Site icon HashtagU Telugu

Fact Check : ‘‘కాంగ్రెస్ సర్కారు ఆరు గ్యారెంటీలు బోగస్’’ అని కడియం శ్రీహ‌రి కామెంట్ చేశారా ?

Fact Check Congress Leader Kadiyam Srihari Telangana Congress Government Six Guarantee Schemes

Fact Checked By newsmeter

ప్రచారం : ‘‘తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీ స్కీంలు బోగస్ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కామెంట్’’

నిజం : పైవిధంగా ఉన్న కామెంట్‌తో న్యూస్ క్లిప్స్ వైరల్ అవుతున్నాయి.  వాస్తవానికి ఆ వ్యాఖ్యలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి 2024 ఫిబ్రవరిలో చేశారు. ఆ సమయానికి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. బీఆర్ఎస్‌ పార్టీలోనే ఉన్నారు.

Also Read :Adani Wilmar : ‘ఫార్చూన్’ వంటనూనెల బిజినెస్.. అదానీ సంచలన నిర్ణయం

తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ..  ‘‘కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు సరిపడా  బడ్జెట్ లేదు’’  అని విమర్శిస్తున్నట్టుగా ఉన్న వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ.. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కడియం వ్యాఖ్యలు చేశారు అనేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ఫ్యాక్ట్ చెక్‌లో నిర్ధారణ అయింది.

వైరల్ అయిన వీడియో క్లిప్‌లో కడియం  శ్రీహరి మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఉచిత హామీల అమలుకు ఏడాదికి రూ.1.36 లక్షల కోట్లు అవసరం. తెలంగాణలోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 3500 చొప్పున ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి, మహాలక్ష్మి పథకం అమలుకు, ఆసరా పెన్షన్లను పెంచడానికి రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన నిధులు సరిపోవు’’ అని ఉంది.  ‘‘6 ఆరు గ్యారంటీ స్కీంలను కాంగ్రెస్ పార్టీ చాలా ఆర్భాటంగా, చాలా అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఆరు గ్యారంటీలే మిమ్మల్ని(కాంగ్రెస్‌ను) ఎన్నికల్లో గెలిపించాయి. ప్రజలు నమ్మి మీకు ఓట్లు వేశారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత  తెలంగాణ ప్రజలకు మొండి చెయ్యి చూపించే ప్రయత్నం చేస్తున్నారు’’ అని ఆ వీడియోలో కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు.

ఈమేరకు కడియం  శ్రీహరి కామెంట్లతో కూడిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ .. “కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వపు ఆరు గ్యారెంటీ స్కీంలను బోగస్ అంటున్న కడియం” అని క్యాప్షన్ పెట్టారు. (ఆర్కైవ్)

ఇదే విధమైన తప్పుడు ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా పోస్ట్‌‌లను ఇక్కడ చూడొచ్చు. (ఆర్కైవ్)

Also Read :KTR Vs ED : ఈడీ నోటీసులిచ్చిన మాట వాస్తవమే.. లీగల్‌గా ఎదుర్కొంటా : కేటీఆర్

Fact Check

  • కడియం శ్రీహరి కామెంట్స్‌తో వైరల్ అయిన వీడియో క్లిప్స్‌ను న్యూస్‌మీటర్ ఫ్యాక్ట్ చెక్ చేసింది. దీంతో ఆ క్లెయిమ్స్ తప్పు అని నిర్ధారణ అయింది.  ఈ వీడియోలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖలు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్టీలో ఉన్నప్పుడు చేసిన‌వి. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఆయన అలాంటి కామెంట్స్ చేయలేదు.
  • మేం ఇంటర్నెట్‌లో కీ వర్డ్ సెర్చ్‌ను ఉపయోగించి శోధించాం. దీంతో  Times of India 2024 ఫిబ్రవరి 15న కడియం శ్రీహరి కామెంట్లతో  ప్రచురించిన ఒక వార్త దొరికింది. “కేటాయించిన నిధులు.. 6 ఉచిత గ్యారెంటీల‌కు సరిపోవు: కడియం శ్రీహరి” అనే టైటిల్‌తో ఆ వార్త ఉండటాన్ని మేం గుర్తించాం.  “అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి 1.36 లక్షల కోట్లు అవసరమవుతాయి. అయితే బడ్జెట్‌లో ప్రభుత్వం కేవలం రూ.53 వేల కోట్లనే కేటాయించింది’’ అని ఆనాడు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హోదాలో కడియం శ్రీహరి కామెంట్స్ చేసినట్టుగా వార్తలో ప్రస్తావించారు.
  • “టీఎస్ అసెంబ్లీ : రైతు రుణమాఫీ ఎప్పటిలోపు పూర్తి చేస్తారు?: కడియం శ్రీహరి” అనే టైటిల్‌తో 2024 ఫిబ్రవరి 14న ఈనాడు  దినపత్రికలో ఒక వార్త పబ్లిష్ అయింది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై శాసనసభలో జరిగిన చర్చలో కడియం శ్రీహరి మాట్లాడినట్లుగా ఆ వార్తలో వివరాలు ఉన్నాయి. ఆ సమయానికి కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు.
  • ఇంటర్నెట్ కీ వర్డ్ సెర్చ్ చేయగా 2024 ఫిబ్రవరి 14న  T News Telugu వెరిఫైడ్ యూట్యూబ్ ఛానల్లో పబ్లిష్ అయిన ఒక వీడియో క్లిప్ దొరికింది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో  కడియం శ్రీహరి ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా ఆ వీడియో క్లిప్‌లో ఉంది.ఈ సమావేశంలో దాదాపు గంటసేపు ఎమ్మెల్యే కడియం ప్రసంగించారు. ఇదే వీడియోలో సరిగ్గా 37:23 నిమిషాల దగ్గర కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలను కట్ చేసి.. ప్రత్యేకమైన వీడియో క్లిప్‌గా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాతే కడియం ఈ కామెంట్స్ చేశారనే వదంతిని వ్యాపింపజేశారు. వాస్తవానికి ఆ కామెంట్స్ కడియం శ్రీహరి బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు చేసినవే.
  • 2024 మార్చిలో లోక్ సభ ఎన్నికలకు ముందు కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాబట్టి వైరల్ అవుతున్న క్లెయిమ్స్ తప్పు అని న్యూస్‌మీటర్(Fact Check) నిర్ధారించింది.

(ఈ న్యూస్ స్టోరీని ఒరిజినల్‌గా న్యూస్ మీటర్ వెబ్‌సైట్ ప్రచురించింది. ‘శక్తి కలెక్టివ్’‌లో భాగంగా దీన్ని ‘హ్యాష్ ట్యాగ్‌యూ తెలుగు’ రీపబ్లిష్ చేసింది)