Site icon HashtagU Telugu

Ugadi 2023: ఉగాదిని చైత్ర మాసంలోనే ఎందుకు జరుపుకోవాలి?

Why Should Ugadi Be Celebrated In The Month Of Chaitra Itself

Why Should Ugadi Be Celebrated In The Month Of Chaitra Itself

”ఉగ” అంటే నక్షత్ర నడక అని, ”ఆది” అంటే మొదలు అని అర్ధం. సృష్టి ఆరంభం లేదా కాలం మొదలవడాన్ని ”ఉగాది” (Ugadi) అన్నారు. మరోరకంగా చూస్తే ”యుగం” అంటే రెండు అనే అర్ధం ఉంది. అంటే ఒకటి కాలం, రెండోది గ్రహాలు. కాలం రాశులలో ప్రవేశించడాన్ని బట్టి ”యుగము” అన్నారు. ”యుగం” ప్రారంభమైన రోజు కనుక ”యుగాది” అన్నారు. అదే క్రమంగా ”ఉగాది” అయింది. చైత్ర శుద్ధ పాడ్యమి చాంద్రమాన ఉగాది లేదా యుగాది పండుగ. అసలు చైత్ర మాసానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో చూద్దాం. పౌర్ణమినాడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. ఈ పౌర్ణమి నాడు చంద్రుడు “చిత్రా” నక్షత్రంలో (దీన్నే చిత్తా నక్షత్రం అంటాం) ఉండటంవల్ల ఈ నెలకు “చైత్రమాసం” అనే పేరు వచ్చింది.

ఉగాదిని (Ugadi) చైత్ర మాసంలోనే ఎందుకు జరుపుకోవాలి?

ఇతర నెలల్లో కూడా చంద్రుడు ఇతర నక్షత్రాలతో కూడి ఉంటాడు కదా.. మరి ఇతర నెలల్లో ఎందుకు జరుపుకోవడంలేదు ? విఘ్నాలను తొలగించే వినాయకుని పండుగ వచ్చేది భాద్రపదమాసంలో మరి భాద్రపదమాసం కంటే ఉత్క్రుష్టమైన నెల ఎదుంటుంది ? ఆ నెలలో ఎందుకు ఉగాది జరుపుకోవడంలేదు ? ముఖ్యంగా అన్ని నెలల్లోకెళ్ళా శ్రేష్ఠమైంది మార్గశిర మాసం. ”మాసానాం మార్గశీర్షోహం” అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఉపదేశించాడు. అవును , లోకకళ్యాణార్ధం కృష్ణుడు గీతోపదేశం చేసింది మార్గశిరంలోనే. మరి అంత ఉత్తమమైన మార్గశిర శుద్ధ పాడ్యమి ఉగాది ఎందుకు కాలేదు ? ఇక ఆశ్వయుజ మాసం కూడా ఘనమైందే. ఆశ్వయుజంలో అత్యంత ఉత్సాహంతో, భక్తిశ్రద్ధలతో, లక్ష్మీ, సరస్వతి, కనకదుర్గాదేవిల పూజలు నిర్వహిస్తాం.

మనకు చాలా అవసరమైన చదువు, తెలివి డబ్బు, ధైర్యం అన్నిటినీ ప్రసాదించే దేవతల పూజలు నిర్వహించేది ఈ నెలలోనే. విజయదశమి పర్వదినం నాడు జైత్రయాత్రకు సన్నాహాలు జరుగుతాయి. పోనీ శ్రీరామనవమి, శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చే నెలలు ఎలా చూసినా పవిత్రమైనవే కదా ! ఆ నెలల్లో ఎందుకు సంవత్సరాదిని చేసుకోము ? చాతుర్మాసం మొదలయ్యే ఆషాఢంలోనో, ఉత్థాన ద్వాదశి వచ్చే కార్తీకమాసంలోనో ఉగాది ఎందుకు జరుపుకోము ? ఇలా చూస్తే పన్నెండు నెలల్లో ఏడాది పొడుగునా అనేక ప్రత్యేకతలు, పర్వదినాలు ఉన్నాయి. కానీ వాటన్నిటినీ వదిలి చైత్ర శుద్ధ పాడ్యమినే ఉగాదిగా , సంవత్సరాదిగా జరుపుకుంటున్నాం..

