Magha Masam మాఘమాసం ప్రతియేటా సాధారణంగా జనవరి, ఫిబ్రవరి నెలల మధ్య వస్తుంది. హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం 11వ నెల. ఇది ఉత్తరాయణంలో వస్తుంది. ఈ మాఘమాసాన్ని ఎంతో విశిష్టమైనదిగా, పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మాఘమాసంలో ఆచరించే నదీస్నానం, జపం, దానధర్మం, పురాణ పఠనం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో మాఘమాసం 2026 ప్రారంభతేదీ, ముగింపు తేదీ మరియు విశిష్టత గురించి తెలుసుకుందాం.
చంద్రుడు మఘ నక్షత్రంలో ఉన్నప్పుడు పౌర్ణమి వచ్చే మాసం మాఘమాసం (Magha Masam 2026). ఇక్కడ మఘం అంటే యజ్ఞం అని అర్థం. అఘం అనే పదానికి సంస్కృతంలో పాపం అని అర్థం. ఇక మాఘం అంటే పాపాలను నశింపజేసేది. దక్షిణాయణంలో కార్తీక మాసం ఎంత పవిత్రమైనదో.. ఉత్తరాయణంలో మాఘమాసానికి అంతే విశిష్టత ఉంది. ఈ మాఘమాసంలో సూర్యుడు మకరరాశిలో (Sun Transit in Capricorn 2026) సంచరిస్తాడు. ఈ మాసంలో ప్రప్రథమం చేయాల్సింది నదీ స్నానం. ఈ నదీ స్నానంతో పాపాలు హరిస్తాయని పురాణోక్తి.
అలాగే పురాణ పఠనం, జపం, తర్పణం, దానధర్మాలు, హోమం వంటివి చేయడం పుణ్యప్రదమని పద్మపురాణం చెబుతోంది. చలికాలం ముగిసిపోయి.. వసంతం ప్రారంభానికి ముందు వచ్చే ఈ మాఘమాసం శరీరానికి, మనసుకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తుందని నమ్మకం. ముఖ్యంగా ఈ మాఘమాసంలో నువ్వులు, వస్త్రాలు, అన్నదానం చేయడం ఎంతో శ్రేష్ఠమని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా మాఘమాసంలో మాఘపురాణం చదవడం వల్ల సమస్త పాపాలు తొలగుతాయని విశ్వాసం. అలాగే ఆధ్యాత్మిక చింతనకు ఈ మాఘమాసం ఎంతో విశిష్టమైనది.
మాఘమాసం 2026 ప్రారంభం, ముగింపు తేదీలు
ఈ ఏడాది మాఘమాసం 2026 జనవరి 19వ తేదీన ప్రారంభమవుతుంది. అంటే జనవరి 19వ తేదీ సోమవారం మాఘ శుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభమవుతుంది. అలాగే 2026 ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం మాఘ బహుళ అమావాస్య తిథితో ఈ మాఘమాసం పూర్తవుతుంది. ఇక ఉత్తరాయణంలో ముఖ్యమైన పండుగలన్నీ ఈ మాఘమాసంలోనే వస్తాయి. ఈ మాసంలో వసంత పంచమి 2026, రథ సప్తమి 2026 పండుగతో పాటు.. మహాశివరాత్రి 2026 వంటి పుణ్య పర్వదినాలు ఉన్నాయి. ఈ మాసంలో శ్రీమహావిష్ణువు, సూర్య భగవానుడితో పాటు లింగోద్భవం కూడా ఈ నెలలోనే ఏర్పడంటంతో శివుడికి కూడా ఈ మాసం అత్యంత కీలకం. ఈ మాఘమాసంలో వచ్చే ఆదివారాలు (Sundays) చాలా విశిష్టమైనవి. ఈరోజున మహిళలు తరిగిన కూరలు తినరు. అలాగే ఈ నెలలో మాఘ గౌరి నోము, మాఘ ఆదివారం నోము వంటివి విశేషంగా ఆచరిస్తారు.
