ఈ ఏడాది నవరాత్రి వేడుకలు అక్టోబర్ 3, 2024 గురువారం నుండి ప్రారంభం అయ్యాయి. ఇక అక్టోబర్ 12 దసరా పండుగతో ఈ వేడుకలు ముగుస్తాయి. ఇక నేడు అమ్మవారు శైలపుత్రి అలంకరణలో దర్శనం ఇవ్వనున్నారు. ఇక నేటినుంచి దాదాపు పది రోజులపాటు ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ నవరాత్రులలో తొమ్మిది రోజులు దుర్గాదేవిని వివిధ రూపాల్లో పూజించే సంప్రదాయం కూడా ఉంది. నవరాత్రులలో దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి, భక్తులు ఆచారాలతో పూజలు చేసి ఉపవాసం కూడా ఉంటారు. నవరాత్రి వ్రతాన్ని నిబంధనల ప్రకారం మాత్రమే పాటించాలి. హిందూ గ్రంధాల ప్రకారం ఉపవాస నియమాలను పాటించడం చాలా ముఖ్యం అని చెబుతున్నారు.
నవరాత్రి ఉపవాసం కొందరు తొమ్మిది రోజులు ఉంటే మరికొందరు మాత్రం చివరి రెండు రోజులు మాత్రమే ఉంటారు. తొమ్మిది రోజులు ప్రజలు ఖిచ్డీ, పండ్లు, ఇతర ఉపవాస వస్తువులను తీసుకుంటారు. అయితే ఇది కాకుండా ఉపవాసం పాటించడానికి కొన్ని నియమాలు మత గ్రంథాలలో వివరించారు. నవరాత్రి వ్రతంలో ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నవరాత్రి వ్రతం పాటించే వ్యక్తి బ్రహ్మచర్యాన్ని పాటించాలి. మంచం మీద కాకుండా నేల మీద నిద్రించడం మంచిది. సుఖాలు, సౌకర్యాలు పక్కన పెట్టేయాలని చెబుతున్నారు. అలాగే నవరాత్రుల తొమ్మిది రోజులలో అబద్ధాలు ఆడకూడదట. కోపానికి దూరంగా ఉండాలి. ఎవరిని దూషించకూడదు. అనవసరమైన మాటలు ఉపయోగించి ఎదుటి వారి మనసు బాధపెట్టకూడదని చెబుతున్నారు.
ఈ తొమ్మిది రోజులలో స్త్రీని లేదా అమ్మాయిని ఏ విధంగానూ అవమానించకూడదట. ఇంట్లో ఆఖండ జ్యోతిని వెలిగించి అది ఎప్పుడూ ఆరిపోకుండా చూసుకోవాలని చెబుతున్నారు. అలాగే సాధారణంగా ప్రజలు రోజుకు రెండుసార్లు ఆహారం కడుపునిండా తిన్న తర్వాత ఉపవాసం పాటిస్తారు. కానీ అలా చేయకూడదు. ఇలా చేసే ఉపవాసం ఎటువంటి ఫలితాలను ఇవ్వదట. ఉపవాసం భక్తి శ్రద్దలతో నియమ నిష్టలతో మాత్రమే చేయాలని చెబుతున్నారు. నవరాత్రుల తొమ్మిది రోజులలో ఉపవాసం ఉన్న వ్యక్తి గుట్కా, పాన్, మసాలా ఆహారం లేదా మాంసం, మద్యం తీసుకోకూడదట. ఉపవాస సమయంలో పదే పదే నీరు త్రాగడం మానుకోవాలి. ఉల్లి, వెల్లుల్లి పొరపాటున కూడా ఉపయోగించకూడదని చెబుతున్నారు. ఇవి తీసుకోవడం వల్ల మనసు చంచలంగా మారుతుంది. అందుకే వీటిని ఉపవాసం సమయంలో దూరంగా ఉంచుతారు. తరుచుగా నీరు కూడా తీసుకోకూడదని చెబుతున్నారు. నవరాత్రి వ్రతాన్ని మధ్యలో విరమించకూడదట.
ఏదైనా తీవ్రమైన సమస్య లేదా అనారోగ్యం బాధిస్తే దుర్గాదేవికి నుండి క్షమాపణ కోరడం ద్వారా మాత్రమే ఉపవాసం విరమించవచ్చట. మీరు సప్తమి, అష్టమి లేదా నవమి తిథిలలో నవరాత్రి వ్రతాన్ని విరమిస్తే మీరు తప్పనిసరిగా ఉపవాసం ఉద్యాపన చేసి, తొమ్మిది మంది అమ్మాయిలకు అన్నదానం చేసి దక్షిణ ఇచ్చి వారిని సంతోషంగా పంపించాలి. ఇలా చేస్తేనే ఉపవాస ఫలాలు లభిస్తాయని చెబుతున్నారు. నవరాత్రి ఉపవాసం ఉంటున్న వాళ్ళు గడ్డం, మీసం, గోర్లు, వెంట్రుకలు వంటివి కత్తిరించడం వంటివి చేయకూడదట. నల్లని రంగు దుస్తులు ధరించి దుర్గామాతను పూజించకూడదు. ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు మాత్రమే దరించాలని చెబుతున్నారు.