Site icon HashtagU Telugu

Sankranti Bommala Koluvu 2023 : సంక్రాంతికి బొమ్మల కొలువు ఎందుకు పెడతారు?

Why Do You Put A Measure Of Toys On Sankranti

Why Do You Put A Measure Of Toys On Sankranti

సంక్రాంతి బొమ్మల కొలువు: సంక్రాంతి (Sankranti) వేళ పాటించే సంప్రదాయాల్లో బొమ్మల కొలువు ఒకటి. కొన్ని ప్రాంతాల్లో ఈ సంప్రదాయం లేకపోయినా మరికొన్ని చోట్ల బొమ్మల కొలువు తప్పనిసరిగా పెడతారు. బొమ్మల కొలువ ఎలా పేర్చాలంటే..

సంక్రాంతి (Sankranti) ఆనందానికి, ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి ప్రతీక. ‘సం’ అంటే మిక్కిలి, ‘క్రాంతి’ అంటే ప్రగతి పూర్వక మార్పు. ‘సంక్రమణం’ అంటే ‘చక్కగా క్రమించడం’ అంటే ‘నడవడం’ అని భావం. సూర్యుడు ఒకరాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించ డమే సంక్రాంతి. అలా నెలకొకసారి వచ్చే దానిని ‘మాస సంక్రాంతి’గా వ్యవహరిస్తారు. సర్వసాక్షి, సమస్త ప్రాణులకు జీవప్రదాత సూర్యభగవానుడు పుష్యమాసంలో మరకరాశిలో ప్రవేశించడమే మకర సంక్రాంతి. ఆనాడు సూర్యారాధనకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తారు. దక్షిణాయనానికి వీడ్కోలు పలుకుతూ ఉత్తరాయణానికి స్వాగతం పలుకుతారు. దక్షిణాయణం పితృదేవతలకు, ఉత్తరాయణం దేవతలకు ముఖ్యమని, కనుక ఉత్తరాయణాన్ని పుణ్యకాలమని చెబుతారు. దక్షిణాయనంలో మరణించిన వారికి ఉత్తమగతి ఉండదని, భీష్ముడు కురుక్షేత్రంలో దక్షిణాయనంలోనే అంపశయ్యపై ఒరిగినా ‘ఇచ్ఛా మరణం’ వరంతో ఉత్తరాయణం వరకు ప్రాణం నిలుపుకున్నది అందుకే అని చెబుతారు. ఈ పండుగకు సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాసంలో ఇళ్ళ ముందు రకరకాల రంగవల్లికలను తీర్చిదిద్దుతూ అమ్మాయిలు సంబరాల్లో మునిగి తేలుతారు. అలాగే భోగిరోజు సాయంత్రం పిల్లలకు భోగిపళ్లు పోస్తారు..అదే సమయంలో చేసే మరో ఉత్సవం బొమ్మల కొలువు.

బొమ్మల కొలువు అంటే ఇంట్లో ఉన్న బొమ్మలన్నిటినీ అలంకరించేయడం కాదు..వాటిని పేర్చేందుకు ఓ పద్ధతి ఉంటుంది. సాధారణంగా బొమ్మలను మూడు, ఐదు, తొమ్మిది వరుసలలో పేరుస్తారు. ఈ కొలువు పేర్చేముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే..భగవంతుడి దశావతారాల సూత్రాల ప్రకారం సృష్టి పరిణామ క్రమం, మానవుడి అభివృద్ధి క్రమం దృష్టిలో పెట్టుకుని వివిధ ప్రమాణాల్లో బొమ్మలు అమరుస్తారు

మొదటి మెట్టుమీద (కింద మెట్టు)

చిన్న చిన్న ఇళ్ల బొమ్మలు, గుడులు, గోపురాలు, పొలాలు, చెట్లు, పూలతీగలు… ప్రకృతితో నిండిన బొమ్మలు పేర్చాలి

రెండో మెట్టుపై

చేపలు, తాబేలు, నత్త, పీత, శంఖం సహా జలచరాలన్నీ ఈ మెట్టుపై పెట్టొచ్చు

మూడు, నాలుగు మెట్లపై

మూడు, నాలుగు మెట్లపై క్రిమికీటకాలు, భ్రమరాలకు సంబంధించిన బొమ్మలు

ఐదో మెట్టుపై

ఐదో మెట్టుపై జంతువులు, పక్షులకు సంబంధించిన బొమ్మలు పేర్చాలి

ఆరో మెట్టు

ఆరో మెట్టుపై మానవ రూపాలకు సంబంధించిన బొమ్మలు పేర్చాలి

ఏడో మెట్టుపై

ఏడో మెట్టుపై మహనీయుల బొమ్మలు పెట్టాలి

ఎనిమిదో మెట్టుపై

అష్టదిక్పాలకులు, నవగ్రహనాయకులు, పంచభూతాలకు సంబంధించిన బొమ్మలు పేర్చాలి

తొమ్మిదో మెట్టు (పైన మెట్టు)

అన్నిటి కన్నా ఉన్నతమైన తొమ్మిదో మెట్టుపై  త్రిమూర్తులు, లక్ష్మీ, సరస్వతి, పార్వతి బొమ్మలతో అలంకరించాలి

అంటే దేవుడి బొమ్మలన్న పైన అలంకరించుకుని..మీ దగ్గరున్న మిగిలిన బొమ్మలను ఎలా పేర్చాలో ముందుగా నిర్ణయించుకోవాలి. సంతానభాగ్యం కోసం, పాడిపంటల కోసం, సుఖమయ కుటుంబజీవనం కోసం సంక్రాంతిలో బొమ్మల కొలువు పెడతారు. వినాయకుడితో, కుమారస్వామితో ఉన్న శివపార్వతుల బొమ్మ తప్పకుండా పెడతారు. పిల్లవాడిని ఎత్తుకున్న తల్లి బొమ్మ పెడతారు. భోగినాడు పెట్టి కనుమ రోజు వరకూ కొనసాగిస్తారు.

Also Read:  Godadevi : భగవంతుడి మనసు గెలిచిన ఓ భక్తురాలి ప్రేమ కథ