పురాతన కాలం నుండి సాంప్రదాయ పరంగా వస్తున్న ఆధ్యాత్మిక ధోరణులలో శాస్త్రీయత దాగి ఉంది. పూర్వీకులు ఆధ్యాత్మికను ఆచరించి వాటిలో నిగూఢమై ఉన్న శాస్త్రీయతతో ఆయురారోగ్యాలను కాపాడుకున్నారు. అంతేకాక ఉత్తమ జీవనశైలికి బాటలు వేశారు. అనాది నుండి వస్తున్న పలు ఆచారాల్లో ఉపవాసాలు, వన భోజనాలతోపాటు అయ్యప్ప, శివ మాలాధారణలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి.
మాలాధారణతో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మానసిక ప్రశాంతతో పాటు ఆరోగ్య పరిరక్షణ కలుగుతుండటంతో పెద్దలతో పాటు యువకులు పెద్ద ఎత్తున మాలాధారణలకు ఆసక్తి చూపుతున్నారు. వారి వారి మనోభావాలను అనుకూలంగా అయ్యప్ప, శివ మాలలు 40 రోజుల నుండి 60 రోజులు కొన్ని సందర్భాల్లో 90 రోజుల వరకు కూడా ధారణ చేసి ఆయా నిబంధనలను ఆచరిస్తూ భిన్నమైన జీవనశైలి గడుపుతూ సన్మార్గంలో నడుస్తున్నారు.
అయ్యప్ప. శివ మాలాధారణలు చేసినవారు కఠినమైన నిబంధనలను పాటించాలి. ఈ నిబంధనలతో గతంలో ఉన్న జీవన శైలికి భిన్నంగా సన్మార్గ నిబంధనలను పాటిస్తూ ఆధ్యాత్మిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. మాలాధారణ చేసినవారు వేకువజామున నిద్ర లేవడం, చల్లటి నీటితో స్నానాలు ఆచరించడం ఏకాగ్రతతో కూడిన ప్రార్థన, మితాహారం, కాళ్లకు చెప్పులు లేకుండా నడవడం, బ్రహ్మచర్యం పాటించడం ఇవన్నీ ఆధ్యాత్మిక నిబంధనలు అయినప్పటికీ వీటి వెనక శాస్త్రీయత దాగి ఉండడంతో ఇవి పాటిస్తున్న వారి జీవనశైలిలో మార్పు వచ్చి, సౌమ్యంగా ఉండటమే కాకుండా నలుగురికి ఆదర్శంగా నిలుస్తుంటారు.
ఆధ్యాత్మికతోపాటు శాస్త్రీయత దాగి ఉన్న ఈ దీక్షలపై ఇటీవల కాలంలో యువత అధికంగా ఆసక్తి చూపుతున్నారు. పాశ్చాత్య సంస్కృతికి అలవాటు అయిన యువత అనేక దూర అలవాట్లకు బానిసై కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో వాటి నుండి దూరంగా ఉండటం కోసం భిన్నమైన జీవనశైలి గడపడం కోసం ఆరోగ్యంతోపాటు, కుటుంబాలకు ఆసరాగా నిలబడటం కోసం యువత మాలా ధారణ చేసి సన్మార్గం వైపు వస్తున్నారు. మాలాధారణ చేసినవారు అతి పవిత్రంగా ఉండి భోజనం వండిన వారైతేనే ఆరగిస్తారు. కొద్దిరోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా అయ్యప్ప, శివ మాలాధారణలు ప్రారంభంకానున్నాయి.