Site icon HashtagU Telugu

Invitation Cards: పెళ్లి పత్రికకు పసుపు,కుంకుమ ఎందుకు రాస్తారో మీకు తెలుసా?

Invitation Cards

Invitation Cards

హిందూ సంప్రదాయాల ప్రకారం ఎటువంటి శుభకార్యం లేదా పూజా కార్యక్రమాలు మొదలుపెట్టినా మొదట పసుపు, కుంకుమ ఉపయోగిస్తూ ఉంటారు. ప్రతి ఒక శుభకార్యంలో పసుపు, కుంకుమలు కీలకపాత్ర పోషిస్తాయి. అయితే ఈ పసుపు కుంకుమను వివాహం సమయంలో వివాహ ఆహ్వాన పత్రికలకు అనగా శుభలేఖలకు కూడా రాస్తూ ఉంటారు. మొదట ప్రతి ఒక్క పెళ్లి శుభలేఖకు పసుపు కుంకుమ రాసి అందులో కొన్ని అక్షింతలు వేసి ఆ తర్వాత శుభలేఖలు పంచడం మొదలు పెడతారు. అయితే మరి శుభలేఖకు పసుపు కుంకుమ ఎందుకు రాస్తారు అన్న విషయం చాలామందికి తెలియదు.

ఆ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి జేష్టాదేవి అక్కచెల్లెళ్ళు. అయితే వీరిద్దరూ ఎక్కడ నివసించాలి అనే విషయం గురించి గొడవ పడతారు. అయితే ఇలా గొడవ పడుతున్న సమయంలో లక్ష్మీదేవి వెళ్లి సముద్రగర్భంలో దాక్కుంటుంది. సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి బయటకు రావాలని చెప్పిన జేష్టాదేవి అనంతరం తాను ఎక్కడ ఉండాలో కూడా తెలియజేసింది. ఈ క్రమంలోనే లక్ష్మీదేవి తాను పసుపు కుంకుమలలో కొలువై ఉంటానని తెలియజేస్తుంది. అందుకే పసుపు కుంకుమలను సాక్షాత్తూ లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తారు.

ఇలా ఎంతో పవిత్రమైన ఈ పసుపు కుంకుమలను వివాహ ఆహ్వాన పత్రికలకు రాయటం వల్ల స్వయంగా ఆ కార్యానికి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లని అర్థం. ఇలా పసుపు కుంకుమలు రాయటం వల్ల ఆ శుభ కార్యానికి లక్ష్మీదేవి ఆశీసులు ఉండటమే కాకుండా ఆ వధూవరులు కూడా ఎంతో సంతోషంగా ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే వివాహ ఆహ్వాన పత్రికలకు తప్పనిసరిగా పసుపు, కుంకుమను రాస్తారు.

Exit mobile version