Wednesday: మనం ఎలాంటి శుభాకార్యం మొదలు పెట్టినా మొదటి పూజించేది విఘ్నేశ్వరుడిని. ఆయనకు పూజ చేసిన తర్వాతనే శుభకార్యాలు మొదలు పెడుతూ ఉంటారు. మనం చేసే పనిలో ఎలాంటి ఆటంకాలు రాకుండా నిర్విజ్ఞంగా జరగాలని కోరుకుంటూ విఘ్నేశ్వరుని పూజిస్తూ ఉంటారు. ఇకపోతే వారంలో బుధవారం రోజు విగ్నేశ్వరుడికి అంకితం చేయబడింది. ఈరోజు గణేష్ ని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల ఆయన అనుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం. అలాగే మనం చేసే పనిలో కూడా విజయం లభిస్తుందని నమ్మకం. ఇకపోతే బుధవారం బుధ గ్రహానికి చెందినది.
అలాగే గణేశుడి రోజుగా కూడా పరిగణిస్తారు. బలహీన జ్ఞాపకశక్తి లేదా అస్థిర మనస్సు ఉన్న వ్యక్తులు ఈ రోజున ఉపవాసం చేయడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు అని చెబుతున్నారు. కాగా గణేశునికి తీపి అంటే చాలా ఇష్టం. మోదక్ , బెల్లం అంటే మరీ ఇష్టం. కాబట్టి ఈ రోజున గణేశుడి గుడికి వెళ్లి బెల్లం ,మోదక్ సమర్పించడం చాలా మంచిదని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల గణేశుడితో పాటూ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందట. హిందూ ధర్మ పూజలో గణపతి పూజలో దూర్వ సమర్పించడం చాలా శ్రేయస్కరం. బుధవారం నాడు గణేశునికి 21 దూర్వ సమర్పించడం శుభప్రదం అని చెబుతున్నారు.
బుధవారం నాడు గణేశుడితో పాటు దుర్గామాతను పూజించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. బుధ దోషం నుంచి విముక్తి పొందడానికి “ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై ” అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలట. అలాగే ” ఓం గం గణపతయే నమః” లేదా ” శ్రీ గణేశాయ నమః ” అని క్రమం తప్పకుండా జపించడం వల్ల జీవితంలో ఉన్న అడ్డంకులన్ని తొలగిపోతాయని చెబుతున్నారు. అలాగే బుధవారం రోజు పెసరపప్పు, రాగి పాత్రలను హిజ్రాలకు దానం చేయడం చాలా శుభ ఫలితాలను అందిస్తుందట.
బుధవారం నలుపు రంగు దుస్తులు ధరించడం అశుభంగా పరిగణించబడుతుందట. ఎందుకంటే ఇది ప్రతికూలతను పెంచుతుందని, దీనికి విరుద్ధంగా, ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం చాలా శుభప్రదం అని చెబుతున్నారు. ఆకుపచ్చ రంగు బుధ గ్రహానికి చిహ్నం. దీనిని ధరించడం వల్ల మనస్సులో సమతుల్యత సానుకూల శక్తి ప్రసరిస్తుందని పండితులు చెబుతున్నారు.