Site icon HashtagU Telugu

Plum Fruits : భోగి పళ్లుగా రేగుపళ్లనే ఎందుకు పోయాలి?

Why Should Plums Be Poured As Indulgences In Bhogi Festival

Why Should Plums Be Poured As Indulgences In Bhogi Festival

సంక్రాంతి పండుగ అంటేనే నాలుగు రోజుల అందమైన వేడుక. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ.. నాలుగు రోజుల్లో మొదటి రోజు భోగి. ఈ రోజు భోగి పళ్లు (Plum Fruits) పోస్తారు. ఎందుకంటే..

భోగి మంటలతో మొదలయ్యే సంక్రాంతి సంబరం నాలుగు రోజుల పాటూ ఏడాదికి సరిపడా ఆనందాన్ని అందిస్తుంది. తెల్లవారు జామనే భోగి మంటలు ఆ తర్వాత బొమ్మల కొలువు, సాయంత్రం భోగి పళ్లు. వాస్తవంగా చెప్పాలంటే భోగి రోజు సందడంతా చిన్నారులదే. ఈ రోజున రేగు పళ్లు భోగి పళ్లుగా మారిపోతాయి.  ముత్తైదువులందర్నీ పిలిచి వారితో పిల్లలకు దిష్టి తీయిస్తారు. దోసిలి నిండా రేగు పళ్లు, చిల్లర, చెరుకు ముక్కలు, బంతి పూల రెక్కలు మూడుసార్లు తలమీదుగా దిష్టి తీసి పోస్తారు. ఇంకొందరు దిష్టితీసినవి పిల్లలపై పోయకుండా గుమ్మం బయటకు విసురుతారు. చుట్టుపక్కల ఆడుకునే చిన్న పిల్లలంతా వచ్చి చిల్లర నాణేలు, రేగు పళ్లు ఏరుకునేందుకు పోటీపడతారు.

రేగు పళ్లు (Plum Fruits) ఎందుకు ప్రత్యేకం

సాక్షాత్తూ ఆ నారాయణులు ఈ బదరీ వృక్షం (రేగుచెట్టు) వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడనీ, ఆ ఫలాన్ని తింటూ తపస్సు సాగించాడని అందుకే రేగు చెట్టుకి అంత ప్రాధాన్యత అంటారు పండితులు. రేగు పళ్లను అర్కఫలం అని కూడా అంటారు.  ‘అర్కుడు’ అంటే సూర్యుడు. సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్లే సమయం కావడంతో  ఆయన కరుణాకటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకు భోగి పళ్లు పోస్తారు. పైగా భారతదేశ వాతావరణానికి అనుగుణంగా ఎలాంటి ప్లేస్ లో అయినా రేగు చెట్టు పెరుగుతుంది. ఎండని, వాననీ అన్నింటినీ తట్టుకుంటుంది. వీటిని బదరీఫలం అని కూడా పిలుస్తారు. శివుణ్ని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలని కురిపించారని చెబుతారు. ఆ సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పళ్లు పోసే సంప్రదాయం వచ్చిందని కూడా చెబుతారు.

భోగి పళ్లుగా రేగు పళ్లు (Plum Fruits) ఎందుకు పోస్తారు

భోగి పళ్లను ఐదేళ్లలోపు పిల్లలకి పోస్తారు. ఈ వయసులో ఉన్న పిల్లల్లో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. పైగా ఊపిరితిత్తులూ, జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటాయి. వీరికి రేగుపళ్లు అమృతంలా పనిచేస్తాయట. ఎందుకంటే వీటిలో విటమిన్ ‘సి’ ఎక్కువగా ఉండి రోగనిరోధక శక్తి పెంచడమే కాదు జీర్ణసంబంధిత వ్యాధులు, శరీర రుగ్మతనలనూ నివారించేందుకు ఉపయోగపడుతుంది. రేగు పళ్లను పిల్లల తల మీద పోడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. తలపై భాగంలో ఉండే బ్రహ్మరంధ్రం ప్రేరేపితమైన జ్ఞానం పెరుగుతుందని చెబుతారు.

బంతిపూల రెక్కలెందుకు

ఇక రేగుపళ్లతోపాటు బంతిపూల రెక్కలని వాడటం వల్ల కూడా పిల్లల చుట్టూ క్రిమికీటకాలు దరిచేరవని చెబుతారు.  ఎందుకంటే బంతిపూలకి ఉన్న ప్రాథమిక లక్షణం క్రిములని చంపడమే. పైగా ఇవి చర్మానికి తగిలితే చర్మసంబంధమైన వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందట.

దిష్టిపోతుందని విశ్వాసం

నర దిష్టికి నల్లరాయి కూడా పగులుతుందంటారు. ముఖ్య పసిపిల్లలకు దిష్టి తగలడం సహజం. అందుకే.. వారికి అప్పటివరకూ ఉన్న దిష్టి మొత్తాన్ని తీసి పారేయడమే భోగి పళ్లు పోయడం వెనుక ముఖ్య ఉద్దేశం అని చెబుతారు. సాయంత్రం పిల్లలతో సంది గొబ్బెళ్లు పెట్టించి భోగిపళ్లు పోస్తారు.

Also Read:  Sakat Chauth : ఈ నెలలోనే “సకత్ చౌత్”.. శుభ ముహూర్తం.. పూజా విధి ఇదీ