Christmas 2025 : చీకటిమయమైన లోకంలో వెలుగును నింపడానికి యేసుక్రీస్తు జన్మించాడని (Jesus Christ Birth Date) నమ్ముతారు. అందుకే ఇళ్లను క్రిస్మస్ స్టార్స్, విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. ఈ వెలుగు మన జీవితంలో అజ్ఞానాన్ని, బాధలను తొలగిస్తుందని అర్థం. అలాగే కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి ఉండాలని ఒకరినొకరు క్షమించుకోవాలని కరుణ కలిగి ఉండాలని, అంతేకాకుండా మన దగ్గర ఉన్న దానిని కష్టాల్లో ఉన్న ఇతరులతో పండుకోవడం క్రిస్మస్ మనకు బోధిస్తుంది.
లోకరక్షకుడైన యేసుక్రీస్తు జన్మించిన పవిత్ర దినం క్రిస్మస్. యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు జరుపుకునే మతపరమైన, సాంస్కృతిక పండుగ క్రిస్మస్ పండుగ. ఈ పండుగ శాంతికి, ప్రేమకు చిహ్నంగా నిలుస్తుంది. లోక రక్షణ కోసం, పాపాలను కడిగివేసి మానవాళిని సరైన మార్గంలో నడిపించడానికి దేవుడే స్వయంగా యేసుక్రీస్తుగా ఈ భూమిపై జన్మించాడని భక్తుల నమ్మకం. ఈ క్రిస్మస్ పండుగ దైవానికి, మనిషికి ఉన్న సంబంధాన్ని బలపరిచే పండుగ. అయితే యేసుక్రీస్తు జీవితంలో అత్యంత కీలకమైన క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్‌ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
క్రిస్మస్
ఈ క్రిస్మస్ పండగ కేవలం క్రైస్తవులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శాంతి, కరుణ, ప్రేమకు చిహ్నంగా నిలుస్తుంది. లోకానికి రక్షకుడైనప్పటికీ యేసు ఒక రాజభవనంలో కాకుండా సామాన్యమైన పశువుల కొట్టంలో జన్మించారని చెబుతారు. ఇది మనిషికి ఉండాల్సిన నిరాడంబరతను, వినయాన్ని చాటి చెబుతుంది. గొప్పతనం ధనంలో లేదు మనలో ఉంటుందని క్రీస్తు జననం మనకు నేర్పుతుంది. యేసు పుట్టినప్పుడు దేవదూతలు భూమి మీద ఆయనకు ఇష్టులైన మనుషులకు సమాధానం కలుగును గాక అని ప్రకటించారు. అందుకే ఈ పండుగను శాంతి పండుగగా పిలుస్తారు. పగలు, ప్రతీకారాలు, ద్వేషాలను విడిచిపెట్టి స్నేహంగా ఉండాలనేది ఈ పండుగ అంతరార్థం.
గుడ్ ఫ్రైడే
క్రిస్మస్ పండుగ యేసుక్రీస్తు జన్మదినాన్ని వేడుకగా జరుపుకుంటే గుడ్‌ఫ్రైడే అనేది ఆయన మానవాళి కోసం చేసిన మహోన్నత త్యాగాన్ని గుర్తుచేసుకునే రోజు. యేసుక్రీస్తు మానవజాతి చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా తనను తాను బలిగా సమర్పించుకుని సిలువపై మరణించిన రోజుగా చెబుతారు. తనను హించించిన వారిని కూడా తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అని వేడుకున్న గొప్ప మనసు ఆయనది. ఆయన మరణం ద్వారా పాప విముక్తి, రక్షణ, దేవునితో సమాధానం లభించాయని నమ్మడం వల్ల దీనిని శుభప్రదమైన రోజుగా భావిస్తారు. అయితే క్రైస్తవులు ఈరోజున విందులు, వినోదాలకు దూరంగా ఉంటారు. చాలామంది ఉపవాస దీక్షలు పాఠిస్తారు. యేసు పడిన కష్టాలను తలుచుకుంటూ మౌనంగా ప్రార్థనల్లో గడుపుతారు.