చైత్ర శుద్ధ పాడ్యమినే కొత్త సంవత్సరంగా అంగీకరించడానికి , వేడుక చేసుకోడానికి కారణం ఋతువులు. నెలల కంటే ఋతువులు ప్రధానమైనవి. చైత్రమాసానికి శిశిర ఋతువు పోయి వసంత ఋతువు… అంటే చలికాలం పోయి వేసవికాలం వస్తుంది. ఆకులు రాలే కాలం అయిపోయి చెట్లు చిగుర్చి పూత పూస్తాయి. మల్లెలు గుబాళిస్తాయి. పక్షుల ఈకలు ఊడి కొత్తవి వస్తాయి. మనకు కూడా అప్పటిదాకా చర్మం పొడివారడం , పగుళ్ళు , పొట్టు ఊడటం లాంటి సమస్యలు పోయి కొత్త చర్మం వస్తుంది.

ఈ నెలతో చెట్లు చిగురించడం మొదలై పూత , పిందెలు , పండ్లు – ఇలా అంతా లబ్దికరంగా సాగుతుంది. శరీరంలో పైకి కనిపించే మార్పులే కాదు.. మానసికంగా కూడా చైత్రమాసం నుండి ఉల్లాసంగా , ఉత్సాహంగా ఉంటుంది. చలికాలంలో , వర్షాకాలంలో ఉండే మందగోడితనం వసంతఋతువు నుండి ఉండదు. ఒకవిధమైన చురుకుదనం ప్రవేశిస్తుంది. ఈ కారణంగానే చైత్రమాసంలో ఉగాదిని జరుపుకుంటాం.

ఉగాది రోజున ఏం చేయాలి?

నూతన సంవత్సర కీర్తనాత్ ప్రారంభః ప్రతి గృహ ధ్వజారోహణం నింబ పత్రాశనం సంవత్సర పంచాంగ శ్రవణం నవరాత్రారంభః సంవత్సరాదిని అంటే కొత్త సంవత్సరాన్ని కీర్తిస్తూ తలస్నానం చేయడంతో దినచర్య మొదలౌతుంది. ధ్వజారోహణం చేయాలి. కొన్ని వేపాకులు నమలాలి. వేపపూత కలిపి చేసిన ఉగాది పచ్చడి తినాలి. కొత్త దుస్తులు ధరించి నిత్యకర్మ పూర్తి చేసుకుని పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం చేసి పంచాంగ శ్రవణం చేయాలి. ఉగాది నుండి వసంత నవరాత్రులు ప్రారంభమౌతాయి.

ఉగాది పచ్చడి తినడంవల్ల ప్రయోజనం ఏమిటి?

శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్ధం సుఖానిచ సర్వారిష్ట వినాశనం చ నింబ కందళ భక్షణం వేపపూత , బెల్లం తినడం వల్ల శరీరం వజ్రంలా గట్టిపడుతుంది. సర్వసంపదలు వస్తాయి. ఎలాంటి కష్టాలైనా తీరిపోతాయి. శాస్త్రం ప్రకారం చూస్తే చైత్ర మాసంలో భూమి సూర్యునికి చాలా దగ్గరగా ఉంటుంది. కనుకనే గ్రీష్మ తాపం ఎక్కువగా ఉంటుంది. ఈ వేడివల్ల కొన్ని రకాల వ్యాధులు రావడానికి , ప్రబలడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ఉపద్రవాన్ని నివారించడానికి వేపపూత , బెల్లం తోడ్పడతాయి. అనేక పురాణ కథల్లో ఉగాది ప్రస్తావన కనిపిస్తుంది. విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తింది చైత్ర శుద్ధ పాడ్యమి నాడే.

సోమకుడు వేదాలను దొంగిలించగా వాటిని తీసుకొచ్చి బ్రహ్మదేవునికి అప్పగించేందుకు విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తాడు. మహా విష్ణువును స్మరించుకుని ధ్యానించుకునే నిమిత్తమే ఉగాది పండుగ ప్రారంభమైంది. చరిత్రలో అత్యంత పరాక్రమశాలి విక్రమార్కుడు. ఆ తేజోవంతుడైన విక్రమార్క చక్రవర్తి పట్టాభిషిక్తుడయ్యింది చైత్ర శుద్ధ పాద్యమినాడే. కనుకనే ఉగాదినాడు విక్రమార్కుని స్మరించుకుని ఉత్సాహం పొందుతారు.

Also Read:  Employees Ugadi Gift to Jagan: జగన్ కు ఉద్యోగుల ఉగాది ఝలక్

Exit mobile version