Fact Checked By Newsmeter
ప్రచారం : హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలిలో అడవులను నరికిన తర్వాత సింహాలు రోడ్డుపై తిరుగుతున్నట్లు ఒక వీడియో వైరల్ అవుతోంది.
వాస్తవం: ఈ ప్రచారం తప్పు. ఈ వీడియోను 2024 నవంబరులో గుజరాత్‌లో రికార్డ్ చేశారు.
Also Read :7 Foot Conductor: 7 అడుగుల బస్ కండక్టర్‌కు ఊరట.. సీఎం రేవంత్ గుడ్‌న్యూస్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతం కంచ గచ్చిబౌలి. కంచ గచ్చిబౌలిలో ఇటీవలే అడవులను నరికారనే ప్రచారం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 మార్చి నెలాఖరులో ఐటీ పార్కును అభివృద్ధి చేయడానికి కంచ గచ్చిబౌలి అడవుల్లో దాదాపు 400 ఎకరాలను తొలగించిందని ప్రచారం చేశారు. అడవులను నరికేసిన తర్వాత.. కంచ గచ్చిబౌలి ఫారెస్టు ప్రాంతంలో నుంచి సింహాలు బయటికి వచ్చి రోడ్లపై తిరుగుతున్నట్లుగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జంతువులు ఇప్పుడు తెలంగాణలోని హైదరాబాద్ శివార్లలో రోడ్లపై ఆశ్రయం పొందుతున్నాయనే వదంతులను కొందరు వ్యాపింపజేశారు.
ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేస్తూ , “తెలంగాణ అడవులు నాశనమయ్యాయి. జంతువులు ఇప్పుడు రోడ్లపై, మానవ నివాసాలలో ఆశ్రయం పొందుతున్నాయి” అని రాశారు.
వాస్తవ తనిఖీలో గుర్తించిన అంశాలివీ..
- ఈ వీడియో కొత్తది కాదు. దీన్ని 2024 నవంబరులో గుజరాత్‌లో(Fact Check) రికార్డ్ చేశారని న్యూస్‌మీటర్ గుర్తించింది. కాబట్టి ఈ వీడియో కొత్తది అనే వాదన తప్పు.
- మేం రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. దీంతో ఈ వీడియోను తొలుత ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్ 2024 నవంబర్ 8న పోస్ట్ చేశారని వెల్లడైంది. ఆ పోస్ట్‌లో #GirForest అనే హ్యాష్‌ట్యాగ్ ఉంది. ఈ వీడియో ఫుటేజీని గుజరాత్‌లోని గిర్ ప్రాంతంలో రికార్డ్ చేశారని తేలింది.
- పశ్చిమ భారత రాష్ట్రమైన గుజరాత్‌లో ఉన్న గిర్ వన్యప్రాణుల అభయారణ్యం చాలా పెద్దది. ఇది అరుదైన ఆసియాటిక్ సింహాలకు నిలయం.
- అహ్మదాబాద్ మిత్ర అనే యూట్యూబ్ ఛానల్ 2024 నవంబర్ 11న ఈ వీడియోను పబ్లిష్ చేసింది. 12 సింహాల గుంపు రోడ్డు వెంట నడుస్తూ కనిపించిందని ఆ వీడియోలో పేర్కొన్నారు.
- ఈ ఆధారాలను అనుసరించి మేం కీవర్డ్ సెర్చ్ చేశాం. దీంతో వైరల్ అయిన వీడియోను న్యూస్18 , దివ్య భాస్కర్ అనే మీడియాలు 2024 నవంబరులో పబ్లిష్ చేశాయని వెల్లడైంది.
- గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో ఉన్న రజూల -సోమనాథ్ జాతీయ రహదారి వెంట రాత్రి టైంలో పది ఆసియాటిక్ సింహాలు నడుస్తున్నట్లు వైరల్ వీడియోలో ఉంది. సింహాలు రోడ్డు వెంట నడవడం, రోడ్డు పక్క నుంచి వెళ్తున్న వాహనాల హెడ్‌లైట్ల వెలుగులు కూడా వీడియోలో కనిపించాయి.
- కాబట్టి, ఈ వైరల్ వీడియో తెలంగాణకు చెందినది అనే వాదన అబద్ధమని మేం నిర్ధారించాము.