Durga Sharan Navaratri : దుర్గా శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు అమ్మవారిని బాలాత్రిపుర సుందరి అలంకారంలో పూజిస్తారు. ఇవాళ చిన్నారులను అమ్మవారికి ప్రతిరూపంగా భావించి కౌమారీ పూజ చేస్తారు. పూజ చేసి వస్త్రాలు సమర్పించి, మహానివేదనగా భోజనం పెట్టి తాంబూలం సమర్పించుకుంటారు. అయితే ఎందుకీ పూజ చేస్తారు ? ఇప్పుడు తెలుసుకుందాం..
శ్రీ చక్రంలో మొదటి దేవత బాల. అందుకే సత్ సంతానాన్ని అందించే తల్లిగా బాల త్రిపుర సుందరీ దేవి భక్తుల పూజలను అందుకుంటోంది. బాల్యంలో ఉన్న నిర్మలత్వానికి ప్రతీక బాల త్రిపుర సుందరీ దేవి. ఈ రోజున బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజ చేసి నూతన వస్త్రాలను సమర్పిస్తారు. భోజనం పెట్టి తాంబూలం ఇస్తారు. షోడస విద్యకు బాల త్రిపుర సుందరీ దేవి అధిష్టాన దేవత. అందుకే దేవీ ఉపాసకులు త్రిపుర సుందరీ దేవి అనుగ్రహం కోసం ఈవిధంగా బాలార్చన చేస్తారు.
We’re now on WhatsApp. Click to Join.
భండాసురుడు.. 30 మంది పిల్లలు
‘‘భండాసురుడు అనే రాక్షసుడికి 30 మంది పిల్లలు ఉండేవారు. వీళ్లంతా దేవతలను నానా బాధలు పెట్టేవారు. దీంతో హంసలు లాగే రథంపై వచ్చిన ఒక కన్య 30 మంది భండాసుర పుత్రులను చంపేసింది. ఒకే ఒక్క అర్థచంద్ర బాణంతో 30 మందిని ఆమె సంహరించింది’’ అని బ్రహ్మాండ పురాణంలోని లలితా సహస్రంలో త్రిపురసుందరి ఆవిర్భావం గురించి ప్రస్తావించారు. అప్పటి నుంచే బాల త్రిపురసుందరి ఆరాధన చేయడం ప్రారంభమైందని అంటారు.
ఏ వయసు బాలికను పూజిస్తే ఏ ఫలితం వస్తుంది ?
రెండేళ్ల బాలికను కుమారి అంటారు. ఈమెను పూజిస్తే దారిద్ర్యదుఃఖాలు నశిస్తాయి. మూడేళ్ల బాలికను త్రిమూర్తి అంటారు. ఈమెను పూజిస్తే ధనధాన్య, పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది. నాలుగేళ్ల బాలికను కల్యాణి అంటారు. ఈమెను పూజిస్తే రాజ్యాభివృద్ధి, విద్యాభివృద్ధి చేకూరుతుంది. ఐదేళ్ల బాలికను రోహిణి అంటారు. ఈమెను పూజిస్తే ఆరోగ్యం చేకూరుతుంది. ఆరేళ్ల బాలికను కాళిక అంటారు. ఈమెను పూజిస్తే శత్రునాశనం జరుగుతుంది. ఏడేళ్ల బాలికను చండిక అంటారు. ఈమెను పూజిస్తే పేదరికం తొలగి ఐశ్వర్యం కలుగుతుంది. ఎనిమిది సంవత్సరాల బాలికను శాంభవి అంటారు. ఈమెను పూజిస్తే ప్రతి పనిలో ఆటంకాలు తొలగి, అనుకూలత ఏర్పడుతుంది తొమ్మిదేళ్ల పాపను దుర్గ అంటారు. ఈమెను పూజిస్తే అన్ని రకాల సుఖ సంతోషాలు (Durga Sharan Navaratri) చేకూరుతాయి.
Also Read: Anil Sunkara : ఖరీదైన తప్పులు చేశాం.. ఏజెంట్, భోళాశంకర్ పై మరోసారి నిర్మాత వ్యాఖ్యలు..
గమనిక: ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.