Site icon HashtagU Telugu

Fact Check : ‘‘రూ. 21వేలతో 31 రోజుల్లో రూ.31 లక్షలు’’.. ఇవి సుధామూర్తి వ్యాఖ్యలేనా ?

Fact Check Infosys Chairperson Sudhamurthy App Promotion On Money Earning

Fact Checked By telugupost

ప్రచారం : ‘‘ఇన్ఫోసిస్ ఛైర్‌పర్సన్ సుధామూర్తి ఒక యాప్‌ను ప్రమోట్ చేస్తున్నారు. ఆ యాప్‌లో రూ. 21వేలు పెట్టుబడి పెట్టి, 31 రోజుల్లో రూ.31 లక్షలను సంపాదించొచ్చని ఆమె కోరారు’’ అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఒక వీడియో వైరల్ అవుతోంది.  

వాస్తవం : సుధామూర్తికి చెందిన ఒక వీడియోను ఎడిట్ చేసి.. ఫేక్ వీడియోను తయారు చేశారు. ఈ ఫేక్ వీడియోలో ఉన్న ఆడియో సుధామూర్తిది కాదు. దాన్ని ఏఐతో జనరేట్ చేసి, జతపరిచారు.  

Also Read :Tahawwur Rana : తహవ్వుర్ రాణా గది ఇలా ఉంటుంది.. 12 మందికే ఆ పర్మిషన్

నారాయణ మూర్తి,  సహచరులు అంతకంటే ఎక్కువే పనిచేశారు : సుధామూర్తి 

రచయిత్రి, ఇన్ఫోసిస్ ఛైర్‌పర్సన్ సుధామూర్తి తన భర్త నారాయణ మూర్తి వ్యాఖ్యలపై ఇటీవలే స్పందించారు. ఉద్యోగుల ఉత్పాదకతను పెంచడానికి వారానికి 70 గంటలు పనిచేసే అంశాన్ని పరిగణించాలని యువతకు ఆయన చేసిన సూచన వివాదానికి దారితీసింది. ఈ సూచనపై తొలిసారి సుధా మూర్తి స్పందించారు. ఇన్ఫోసిస్ ప్రారంభ రోజులను, కంపెనీని నిర్మించడానికి చేసిన త్యాగాలను ఆమె గుర్తు చేసుకున్నారు. ఇన్ఫోసిస్ విజయంలో మ్యాజిక్ అంటూ ఏమీ లేదని, కేవలం కృషి, అదృష్టం, సరైన సమయంలో సరైన చోట ఉండటం వల్లే విజయం సాధ్యమైందన్నారు. కంపెనీ నిర్మాణాత్మక సంవత్సరాల్లో నారాయణ మూర్తి,  ఆయన సహచరులు వారానికి 70 గంటలు లేదా అంతకంటే ఎక్కువ టైం పనిచేశారని సుధామూర్తి చెప్పుకొచ్చారు. లేకపోతే ఇన్ఫోసిస్ ఇంతటా సక్సెస్ అయ్యేదే కాదన్నారు. తన భర్త ఇన్ఫోసిస్‌పై చూపిన అంకితభావానికి మద్దతు ఇవ్వడానికి తాను కూడా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నానని సుధామూర్తి చెప్పారు. ఇన్ఫోసిస్‌ను మీరు చూసుకోండి.. నేను కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని ఆయనకు భరోసా ఇచ్చానన్నారు.

ఫేక్ వీడియోలో ఇలా ఉంది.. 

ఇటీవలే బెట్టింగ్ యాప్‌ను సుధామూర్తి ప్రమోట్ చేస్తున్న వీడియో(Fact Check) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో.. ‘‘ఎలాంటి అవగాహన లేకున్నా డబ్బులు సంపాదించొచ్చు. భారతీయుల జీవితాన్ని మెరుగుపర్చడమే  మా ప్రధాన లక్ష్యం. రూ. 21,000 పెట్టుబడి పెట్టి 31 రోజుల్లో రూ. 31,00,000 సంపాదించొచ్చు. మంచి డబ్బులు వస్తాయి. వీడియో కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి’’ అని ఆ వీడియోలో సుధామూర్తి చెప్పినట్టుగా మనకు కనిపిస్తుంది. వాస్తవానికి ఇందులోని ఆడియో(మాటలు) సుధామూర్తి చెప్పినవి కావు. ఏఐతో ఆ మాటలను చెప్పించి.. సుధామూర్తి ఇంటర్వ్యూ వీడియోలో జతపరిచారు. రూ.21వేలతో రూ.31 లక్షలు సంపాదించొచ్చనే మాట ఏదీ సుధామూర్తి చెప్పలేదు.

https://www.facebook.com/share/194p9X2Mvg/వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ఇక్కడ చూడొచ్చు..

