Site icon HashtagU Telugu

Coconut- Banana: గుడికి కొబ్బరికాయ అరటి పండ్లు మాత్రమే తీసుకొని వెళ్లడం వెనుక ఉన్న ఆంతర్యం ఇదే?

Coconut Banana

Coconut Banana

మామూలుగా ఆలయానికి వెళ్ళినప్పుడు ఎక్కువగా కొబ్బరికాయ అరటిపండు మాత్రమే తీసుకుని వెళుతూ ఉంటారు. అంతేకాకుండా ఆ రెండింటిని దేవుళ్ళకు నైవేద్యంగా పెడుతూ ఉంటారు. మిగిలిన పండ్లు అలా తక్కువగా తీసుకుని వెళుతూ ఉంటారు. ఎందుకంటే అరటిపండు కొబ్బరికాయ తప్ప మిగిలిన పండ్లు అన్నీ కూడా ఆరగించి వాటిలోని విత్తనాలను పారేస్తాం. తిని పడేయడం వల్ల ఆ విత్తనాలు ఎంగిలి అవుతాయి. వాటి నుంచి మొక్క వస్తుంది. మళ్లీ ఫలాలు అందిస్తుంది. అంటే మనం తిని పడేసిన విత్తనాల వల్ల వచ్చిన ఫలాన్ని ఎంగిలి ఫలంగా భావించి భగవంతుడికి నివేదించే విషయంలో కాస్త ఆలోచిస్తారు. మాములుగా అరటిపండుకి బీజం ఉండదు.

ఒక అరటి చెట్టు నాటితే ఆ చుట్టూ వందల పిలకలు వస్తాయి కానీ అరటి పండు నాటితే అరటి చెట్టు రాదు. అందుకే ఎంగిలి కాని ఫలం అరటిపండు. దీన్ని పూర్ణఫలం అని కూడా అంటారు. ఇక కొబ్బరి కాయ కూడా అంతే. కొబ్బరి నాటితే కొబ్బరి మొక్క రాదు. మనం తిని పడేసిన పెంకు నుంచి ముందే వలిచిన పీచు నుంచి కొబ్బరి మొక్క వచ్చే అవకాశమే లేదు. అయితే మన సంస్కృతి కేవలం భౌతికం మాత్రమే కాదు ఆధ్యాత్మికం కూడా. కొబ్బరికాయలో జీవిత సత్యం దాగి ఉంది. అదేమిటంటే కొబ్బరికాయను మానవ శరీరానికి ప్రతీకగా చెబుతారు. పీచుని అహంకారానికి, లోపల ఉన్న కొబ్బరిని మనసుకి, నీటిని నిర్మలత్వానికి సంకేతంగా తెలియచేసారు.

మనిషిలోని అహంకారాన్ని విడిచిపెట్టి, నిర్మలంగా తనని తాను భగవంతునికి సమర్పించుకుంటున్నాననే భావన కలగడం కోసమే కొబ్బరి కాయను కొట్టడం వెనుక పరమార్ధం. చాలామంది దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే ఏదో అరిష్టం జరుగుతుందని భయపడుతూ ఉంటారు. కానీ అవన్నీ అపనమ్మకాలు మాత్రమే. ఇక టెంకాయ గుండ్రంగా పగిలితే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయని, టెంకాయలో పువ్వు కనపడితే అది మీకు శుభాలు తీసుకొస్తుందని విశ్వశిస్తారు. నిలువుగా పగిలితే మీ ఇంట్లో వారికి త్వరలో సంతానం కలుగుతుందని సూచన అని చెబుతారు. అందుకే కుళ్లినా, ఎలా పగిలినా ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. కొబ్బరి పగిలితే కనిపించేంత స్వచ్ఛమైన మనసుతో దేవుడిని ప్రార్థిస్తే చాలు అని చెబుతున్నారు పండితులు.

Exit mobile version