‘‘దేశంలోని నగరాల పరిధిలో హెల్మెట్ లేకుండా ప్రయాణించొచ్చు.సాగర్ కుమార్ జైన్ పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు, ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న హెల్మెట్(Fact Check) తనిఖీ ప్రక్రియను తిరస్కరించింది. మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వాడకం తప్పనిసరి కాదు. మీ రక్షణ మీ ఇష్టం. రాష్ట్ర రహదారి లేదా జిల్లా రహదారి హోదా పొందిన రోడ్లపై  హెల్మెట్ ధరించడం అయితే తప్పనిసరి. ఇకపై ఎవరైనా ట్రాఫిక్ లేదా ఇతర పోలీసులు మీరు హెల్మెట్ ఎందుకు ధరించలేదు అని అడిగితే.. మున్సిపల్ కార్పొరేషన్, పంచాయతీ సమితి, నగర పరిధిలోనే ఉన్నానని వారికి చెప్పొచ్చు. ఈ విషయం అందరికీ తెలిస్తే సంతోషంగా ఉంటుంది. నగరం వెలుపల 15 కిలోమీటర్లలోపు హెల్మెట్ వాడకున్నా మిమ్మల్ని అడగటానికి వీల్లేదు. ఈ సందేశాన్ని సాధ్యమైనంత వరకు అందరికీ షేర్ చేయండి’’ అని  బ్రేకింగ్ అప్‌డేట్‌లలో ప్రస్తావించారు.

ప్రచారం చేసిన వీడియోక్లిప్‌తో కూడిన స్క్రీన్ షాట్ ను ఈ కింద చూడొచ్చు.

వాస్తవ తనిఖీలో ఏం గుర్తించారు ?

  • దేశంలోని నగరాల్లో 15 కి.మీ పరిధిలో హెల్మెట్‌లను ఉపయోగించాల్సిన అవసరం లేదంటూ కోర్టు తీర్పు ఇచ్చిందనే ప్రచారం పూర్తిగా అబద్ధం. ఈ వీడియో పాతది. భారతదేశంలోని ఏ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు అలాంటి ఆదేశాలను ఇవ్వలేదు.
  • ఈ అంశంపై 2020 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన  ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ చేసింది. ఆ వివరాలతో అప్పట్లో ఎక్స్ వేదికగా ఒక పోస్ట్‌ను ప్రచురించింది. దాన్ని మేం గుర్తించాం. నగరాల్లో 15 కిలోమీటర్ల పరిధిలో వాహనదారులు హెల్మెట్ ధరించడం తప్పనిసరి కాదంటూ వైరల్‌ అయిన వార్తలు తప్పు అని పీఐబీ  తేల్చి చెప్పింది.

చట్టం ఏం చెబుతోంది..

1988 మోటారు వాహనాల చట్టం ప్రకారం.. ద్విచక్ర వాహనాలు నడిపే వ్యక్తులు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. ఈ చట్టానికి అనేక సవరణలు చేశారు. దీనికి చివరిసారిగా 2019లో సవరణ చేశారు. సెక్షన్ 129 ప్రకారం.. 4 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న ఎవరైనా సరే బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ తప్పక ధరించాలి. హెల్మెట్ లేకుండా ఎవరైనా ద్విచక్ర వాహనం నడుపుతూ దొరికితే, సెక్షన్ 194 ప్రకారం  నేరస్థుడికి  రూ.1000 జరిమానా విధించాలి. అదనంగా, వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను మూడు నెలల పాటు సస్పెండ్ చేయొచ్చు.

గత ఐదు నెలల్లో..

టైమ్స్ ఆఫ్ ఇండియా  కథనం ప్రకారం.. గత ఐదు నెలల్లో (2024 సెప్టెంబర్  నుంచి 2025 ఫిబ్రవరి వరకు) వైజాగ్‌లో హెల్మెట్ లేకుండా బైక్‌లు నడిపినందుకు 26,500 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లను సస్పెండ్ చేశారు.

వైరల్ అయిన వీడియోలోని వివరాలతో ఒక కథనం ఇంతకుముందు 2022 సంవత్సరంలో పబ్లిష్ అయింది. అప్పట్లో కూడా అది వైరల్ అయింది. అప్పుడు కూడా తెలుగుపోస్ట్ ఈ వాదనను పరిశీలించి తప్పు అని తేల్చింది.

మొత్తం మీద..  నగరాల్లో 15 కిలోమీటర్ల పరిధిలో హెల్మెట్ వాడకం తప్పనిసరి కాదనే వాదన అవాస్తవం. అటువంటి చట్టం ఏదీ లేదు. ఏ న్యాయస్థానం కూడా దీనికి సమ్మతి ఇవ్వలేదు. దేశమంతటా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం తప్పనిసరి.

(ఈ న్యూస్ స్టోరీని ఒరిజినల్‌గా telugupost వెబ్‌సైట్ ప్రచురించింది. ‘శక్తి కలెక్టివ్’‌లో భాగంగా దీన్ని ‘హ్యాష్ ట్యాగ్‌యూ తెలుగు’ రీపబ్లిష్ చేసింది) 

Exit mobile version