Mango Leaves: శుభకార్యాలకు మామిడి తోరణాలు కట్టడం వెనుక ఉన్న ఆంతర్యం ఇదే?

మామూలుగా హిందువులు ఎటువంటి శుభకార్యం అనగా పండుగలు, పెళ్లిళ్లు, పేరంటాలు పుట్టినరోజు వేడుకలు ఇలా ఎటువంటి శుభకార్యం జరిగినా కూడా మామిడాకుల తో

  • Written By:
  • Publish Date - July 17, 2023 / 08:00 PM IST

మామూలుగా హిందువులు ఎటువంటి శుభకార్యం అనగా పండుగలు, పెళ్లిళ్లు, పేరంటాలు పుట్టినరోజు వేడుకలు ఇలా ఎటువంటి శుభకార్యం జరిగినా కూడా మామిడాకుల తోరణాలు కడుతూ ఉంటారు. అయితే పండుగలకు శుభకార్యాలకు కేవలం మామిడి ఆకులు మాత్రమే ఎందుకు తోరణాలుగా కడతారు అన్న విషయం చాలామందికి తెలియదు. మరి మామిడి ఆకులను ఎందుకు ఉపయోగిస్తారు?దాని వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మామిడి, రావి, జువ్వి, మర్రి, ఉత్తరేణి- ఆకులను పంచపల్లవాలని పిలుస్తారు. వీటిని శుభకార్యాల్లో ఉపయోగిస్తారు. అయితే తోరణాలుగా మాత్రం మామిడాకులనే వినియోగిస్తారు.

పండుగలు, వేడుకలు, వివాహాది సమయాల్లో గుమ్మానికి మామిడాకులను కట్టడం శుభసూచకంగా భావిస్తారు. యజ్ఞ యాగాదుల్లో మామిడాకులతో కూడిన ధ్వజారోహణం చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. పూజా కలశంలోనూ మామిడాకులను ఉపయోగిస్తుంటారు. ప్ర‌తి ఇంట్లో శుభ‌కార్యాలు, పండుగ స‌మ‌యాల్లో గ‌డ‌పల‌కు ప‌సుపు, కుంకుమ రాసి బొట్టు పెడతారు. అలాగే గుమ్మాల‌పై ప‌చ్చ‌టి మామిడి తోర‌ణాలతో అలంక‌రిస్తారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఇంట్లోకి ధ‌నల‌క్ష్మితో పాటు స‌క‌ల దేవ‌తలు వ‌స్తార‌ని నమ్మకం. ఫ‌లితంగా ఆ ఇంట్లోకి ధనం వ‌చ్చి చేర‌డంతో ఆర్థిక స‌మ‌స్య‌లు పోతాయ‌ని విశ్వ‌సిస్తారు. ఇంటి అలంక‌ర‌ణ ఎంత బాగుంటే అంత‌లా దేవుళ్లు ఇంట్లోకి వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయ‌ని చెబుతారు. మామిడి ప్రేమ, సంపద, సంతానాభివృద్ధికి సంకేతమ‌ని రామాయణ, భారతాల్లో ప్రస్తావించారు. మన పురాణాల్లో కూడా మామిడాకులకు ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంది.

మామిడి చెట్టు కోరికలను తీరుస్తుందనీ, భక్తి ప్రేమకు సంకేతమని భారతీయ పురాణాలలో తెలిపారు . ఇది సృష్టికర్త బ్రహ్మకు అర్పించిన వృక్షం. దీని పువ్వులు చంద్రునికి అర్పించబడ్డాయి. కాళిదాసు ఈ చెట్టును మన్మథుడి పంచబాణాలలో ఒకటిగా వర్ణించాడు. శివపార్వతుల కల్యాణం మామిడి చెట్టు కిందనే జరిగిందనీ, అందుకే శుభకార్యాలలో మామిడి ఆకులను ఉపయోగిస్తారని, చివరికి అంత్యక్రియలో మామిడి కట్టెను ఉపయోగిస్తారని చెపుతారు. ప్రాచీన కాలంలో వివాహానికి ముందు వరుడు మామిడి చెట్టుకు పసుపు, కుంకుమ రాసి ప్రదక్షిణం చేసి ఆ చెట్టును ఆలింగనం చేసుకునేవాడట. మామిడి ఆకులు నిద్రలేమిని పోగొడతాయి అని, పండుగల వేళ పని ఒత్తిడిని, శ్రమను తగ్గేలా చేస్తాయని, అంతే కాదు మామిడి కోరికలు నెరవేరేలా చేస్తుందని భావిస్తారు.