Nagpanchami And Milk: నాగ పంచమి రోజున పాములకు పాలు ఎందుకు పోస్తారు ? దీని వెనుక ఉన్న కారణాలివి!!

పాములను పరమేశ్వరుని అంశంగా భావించి ప్రత్యేక పూజలు చేస్తుంటారు.

  • Written By:
  • Publish Date - August 4, 2022 / 11:45 AM IST

పాములను పరమేశ్వరుని అంశంగా భావించి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. స్కంద పురాణంలో నాగ పంచమి ప్రాధాన్యత గురించి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు వివరించారు.పురాణాల ప్రకారం నాగదేవతలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈనేపథ్యంలో నాగపంచమి, నాగుల చవితి వంటి ప్రత్యేకమైన రోజుల్లో లేదా ఏదైనా శుభకార్యాలు నిర్వహించేటప్పుడు పుట్టకు వెళ్లి ప్రత్యేకమైన పూజలను చేస్తుంటారు. అయితే కేవలం పండుగ సమయంలోనే పుట్ట దగ్గరికి వెళ్లి పాములకు పాలను ఎందుకు పోస్తారు? ప్రత్యేకమైన నైవేద్యాలను సమర్పించడాన్ని ఎందుకని ఆచారంగా భావిస్తున్నారు? అనేది తెలుసుకోవాలని ఆసక్తి ఈతరం వారికి ఉంటుంది. ఈసారి ఆగస్టు 2న నాగ పంచమి జరిగింది. దీనిపై కథనం ఇది..

మహావిష్ణువు వరం..

పురాణాల ప్రకారం.. నాగదేవుని సేవకు పులకరించిపోయిన శ్రీ మహావిష్ణువు ఏదైనా వరం కోరుకోమంటే.. అప్పుడే నాగ దేవుడు తాము పుట్టినరోజు శ్రావణ శుద్ధ పంచమి రోజున భూమి మీద మనుషులంతా నాగదేవతలకు పూజలు చేయాలని కోరుకున్నాడు. విష్ణుమూర్తి కూడా తన కోరికను అంగీకరించడం వల్ల అప్పటి నుండి ఇప్పటివరకు ప్రతి ఏటా శ్రావణ మాసంలో శుక్ల పంచమి రోజున నాగ పంచమి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.

భయాన్ని పోగొట్టడం కోసం..

మానవుల చేతిలో ఎన్నో పాములు చనిపోతూ ఉండేవి. అయితే మన పెద్దలు వీరిద్దరి మధ్య ఉన్న భయాన్ని పోగొట్టడం కోసం నాగ పంచమి రోజు లేదా నాగుల చవితి ఇంకా ప్రత్యేకమైన పండుగ రోజుల్లో పుట్టలో పాలు పోయాలనే ఆచారాన్ని తీసుకొచ్చారు.

కాళీయ నాగుపై శ్రీకృష్ణుడి విజయం..

నాగ పంచమి కథ కృష్ణుడితో ముడిపడి ఉంది. శ్రీకృష్ణుడు తన స్నేహితులతో కలిసి బంతి ఆట ఆడుకుంటుండగా .. బంతి నదిలో పడింది. ఐతే ఆ నదిలో కాళీయ నాగ్ ఉంటాడు. ఆ విషయం తెలియక శ్రీకృష్ణుడు బంతి కోసం నదిలోకి దూకుతాడు. నదిలోకి వచ్చిన కృష్ణుడిపై కాళీయ నాగు దాడి చేస్తుంది. కానీ శ్రీకృష్ణుడు దానిని ఎదుర్కొని.. గట్టి గుణపాఠం చెబుతాడు. ఆ తర్వాత కాళీయ నాగు శ్రీకృష్ణుడికి క్షమాపణలు చెప్పింది. ఇకపై ఎవరికీ హాని చేయబోనని హామీ ఇస్తుంది. కాళీయ నాగుపై కృష్ణుడు సాధించిన విజయాన్ని నాగ పంచమిగా జరుపుకుంటారు.

శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

శాస్త్రాల ప్రకారం.. నాగ పంచమి నాడు ఉపవాసం చేయాలి. అలాగే నాగ మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల రాహు, కేతు దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. ఇంటి వెలుపల పాము చిత్రపటాన్ని ఉంచితే ఆ కుటుంబంపై నాగ దేవత ఆశీర్వాదం ఉంటుంది. నాగ పంచమి రోజున సూది దారం ఉపయోగించకూడదు. ఇనుప పాత్రలలో ఆహారాన్ని వండకూడదు. అలా చేస్తే అశుభాలు కలుగుతాయట. పాములను చంపకూడదు. ఎక్కడైనా పాము కనిపిస్తే వదిలివేయాలి తప్ప.. ఎలాంటి ఇబ్బది కలిగించకూడదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జాతకంలో రాహువు, కేతువులు అశుభంగా ఉంటే.. పాములను పూజించాలి. ఈ రోజున నాగదేవతకు పాలు నైవేద్యంగా పెట్టేటప్పుడు ఇత్తడి పాత్రలను ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల రాహు, కేతువుల దోషాలు తొలగిపోతాయి.