Site icon HashtagU Telugu

Dwajasthambam: ధ్వజస్తంభం.. ఆలయాల ముందు ఎందుకు పెడతారో తెలుసా..?

Cropped (5)

Cropped (5)

దేవాలయానికి కొంత దూరం నుంచే కన్పించేది ధ్వజస్తంభం. ఇక ఆలయంలోకి అడుగుపెట్టగానే ముందుగా దర్శనమిచ్చేది ధ్వజస్తంభం. ఆలయంలో నెలకొని ఉన్న స్వామివారి కీర్తి పతాకను రెపరెపలాడిస్తూ, చిరుగంటల సవ్వడితో, తల ఎత్తి చూసేంత ఎత్తులో కనిపిస్తుంది ధ్వజస్తంభం. ధ్వజం అంటే పతాకం (జెండా). ధ్వజాన్ని కట్టి ఎగురవేసే స్తంభం కనుక దీనికి ఆ పేరు వచ్చింది. ఆలయపురుషునిలో ఉన్న షట్చక్రాలలో మొదటిదైన మూలాధారచక్రంపై ఇది ప్రతిష్ఠించబడుతుంది కనుకనే ఇది ఆలయానికి మూలస్తంభంగా పేర్కొంటారు.

ప్రాచీన యాగశాలలే కాలాంతరంలో ఆలయాలుగా రూపాంతరం చెందిన నేపథ్యంలో యూపస్తంభం ధ్వజస్తంభంగా రూపుదిద్దుకుంది. ఒక్కసారి ధ్వజస్తంభం ఆకారాన్ని జాగ్రత్తగా గమనిస్తే మనకు త్రిమూర్తుల సమిష్టితత్త్వం దర్శనమిస్తుంది. అలాగే ధ్వజస్తంభం పైభాగాన మూడు పలకలు, మూడు శిఖరాలు ఉంటాయి. దక్షిణ భారతమంతటా గోపురం దాటి లోపలికి రాగానే కనిపించే ధ్వజస్తంభం ఉత్తరాదిన మాత్రం ఆలయ విమానంపైనే స్థాపించబడుతుంది.

ఈ ధ్వజస్తంభం ఎత్తు ఎంత ఉండాలనేది నాలుగు రకాలుగా చెప్పబడింది. గోపురమంత ఎత్తు, ఆలయవిమానమంత ఎత్తు, శిఖరమంత ఎత్తు, ఆలయ పైకప్పు సమానంగా ఉండవచ్చు. ధ్వజస్తంభాన్ని చందనం, దేవదారు, ఎర్రచందనం, టేకు కొయ్యతో నిర్మిస్తారు. పూర్వం నాలుగుదిక్కులా నాలుగు ధ్వజస్తంభాలుండేవని శాసనాలు చెబుతున్నాయి. దేవాలయ ఆగమం ప్రకారం దేవాలయానికి వెళ్లలేనివారు ధ్వజస్తంభానికి నమస్కారం చేసిన దేవాలయంలోకి వెళ్లిన ఫలితం లభిస్తుంది. అంతేకాదు ధ్వజస్తంభం దగ్గర ప్రదక్షిణలు చేసేటప్పుడు నిలబడి అత్యంత శ్రద్ధతో మనస్సును భగవంతునితో లగ్నం చేసి కోరిన కోర్కిలు తప్పక ఫలిస్తాయని నమ్మకం.