వాస్తవ తనిఖీలో ఏం గుర్తించారు ? 

  • వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. సుధామూర్తి ఆడియోను డిజిటల్‌గా మ్యానిప్యులేట్ చేశారు. సుధామూర్తి ఇలాంటి ప్రకటనలు చేయలేదని మేం గుర్తించాం.
  • సుధామూర్తి వీడియోను అనేక కీలక ఫ్రేమ్‌లుగా విభజించి, రివర్స్ సెర్చ్ చేశాం. మాకు maturedgirl7 అనే ఇన్‌స్టా‌గ్రామ్ పేజీలో ఉన్న ఒక వీడియో కనిపించింది. వైరల్ వీడియోలోనూ, ఈ ఇన్‌స్టాగ్రామ్ పేజీలోనూ సుధామూర్తి  ఒకే చీరను ధరించి కనిపించారు. ఆమె కూర్చున్న కుర్చీ, వెనుకనున్న బ్యాక్ గ్రౌండ్ అంతా ఒకటేనని మేం ధృవీకరించాం. ఈ వీడియోను 2024 నవంబర్ 30న పోస్టు చేశారు.
  • మేం తదుపరి పరిశోధనలో Candid chat with Mrs. Sudha Murty about her career, raising kids, secrets of happiness, giving back అనే టైటిల్‌తో 2024 నవంబరు 19న The Jaya Show: Unconventional Grassroot Stories అనే యూట్యూబ్ ఛానల్‌లో పూర్తి ఇంటర్వ్యూ లభించింది. ఈ వీడియోను నిశితంగా పరిశీలించాం.. వైరల్ పోస్టుల్లో ఉన్నట్లుగా యాప్ ను సుధామూర్తి ఎక్కడా ప్రమోట్ చేయలేదు.

  • వైరల్ వీడియోను ఈ వీడియో నుంచే క్రాప్ చేసి తీసుకున్నారు. దానికి ఏఐ జనరేటెడ్ ఆడియోను జతపరిచి, ఫేక్ వీడియోను తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
  • మేం వైరల్ వీడియోను నిశితంగా పరిశీలించగా.. సుధామూర్తి లిప్ సింక్‌కు వెనుక వస్తున్న ఆడియోకు ఎలాంటి సంబంధం లేదని గుర్తించాం. సుధామూర్తి మాట్లాడడం ఆపిన తర్వాత కూడా వాయిస్ వినిపిస్తూ ఉండడంతో ఇది డిజిటల్ గా మ్యానిప్యులేట్ చేసిన ఆడియో అని మేం తేల్చాం.
  • మేం వైరల్ వీడియోను AI డిటెక్షన్ టూల్స్ ద్వారా తనిఖీ చేశాం. ఈ వీడియోలో ఆడియోను ఏఐ ద్వారా రూపొందించారని మేం నిర్ధారించాం. హైవ్ మోడరేషన్ టూల్ ఈ కంటెంట్‌ను 95 శాతం మ్యానిప్యులేట్ చేశారని నిర్ధారించింది.

కాబట్టి, వైరల్ వీడియోలోని ఆడియోను డిజిటల్‌గా మ్యానిప్యులేట్ చేశారని తేలింది. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసేలా పలువురు ప్రముఖుల విజువల్స్‌ను వాడుకుంటూ, ఏఐ ద్వారా ఆడియోను క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి మోసపూరిత కంటెంట్‌కు నెటిజన్లు  దూరంగా ఉండాలి.

(ఈ న్యూస్ స్టోరీని ఒరిజినల్‌గా telugupost వెబ్‌సైట్ ప్రచురించింది. ‘శక్తి కలెక్టివ్’‌లో భాగంగా దీన్ని ‘హ్యాష్ ట్యాగ్‌యూ తెలుగు’ రీపబ్లిష్ చేసింది)