Polala Amavasya : పొలాల అమావాస్య.. ఈసారి సెప్టెంబరు 14న గురువారం రోజు వస్తోంది. ఈ వ్రతానికి ఎంతో విశిష్ఠత ఉంది. ఏటా ఈ వ్రతాన్ని శ్రావణ అమావాస్యనాడు చేసుకుంటారు. ఈ శ్రావణ మాసంలో నెల మొత్తం సౌభాగ్యం కోసం వ్రతం ఆచరిస్తే.. అమావాస్య రోజు సౌభాగ్యంతో పాటూ సంతానం కోసం చేసే పూజే పొలాల అమావాస్య. పొలాల అమావాస్య వ్రతం.. పెళ్లై సంతానం లేనివారికి ఎంత ముఖ్యమో, సంతానం ఉంటే వారి యోగక్షేమాల కోసం కూడా అంతే ముఖ్యం. ఈ వ్రతాన్ని చేసేటప్పుడు రాత్రి సమాయానికి అమావాస్య వచ్చి ఉండాలి.
Also read : Virat Kohli: రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ.. వన్డేల్లో అత్యంత వేగంగా 13 వేల పరుగులు..!
వ్రత పూజ చేసే చోట గోమయంతో అలికి, వరిపిండితో అందమైన ముగ్గువేసి, ఒక కంద మొక్కను అక్కడ ఉంచి, పసుపు కొమ్ము కట్టిన నాలుగు తోరాలను అక్కడ ఉంచి, ముందుగా వినాయకుడిని పూజించాలి. ఆ తర్వాత కందమొక్కలోకి మంగళ గౌరీదేవిని గానీ సంతానలక్ష్మీ దేవిని గానీ దుర్దాదేవిని గానీ ఆవాహన చేసి షోడశోపచారాలతో అర్చించి, తొమ్మిది పూర్ణంబూర్లు ఆమెకు నైవేద్యంగా సమర్పించాలి. నైవేద్యంగా బూరెలు, గారెలతో పాటు పిండివంటలను చేసుకోవచ్చు. ఆ రోజు కలగాయ కూర, పులుసు చేస్తారు. అంటే ఇంట్లో ఉండే కూరగాయలతో కాకుండా.. నాలుగైదు ఇళ్లనుంచి అడిగి తీసుకొచ్చి ఆ కూరగాయలు అన్నింటినీ కలిపి కూర, పులుసు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. పూజ పూర్తైన తర్వాత కొన్ని ప్రాంతాల్లో వాయనం ఇస్తారు. ఇంకొన్ని ప్రాంతాల్లో ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇస్తారు. సాయంత్రం అయిన తర్వాత మరోసారి అమ్మవారి వద్ద దీపం వెలిగించి పూజ చేసి.. కందమొక్కకు కట్టిన పుసుపు కొమ్ములను ఇంట్లో ముత్తైదువులు ఉంటే మెడలో ఉన్న మంగళసూత్రానికి, పిల్లలకు అయితే చేతికి కానీ, మొలకు కానీ కడితే మంచి జరుగుతుందని (Polala Amavasya) విశ్వసిస్తారు.
గమనిక: ‘ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.