YadagiriGutta: బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న యాదగిరిగుట్ట, రేపే పూజలు షురూ

  • Written By:
  • Publish Date - March 10, 2024 / 10:25 AM IST

Yadagiri Gutta: తెలంగాణ తిరుపతిగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 11 నుంచి మార్చి 21 వరకు జరగనున్నాయి. ఈ నెల 11న స్వస్తీవాచనం, అంకురారోపణం, విశ్వక్సేరాధన, రక్షాబంధనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 21న అష్టోత్తర శతఘటాభిషేకం, డోలోత్సవంతో ఉత్సవాలు సంపూర్ణం కానున్నాయి. 17న ఎదుర్కోలు, 18న స్వామివారి తిరు కల్యాణోత్సవం, 19న దివ్య విమాన రథోత్సవం, 20న మహాపూర్ణాహుతి, చక్రతీర్థం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 13నుంచి 19 వరకు స్వామివారి అలంకార సేవలు సాగనున్నాయి.

యాదగిరిగుట్టలో 10 రోజులు సాగే బ్రహ్మోత్సవాల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణమంతా విద్యుద్దీప కాంతులతో మిరిమిట్లు గొలిపే విధంగా అద్భుతంగా రూపొందించనున్నారు. ఇప్పటికే ముఖ మండపంలో దీపాలంకరణ పూర్తి చేశారు. ఆలయ ప్రధాన రహదారుల్లో విద్యుద్దీపాలతో కూడిన స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు.

18న ప్రధానాలయ ఉత్తర ప్రాంతంలోని వాయుదిశలో నిర్మించిన లిప్టు, రథశాల ప్రాంతంలో కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఇందుకోసం 80 ఫీట్ల పొడవు, 45 ఫీట్ల వెడల్పు విస్తీర్ణంలో ప్రత్యేక కల్యాణ మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ నెల 11 నుంచి 21వరకు నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, మొక్కు సేవలను రద్దు చేయనున్నారు. సీఎం రేవంత్ ఈ బ్రహోత్సవాలకు హాజరుకానున్నారు.