మామూలుగా ఏడాదిలో 24 ఏకాదశిలు వస్తూ ఉంటాయి. అయితే ఏకాదశికి ప్రత్యేకత ఉపవాసం వల్లనే వస్తుందట. ఏకాదశి రోజు భోజనం చేయడం నిషిద్ధం. ప్రతి ఒక్కరూ ఏకాదశికి ఉపవాసం ఉండాలని చెబుతుంటారు. ఇంతకీ ఏకాదశికి ఉపవాసం ఎందుకు ఉండాలి? అలా ఉపవాసం ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆరోగ్యరీత్యా నెలకు రెండు సార్లు ఉపవాసం ఉండడం ఆరోగ్యానికి మేలు చేస్తుందట. అలాగే ఒక సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. ఒక నెలలో రెండు ఏకాదశులు ఉంటాయి. ఎవరైనా సంవత్సరంలో 11 ఏకాదశుల నాడు ఉపవాసం ఉంటే స్వర్గప్రాప్తి కలుగుతుందని చెబుతారు.
అయితే దీనికి ముందు మీరు ఏకాదశి ఉపవాస నియమాలను బాగా తెలుసుకోవాలట. కాగా ఏకాదశి ఉపవాసం ఆచరించిన వ్యక్తి మరణానంతరం మోక్షం పొందుతాడట. చేసిన పాపాలన్నీ నశించిపోతాయని చెబుతున్నారు. విష్ణుమూర్తి అనుగ్రహం పొంది వైకుంఠ ప్రాప్తి పొందాలంటే ఏకాదశి ఉపవాసం నిష్టగా ఆచరించాలట. అయితే ఏకాదశి ఉపవాసం ఆచరించడం అంటే ఆ ఒక్కరోజు ఉండటం కాదట. ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల ఉపవాసం పూర్తవుతుందని మీరు అనుకుంటే అది తప్పని, ఏకాదశి వ్రతంలో దశమి, ద్వాదశి తిథి కూడా పరిగణించబడుతుందని చెబుతున్నారు. ఈ రోజున కూడా ఉపవాస నియమాలు పాటిస్తారు. అప్పుడే ఏకాదశి వ్రతం పాటించాలి. మీరు మీ పాప కర్మలను ముగించాలనుకుంటే ఖచ్చితంగా ఏకాదశి ఉపవాసం పాటించాలట.
వివాహిత స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఆమె అదృష్టం చెక్కు చెదరకుండా ఉంటుందట. వైవాహిక జీవితం కూడా బాగుంటుందట. అయితే ఈ ఉపవాస సమయంలో అబద్ధాలు చెప్పకుండా లేదా కోపం తెచ్చుకోకుండా ఉండడానికి ప్రయత్నించాలని చెబుతున్నారు. అంతే కాకుండా ఈ వ్రతంలో అన్నం తినకూడదట. మరుసటి రోజు అంటే ద్వాదశి నాడు ఉపవాసం విరమించిన అనంతరం అన్నం తినవచ్చని చెబుతున్నారు. ఏకాదశి ఉపవాసం ఆచరించాలని అనుకున్న వాళ్ళు దశమి తిథి నిష్టగా ఉండాలట. ముందు రోజు దశమి తిథి సాయంత్రం మీ ఉపవాసాన్ని భంగపరిచే విధమైన పదార్థాలు ఏదీ తినకూడదట. ముఖ్యంగా వెల్లుల్లి, ఉల్లిపాయ అసలు తినకూడదట. ఎందుకంటె ఇవి తామసిక ఆహార జాబితాలోకి వస్తాయట.
వీటిని తీసుకోవడం వల్ల ఉపవాస నియమాలకు భంగం వాటిల్లుతుందని చెబుతున్నారు. దశమి, ఏకాదశి, ద్వాదశి నాడు మూడు రోజులు సంయమనం పాటిస్తూ ఉపవాసం ఆచరించాలట. మూడు రోజుల పాటు కంచు పాత్రలో ఏమీ తినకూడదట. అంతే కాకుండా దశమి రోజున శనగపప్పు, పప్పు, ఆకుకూరలు వంటి వాటిని తినకూడదని చెబుతున్నారు. ఉపవాసం ఉండడం అంటే ఏమి తినకుండా ఉండడం కాదట. మనసును దేవుడి మీద లగ్నం చేయాలట. టీవీలు ఫోన్లు వంటివి చూస్తూ వినోదంగా ఉండకుండా దేవుడిపైనే మనసును లగ్నం చేయాలని చెబుతున్నారు. ఈ రోజున ఏ చెట్టు నుండి ఆకు తీయకూడదు. ముఖ్యంగా ఏకాదశి ఉపవాసం రోజు తులసి ఆకులు అస్సలు తెంపకూడదట. నిత్యం భగవంతుడిని ధ్యానించాలని,రాత్రి జాగరణ చేయాలని చెబుతున్నారు.