Site icon HashtagU Telugu

Fact Check: మనుషుల కంటే అగ్నిపర్వతాలే ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ విడుదల చేస్తాయా ?

Fact Check Human Activities Co2 Emission Volcanoes Emission Human Emission Co2

Fact Checked By telugupost

ప్రచారం : జపాన్‌లో ఉన్న సకురాజిమా వంటి క్రియాశీల అగ్నిపర్వతాలు మానవ కార్యకలాపాల కంటే ఎక్కువ కార్బన్ డయాక్సైడ్‌(CO2)ను విడుదల చేస్తాయి. 

వాస్తవం : క్రియాశీల అగ్నిపర్వతాల కంటే ప్రపంచ మానవుల కార్యకలాపాల వల్లే వాతావరణంలోకి ఎక్కువ కార్బన్ డయాక్సైడ్‌‌ విడుదల అవుతుంది. మానవ కార్యకలాపాల వల్ల విడుదలయ్యే CO2తో పోలిస్తే, అతి కొద్ది భాగాన్ని మాత్రమే అగ్నిపర్వతాలు ఉత్పత్తి చేస్తాయి. 

జపాన్‌లోని కగోషిమా ప్రిఫెక్చర్‌ ప్రాంతంలో సకురాజిమా అగ్నిపర్వతం ఉంది. అది 2024 డిసెంబర్‌లో విస్ఫోటనం చెందింది. 2025 సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువసార్లు దానిలో విస్ఫోటనాలు జరిగాయి. దీనివల్ల ఆ అగ్నిపర్వతం పరిసరాల్లోని అడవుల్లో మంటలు రాచుకున్నాయి.  ఈ అగ్నిపర్వత విస్ఫోటనాన్ని చూపించే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోతో చేసిన పోస్ట్‌లలో.. “సకురాజిమా అగ్నిపర్వతం లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్‌ను(Fact Check) వెదజల్లుతుంది.  మనుషులు వినియోగించే శాకాహారం,  ఎలక్ట్రిక్ కార్లు పర్యావరణాన్ని కాపాడుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్నాయి. వింతగా ఉంది” అని రాశారు. ఈ పోస్ట్‌ను కింద మీరు చూడొచ్చు.

ఈ వార్తకు సంబంధించిన క్లెయిమ్ కోసం ఆర్కైవ్ లింక్ ఇక్కడ ఉంది. దీన్ని మీరు చూడొచ్చు.

వాస్తవ తనిఖీలో ఏం తేలింది ?

  • అన్ని క్రియాశీల అగ్నిపర్వతాలు కలిసి మానవ కార్యకలాపాల కంటే  ఎక్కువ కార్బన్ డయాక్సైడ్‌ను వెదజల్లుతాయనే వాదన తప్పు.
  • ఆ సోషల్ మీడియా పోస్ట్‌లోని పదాలతో మేం ఇంటర్నెట్‌లో కీవర్డ్ సెర్చ్ చేశాం. సంబంధిత వివరాల కోసం వెతికాం.
  • అన్ని నేలపై  ఉన్న (ఆన్ ల్యాండ్), సముద్రంలోని (సబ్‌మెరైన్) అగ్నిపర్వతాల వల్ల వాతావరణంలోకి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ సమాచారంతో యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే  ఒక నివేదికను ప్రచురించిందని మేం గుర్తించాం. దీని ప్రకారం అగ్నిపర్వతాలన్నీ కలిసి సంవత్సరానికి 0.13 గిగాటన్ నుంచి 0.44 గిగాటన్ దాకా కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను విడుదల చేస్తాయి.  ఇదే ఏడాది వ్యవధిలో మానవ కార్యకలాపాల వల్ల వాతావరణంలోకి దాదాపు 35 గిగాటన్నుల కర్బన ఉద్గారాలు రిలీజ్ అవుతాయి.  2010 సంవత్సర అంచనాలతో ఈ నివేదికను రూపొందించారు. ఈ లెక్కన అగ్నిపర్వతాల కంటే మానవ కార్యకలాపాల వల్ల విడుదలయ్యే కర్బన ఉద్గారాలు దాదాపు 80 నుంచి 270 రెట్లు ఎక్కువ.
  • పర్వతాలపై ఉన్న (సబ్‌ఏరియల్), సముద్రంలోని (సబ్‌మెరైన్) అగ్నిపర్వతాలు మానవ కార్యకలాపాల వల్ల విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్‌తో పోలిస్తే ఒక శాతం కంటే తక్కువే  విడుదల చేస్తున్నట్లు ఆ నివేదికలో ప్రస్తావించారు.
  • అగ్నిపర్వతాల నుంచి విడుదలయ్యే కర్బన ఉద్గారాల కంటే మానవ కార్యకలాపాల వల్ల విడుదలయ్యే కర్గన ఉద్గారాలు 100 రెట్లు ఎక్కువ అని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ NASA వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.
  • ఎల్లోస్టోన్ లేదా మౌంట్ టోబా వంటి భారీ అగ్నిపర్వతాలలో విస్ఫోటనాలు జరగడం అనేది చాలా అరుదు. ఇవి ప్రతి లక్ష సంవత్సరాల నుంచి 2 లక్షల సంవత్సరాలకు ఒకసారి విస్ఫోటనం అవుతాయి. మానవ కార్యకలాపాల వల్ల నిరంతరం కర్బన ఉద్గారాలు విడుదల అవుతూనే ఉంటాయి. అందుకే వీటి నుంచి విడుదలయ్యే CO2 ఉద్గారాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

  • అమెరికా ప్రభుత్వానికి చెందిన climate.gov వెబ్‌సైట్ ప్రకారం.. ప్రతి సంవత్సరం అగ్నిపర్వతాల కంటే మానవ కార్యకలాపాల వల్ల 60 రెట్లు ఎక్కువ కార్బన్ డయాక్సైడ్  విడుదల అవుతుంది.
  • ప్రపంచంలో పారిశ్రామిక విప్లవం ప్రారంభమైనప్పటి నుంచి మానవ కార్యకలాపాల వల్ల 2వేల బిలియన్ మెట్రిక్ టన్నులకుపైగా కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి రిలీజ్ అయింది.
  • ఇదే వాదనను సోషల్ మీడియాలో చాలా సంవత్సరాలుగా షేర్ చేస్తున్నారు. రాయిటర్స్, USA టుడే వంటి అనేక వాస్తవ తనిఖీ సంస్థలు సైతం దీన్ని  తోసిపుచ్చాయి .
  • అందువల్ల, క్రియాశీల అగ్నిపర్వతాలు మానవ కార్యకలాపాల కంటే ఎక్కువ కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తాయనే ప్రచారం తప్పు. క్రియాశీల అగ్నిపర్వతాలు విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్ కంటే మానవ కార్యకలాపాలు ప్రతి సంవత్సరం 60 రెట్లు ఎక్కువ కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తాయి.

(ఈ న్యూస్ స్టోరీని ఒరిజినల్‌గా telugupost వెబ్‌సైట్ ప్రచురించింది. ‘శక్తి కలెక్టివ్’‌లో భాగంగా దీన్ని ‘హ్యాష్ ట్యాగ్‌యూ తెలుగు’ రీపబ్లిష్ చేసింది)